అరవైలో ఇరవై!

Senior Citizens helping hands to their fellow Senior Citizens - Sakshi

సాటి పండుటాకులకు సాయపడుతున్న సీనియర్‌ సిటిజన్లు 

చెన్నై ఉధవి సంస్థలో వలంటీర్లూ వృద్ధులే 

కొందరు యువకులు పుట్టుకతోనే వృద్ధులేమో కానీ.. ఈ వృద్ధుల్లో మాత్రం వయసు మీదపడినా ఉత్సాహమే ఉత్సాహం. కృష్ణా రామా అంటూ ఓ దగ్గర కూర్చోవడం వాళ్ల చేత కాదు. సాటి పండుటాకుల్లో మనో స్థైర్యాన్ని నింపడమే వారి పని. అదే వాళ్లకు కొండంత బలం. అక్టోబర్‌ 1 ఇంటర్నేషనల్‌ డే ఫర్‌ ఓల్డర్‌ పర్సన్స్‌గా ఐక్యరాజ్య సమితి జరుపుతోంది. భారత్‌లో వృద్ధుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో వృద్ధులంటే ఇలా ఉండాలి అంటూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. 

చెన్నైకి చెందిన ఉధవి అనే స్వచ్ఛంద సంస్థ. వృద్ధాప్యంలో ఒంటరితనంతో బాధపడే వారిని ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఐదేళ్ల కింద మొదలైంది. అక్కడ వలంటీర్లంతా 75 ఏళ్ల పైబడిన వారే ఉండటం ఈ సంస్థ ప్రత్యేకత. వృద్ధులైతేనే సాటి వారి కష్టాలు అర్థం చేసుకుంటారన్న ఉద్దేశంతో సీనియర్‌ సిటిజన్లనే వలంటీర్లుగా నియమించింది ఆ సంస్థ. ఇప్పుడు వారే ఒక సైన్యంగా మారారు. తమని తాము ఉత్తేజంగా ఉంచడమే కాదు, ఆపదలో ఉన్న తోటివారికి అండదండగా ఉంటున్నారు. అటు నుంచి ఫోన్‌ కాల్‌ ఒకటి వస్తుంది. ఏడుపు, బాధిస్తున్న ఒంటరితనం, ఏం చేయాలో తెలియని నిస్సహాయత, ఒక్కోసారి ఆత్మహత్యవైపు ప్రేరేపించే ఆలోచనలు. అయినవాళ్లు పట్టించుకోకపోతే ఆ బాధ అంతా ఇంతా కాదు.

ఆ బాధ పంచుకోవడానికి ఒకరు కావాలి. అలాంటి ఫోన్‌ రాగానే 76 ఏళ్ల వయసున్న సుందర గోపాలన్‌ అనే వలంటీర్‌ రెక్కలు కట్టుకొని ఆ బాధితుల దగ్గరకి వెళ్లిపోతారు. వాళ్లతో కబుర్లు చెబుతారు. నవ్విస్తారు. కాసేపు పార్కుకి తీసుకెళ్లి చల్లగాలిలో వాకింగ్‌ చేస్తారు. 76 ఏళ్ల వయసులో కూడా తాను ఎంత హాయిగా ఉన్నానో వాళ్లకి చెబుతారు. అలా ఏదో ఒక్కసారి కాదు. వారంలో రెండు, మూడు సార్లు వాళ్ల దగ్గరికి వెళ్లి వస్తుంటారు. మళ్లీ వారి ముఖం మీద చిరునవ్వు వచ్చేవరకు కౌన్సెలింగ్‌ ఇస్తారు. ‘ఒంటరితనం మనిషిని చంపేస్తుంది. నా భర్త చనిపోయినప్పుడు అదెంత బాధిస్తుందో నాకు తెలిసొచ్చింది. అలాంటి బాధలో ఉన్నవారిని ఎలా బయటకు తీసుకురావాలో నాకు బాగా తెలుసు. జీవితం ముందుకు వెళ్లేలా వారికి అన్ని విధాలుగా సాయపడగలను’ అని సుందర గోపాలన్‌ వివరించారు. 

వేదవల్లి శ్రీనివాస గోపాలన్‌. ఆమె వయసు 85. ఈ వయసులో కూడా స్వెట్టర్లు అల్లుతారు. హ్యాండ్‌బ్యాగ్స్‌ తయారు చేస్తారు. వాటిని ఇరుగుపొరుగు వాళ్లకి, స్నేహితులకి అమ్మి ఆ వచ్చిన డబ్బుని కష్టాల్లో ఉన్న వృద్ధులకి ఇస్తూ ఉంటారు. ‘మా అమ్మ ఎప్పుడు చూసినా అదే పనిలో ఉంటుంది. తనని తాను కష్టపెట్టుకుంటుంది. ఆ పని వద్దన్నా వినిపించుకోదు. ఎంత ఎక్కువ మందికి సాయపడితే తనకు అంత తృప్తి అంటుంది. కానీ మాకు ఆమె ఆరోగ్యం ఏమైపోతుందోనన్న ఆందోళన ఉంటుంది‘అని వేదవల్లి కుమార్తె కృష్ణవేణి చెప్పుకొచ్చారు.
 
ఉధవి సంస్థ వ్యవస్థాపకురాలు సబితా రాధాకృష్ణన్‌. ఆమె వయసు 75 ఏళ్లు. అయినవాళ్లు ఎవరూ లేక ఒంటరితనంతో బాధపడే వృద్ధుల్లో కొత్త ఉత్తేజాన్ని నింపడం కోసమే ఆమె ఈ సంస్థ స్థాపించారు. చిన్న చిన్న అవసరాలైనా నేనున్నానంటూ తీరుస్తారు. గుళ్లు గోపురాలు తిప్పడం, షాపింగ్‌కు తోడు వెళ్లడం, రెస్టారెంట్లకి తీసుకువెళ్లడం, బ్యాంకు పనుల్లో సాయపడడం వంటివి చేస్తూ ఉంటారు. ‘సీనియర్‌ సిటిజన్ల దైనందిన కార్యక్రమాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ వారి ఒంటరితనాన్ని పోగొట్టడమే మా సంస్థ ప్రధాన ఉద్దేశం. వలంటీర్లు అదే వయసు వారు ఉంటే వారి మధ్య వేవ్‌ లెంగ్త్‌ బాగా ఉంటుందని సీనియర్‌సిటిజన్లనే వలంటీర్లుగా నియమిస్తున్నాం‘అని సబిత వెల్లడించారు.

ఇలాంటి సంస్థల అవసరం ఉంది  
మన దేశంలో సీనియర్‌ సిటిజన్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. జీవన ప్రమాణాలు మెరుగుపడడంతో వారి సంఖ్య పెరిగిపోతోంది.  

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top