లోకాయుక్త పంజా | Searches at 32 places across the state | Sakshi
Sakshi News home page

లోకాయుక్త పంజా

Published Sat, Dec 21 2013 2:37 AM | Last Updated on Sat, Mar 9 2019 3:50 PM

రాష్ట్ర లోకాయుక్త మళ్లీ పంజా విసిరింది. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఏక కాలంలో దాడులు నిర్వహించి, పది మంది అవినీతి అధికారుల భరతం పట్టింది.

= రాష్ట్ర వ్యాప్తంగా 32 చోట్ల సోదాలు
 = 10 మంది అధికారుల అవినీతి గుట్టు రట్టు
 = ప్రకాశం జిల్లాలోనూ తనిఖీలు

 
 బెంగళూరు, న్యూస్‌లైన్ : రాష్ట్ర లోకాయుక్త మళ్లీ పంజా విసిరింది. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఏక కాలంలో దాడులు నిర్వహించి, పది మంది అవినీతి అధికారుల భరతం పట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా గిద్దలూరులోనూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ. 15.5 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను గుర్తించినట్లు లోకాయుక్త అదనపు డీజీపీ హెచ్‌ఎన్ సత్యనారాయణరావు తెలిపారు. బెంగళూరు, మండ్య, బళ్లారి, తుమకూరు, చిత్రదుర్గ, కుందాపుర, ధార్వాడ, ఉడిపి, కొప్పళ, ఉత్తర కన్నడ, బీజాపుర, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలు సహా 32 చోట్ల సోదాలు నిర్వహించినట్లు  వివరించారు.
 
 = నరేంద్రకుమార్, బీడీఏ సర్వేయర్, బెంగళూరు :
 బెంగళూరు నగరంలో శ్రీమంతులు నివాసం ఉండే సదాశివనగరలో కళ్లు చెదిరే నాలుగు అంతస్తుల భవనాన్ని నిర్మించాడు. ఇంటి చుట్టూ ఉన్న పెద్ద తోటను చూసి లోకాయుక్త అధికారులు ముక్కున వేలేసుకున్నారు. రూ. 3.33 కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించారు.
 
 = ప్రసన్న కుమార్, రెవెన్యూ శాఖ సీనియర్ అధికారి, బీబీఎంపీ, బెంగళూరు :
 బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్‌లో నివాసం ఉంది. ఇంటితో పాటు కార్యాలయంలో సోదాలు చేసి విలువైన డాక్యుమెంట్లు, పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ ఆస్తుల విలువ రూ.52.33 లక్షలని లెక్కగట్టారు.
 
 = సుబ్రహ్మణ్యరెడ్డి, అసిస్టెంట్ ఇంజినీరు, బళ్లారి  :
 బళ్లారిలోని ల్యాండ్ ఆర్మీ కార్పొరేషన్‌లో అసిస్టెంట్ ఇంజినీరు.  సత్యనారాయణపేటలోని కంటోన్మెంట్‌లో నివాసం ఉంటున్నారు. అనేక విలువైన పత్రాలు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో కూడా రూ.కోట్ల విలువైన ఆస్తులు కొనుగోలు చేశారని లోకాయుక్తకు ఫిర్యాదులు అందాయి. అక్రమ ఆస్తుల విలువ రూ.2.17 కోట్లు.
 
 = డాక్టర్ వీఎస్ నందీశ్, మండ్య మెడికల్ కాలేజ్ చీఫ్ సర్జన్, మండ్య :
 మండ్యలోని అశోక్‌నగరలో నివాసం ఉంటున్నారు. నివాసంతో పాటు మళవళ్లి తాలూకా వీరాజపురలోని ఫాం హౌస్‌లో సోదాలు నిర్వహించారు. ఆయన నిర్వహిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రిలోనూ సోదాలు జరిగాయి. విలువైన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ ఆస్తుల విలువ రూ.2.56 కోట్లుగా తేల్చారు.
 
 = ఎం. ఉమేష్, వ్యవసాయ సహకార సంఘం కార్యదర్శి, గుబ్బి, తుమకూరు జిల్లా :
 ఉమేష్‌కు చెందిన రెండు ఇళ్లు, కార్యాలయం, వ్యవసాయ క్షేత్రంలోని ఇంటిలో సోదాలు జరిగాయి. వ్యవసాయ క్షేత్రంలో ఒక ట్రాక్టర్, కారును సీజ్ చేశారు. అక్రమ ఆస్తుల విలువ రూ.99.18 లక్షలని తేల్చారు.
 
 = ఆంథోని కే. కుంజునాథ్, బెస్కాం జేఈ, సిద్ధాపుర, ఉత్తర కన్నడ జిల్లా :సిద్ధాపురతో పాటు ఆ తాలుకాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న  ఇండ్లు, కార్యాలయం, ఫ్యాక్టరీలలో సోదాలు జరిగాయి. విలువైన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ ఆస్తుల విలువ రూ.1.86 కోట్లకు పైగానే ఉన్నట్లు తేలింది.
 
 = ఎం.నారాయణ కార్వి, ఏఈఈ, కుందాపుర, ఉడిపి జిల్లా :    ఇండ్లు, కార్యాలయాలపై సోదాలు జరిగాయి. ఆదాయానికి మించి రూ.1.70 కోట్ల విలువైన ఆస్తిని కలిగి ఉన్నట్లు గుర్తించారు.
 
 = మూడల గిరియప్ప, జిల్లా నిర్మితి కేంద్ర అధికారి, చిత్రదుర్గ :  ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. రూ.83.80 లక్షల అక్రమ ఆస్తులు బహిర్గతమయ్యాయి.
 
 = బసవరాజ్, ప్రజా పనుల శాఖ ఏఈఈ, కొప్పళ :  ఇంటిలో సోదాలు నిర్వహించిన అధికారులు విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి రూ.1.14 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తేలింది.
 
 = మంజునాథ గుండప్ప, కుందగుళ డిప్యూటీ తహశీల్దార్, బీజాపుర : ఇంటిలో సోదాలు నిర్వహించి విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. రూ.40.64 లక్షల అక్రమ ఆస్తులు ఉన్నట్లు తేలింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement