
నేనూ.. ఓటు వేస్తా ప్లీజ్: ఎంపీ
ప్రతిష్టాత్మక భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి.
భువనేశ్వర్: ప్రతిష్టాత్మక భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలంటూ మయూర్‌భంజ్ లోక్‌సభ సభ్యుడు, బిజూ జనతా దళ్ అభ్యర్థి రామచంద్ర హంసదా అభ్యర్థించారు. నవదిగంత్ చిట్‌ఫండ్ సంస్థ మోసాల్లో నిందితుడైన ఆయనకు సీబీఐ దర్యాప్తు బృందం 2014వ సంవత్సరంలో అరెస్టు చేసింది. బెయిల్ మంజూరు చేసేందుకు న్యాయస్థానాలు నిరాకరించడంతో ఆయన స్థానిక ఝరపడా జైలులో ఖైదీగా కొనసాగుతున్నారు.
ఈ నేపథ్యంలో భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనుమతించాలని అభ్యర్థన పత్రాన్ని జైలు అధికారులకు సమర్పించారు. రామచంద్ర హంసదా దాఖలు చేసిన అభ్యర్థన పత్రాన్ని జైలువిభాగం అదనపు డీజీకి సిఫారసు చేసినట్లు జైల్ సూపరింటెండెంట్ రవీంద్రనాథ్ స్వంయి తెలిపారు. లోక్‌సభ స్పీకర్, పార్లమెంట్ ప్రిన్సిపల్ కార్యదర్శి వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు రామచంద్ర హంసదా అభ్యర్థన పట్ల తదుపరి కార్యాచరణ ఆధారపడి ఉందని జైల్ సూపరింటెండెంట్ తెలిపారు.