డిసెంబర్‌ 12న రజనీకాంత్‌ కొత్తపార్టీ?

డిసెంబర్‌ 12న రజనీకాంత్‌ కొత్తపార్టీ? - Sakshi


చెన్నై : తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ రంగప్రవేశానికి రంగం సిద్ధమైందా అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే రాజకీయాల్లోకి వస్తున్నట్లు సంకేతాలిచ్చిన ఆయన తన పుట్టినరోజు డిసెంబర్‌ 12న కొత్తపార్టీ ప్రకటించనున్నట్లు సమాచారం. రజనీకాంత్‌ ఇప్పటికే తన అభిమానులతో సుదీర్ఘంగా సమావేశమైన విషయం తెలిసిందే. ఈ భేటీలో కూడా అభిమానులు..రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రావాలంటూ విజ్ఞప్తి కూడా చేశారు. అయితే దేవుడు ఆదేశిస్తే తాను రాజకీయాల్లోకి వస్తానని ఆయన కూడా చెప్పారు.



కొద్ది రోజులుగా రజనీకాంత్‌ రాజకీయరంగ ప్రవేశం గురించి తమిళనాడులోనే కాకుండా దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోందని చెప్పవచ్చు. నిజానికి రజనీ రాజకీయ రచ్చ ఇప్పడిది కాదు.1995లోనే ప్రారంభమైంది. అప్పటి నుంచి రజనీకాంత్‌ క్రియా రాజకీయాల్లోకి రావాలనే ఓత్తిడి పెరుగుతూనే ఉంది. ఆయన కూడా కర్ర విరగ కూడదు పాము చావకూడదు అన్న చందాన ఆ దేవుడు ఆదేశిస్తే ఈ రజనీకాంత్‌ పాటిస్తాడు అంటూ వస్తున్నారు. ఇటీవల రజనీకాంత్‌ తన అభిమానులను కలుసుకున్న తరువాత ఆయన రాజకీయం సెగ మరింత పెరిగింది. అభిమానుల భేటీ అనంతరం రజనీకాంత్‌ రాజకీయ పార్టీ పెడతారంటూ ఆయన సోదరుడు కూడా ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో రజనీ పార్టీ పేరు, జెండా, ఎజెండాపై కసరత్తు జరుపుతున్నట్లు సమాచారం. పార్టీ నిర్మాణం ఎలా ఉండాలి? పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే దానిపై రజనీకాంత్‌...  బెంగళూరుకు చెందిన ఓ ఏజెన్సీ సేవలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.   తమిళనాడులోని ఓటింగ్‌ సరళిని అధ్యయనం చేయడం, ఓటర్లను ఆకట్టుకోవడానికి అవసరమైన అజెండాను రూపొందించుకోవడంలో ఈ ఏజెన్సీ సేవలందిస్తోంది.



మరోవైపు రజనీకాంత్‌, ఆయన సలహాదారులు పార్టీలోకి ప్రముఖ నేతల వలసలపై దృష్టి పెట్టారు. ఇతర పార్టీల్లోని పేరొందిన సీనియర్‌ రాజకీయ నాయకులను తన పార్టీలోకి తీసుకోవడం ద్వారా పార్టీని పటిష్టపరచాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఇలా రజనీ పార్టీలోకి జంప్‌ చేయబోతున్న ప్రముఖ నాయకుల్లో అన్నాడీఎంకేకు చెందిన పాండ్యరాజన్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top