అర్హులైన వారికి మాత్రమే ఉపాధి హామీ పథకం జాబ్ కార్డులు అందించాలని పీడీఓలకు జెడ్పీ సీఈఓ డీకే రవి సూచించారు. స్థానిక కన్నడ సాహిత్య పరిషత్...
అర్హులకు జాబ్‌కార్డులు అందించండి
Aug 9 2013 3:16 AM | Updated on Sep 1 2017 9:44 PM
గంగావతి, న్యూస్‌లైన్ : అర్హులైన వారికి మాత్రమే ఉపాధి హామీ పథకం జాబ్ కార్డులు అందించాలని పీడీఓలకు జెడ్పీ సీఈఓ డీకే రవి సూచించారు. స్థానిక కన్నడ సాహిత్య పరిషత్ భవన్‌లో గురువారం నిర్వహించిన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల పథకాల అమలుపై చర్చాగోష్టిలో ఆయన ప్రసంగించారు. శ్రీమంతులు, పేదలు అనే భేదభావం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ పథకం ద్వారా జాబ్ కార్డులు పొందేందుకు అర్హులని ప్రకటించారు.
గత ఏడాది ఉపాధి హామీ పథకం నిధులను సంపూర్ణంగా ఖర్చు చేసి వాటి వివరాలను జిల్లా పంచాయతీకి సమర్పించాల్సిందిగా గ్రామ పంచాయతీ పీడీఓలకు ఆదేశాలను జారీ చేశామన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా రూ.4500లు, ఇతర నిధుల ద్వారా రూ.4500లు కలిపి రూ.9000లు వ్యక్తిగత మరుగుదొడ్లకు మంజూరు చేశామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. మరుగుదొడ్ల నిర్మాణం గురించి జీపీఎస్ జరిగిన అనంతరమే నిధులు లబ్ధిదారులకు అందుతాయన్నారు. తాజాగా జీపీఎస్ చేసే అధికారాన్ని ఆయా గ్రామ పంచాయతీల పీడీఓలకే కల్పించామని ఆయన తెలిపారు.
ఉపాధి హామీ పథకం ద్వారా గత ఏడాది బాకీ ఉన్న సొమ్మును త్వరలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ సభ్యులు అమరేష్, పిల్లికొండయ్య, హేమలంకేష్, తాలూకా పంచాయతీ సభ్యులు వన్నూర్‌సాబ్, టీపీ ఈఓ ఎస్‌ఎన్.మట్టద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సభకు గ్రామ పంచాయతీ సభ్యులు, ప్రతి గ్రామం నుంచి ప్రముఖులు, ప్ర జలు హాజరయ్యారు.
Advertisement
Advertisement