పాల ఉత్పత్తిలో నంబర్ వన్ కావాలి | Sakshi
Sakshi News home page

పాల ఉత్పత్తిలో నంబర్ వన్ కావాలి

Published Sun, Feb 23 2014 3:21 AM

Production of milk is the number one

సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో పాల ఉత్పత్తి లక్ష్యం 60 లక్షల లీటర్లకు పెరగాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆకాంక్షించారు. బెంగళూరు-తుమకూరు రహదారిలోని నైస్ జంక్షన్ వద్ద ఉన్న నైస్ మైదానంలో శనివారం నిర్వహించిన నందిని పాలు ఉత్పత్తిదారుల బృహత్ సమావేశాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు. పాల ఉత్పత్తిలో గుజరాత్ ప్రథమ స్థానం, కర్ణాటక రెం డో స్థానాల్లో ఉన్నాయని గుర్తు చేశారు.

ప్రస్తుతం రోజూ 55 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతోందంటూ, 60 లక్షల లీటర్లకు పెంచడం ద్వారా తొలి స్థానంలో నిలవాలని రైతులకు సూచించారు. పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం అధ్యక్షుడుగా, పశు సంవర్ధక శాఖ మం త్రిగా పని చేసిన తనకు పశు పోషణ ఎంత కష్టమో తెలుసునని చెప్పారు. కర్ణాటక పాడి సమాఖ్య (కేఎంఎఫ్) ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నేడీ స్థాయికి ఎదిగిందని కొనియాడారు. సంస్థకున్న మంచి పేరును కాపాడుకోవాలని సూచించారు.

రైతులు తమ వినియోగానికి ఉంచుకుని మిగిలిన పాలను కేఎంఎఫ్‌కు పోయాలని కోరారు. రైతులకూ పౌష్టికత అవసరమన్నారు. విద్యార్థుల కోసం క్షీర భాగ్య పథకాన్ని అమలు చేయడం ద్వా రా కేఎంఎఫ్‌ను నష్టాల బారి నుంచి తప్పించామని ఆయన వెల్లడించారు. నటుడు పునీత్ రాజ్ కుమార్ మాట్లాడుతూ... కేఎంఎఫ్‌తో తమ కుటుంబానికి 15 ఏళ్ల అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. గతంలో తన తండ్రి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండానే కేఎంఎఫ్ బ్రాండ్ అయిన నందిని ఉత్పత్తుల కోసం ప్రచారం చేశారని తెలిపారు. తాను కూడా తండ్రి బాటలో పయనిస్తున్నానని చెప్పారు. ఇంత వ ుంది ప్రజల ఆశీర్వాదమే తనకు సంభావన అని పేర్కొన్నారు.

ఈ బృహత్ సమావేశంలో తనకు జరిగిన సన్మానాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటానని ఆయన చెప్పారు. కార్యక్రమంలో కేఎంఎఫ్ అధ్యక్షుడు జీ. సోమశేఖర రెడ్డి, ఎండీ ఏఎస్. ప్రేమనాథ్ ప్రభృతులు పాల్గొన్నారు. ఇదే సందర్భంలో గాలికుంటు వ్యాధి నియంత్రణపై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు చన్నపట్టణ తాలూకా కన్నమంగల వద్ద పశు ఆహారోత్పత్తి కేంద్రానికి శంకు స్థాపన చేశారు. నందిని ప్రత్యేక పాలును కూడా విడుదల చేశారు.
 

Advertisement
Advertisement