అమ్మకు తగ్గిన ఆదరణ

People Avoid Amma Canteen Food For Bad Quality in Tamil nadu - Sakshi

నాణ్యత కొరవడడమే కారణమా?

స్థానిక పనుల్లో అధికారులు  

క్యాంటీన్లలో విక్రయాలు అంతంత మాత్రమే

సాక్షి, చెన్నై: రాష్ట్ర రాజధాని నగరంలో పేదలకు చౌక ధరకే కడుపు నింపుతున్న ‘అమ్మ’ క్యాంటీన్లకు ఆదరణ తగ్గింది. ఇందుకు కారణం నాణ్యత కొరవడడమే అన్న సంకేతాలు వెలువడ్డాయి. అధికారులు స్థానిక ఎన్నికల పనుల బిజీలో ఉండడంతో క్యాంటీన్లపై దృష్టి పెట్టే వాళ్లు కరువయ్యారు. దీంతో నాణ్యత లేని ఆహార పదార్థాలను స్వీకరించేందుకు పేద ప్రజానీకం మొగ్గు చూపడం లేదు.చెన్నై మహానగరంలో స్టార్‌ హోటళ్ల మొదలు ఫుట్‌పాత్‌ టిఫిన్‌ సెంటర్ల వరకు కొదవ లేదన్న విషయం తెలిసిందే. వీధికి నాలుగైదు హోటళ్లు, ఫాస్టు ఫుడ్స్, బిర్యానీ సెంటర్లు, రోడ్డు సైడ్‌ దుకాణాలు దర్శనం ఇస్తుంటాయి. రోడ్‌ సైడ్‌ దుకాణాలు మినహా తక్కిన చోట్ల ధరలు సామాన్యుడికి భారమే. చెన్నై వంటి మహానగరంలో తక్కువ జీతానికి  పనిచేసే చిరుద్యోగులు, రోజూవారి కూలీలు, గుడిసెల్లో, రోడ్డు సైడ్‌లలో నివసించే వారు, మోత కార్మికులు, ఇలా పేద వర్గాలకు చౌక ధరకే కడుపు నింపాలన్న కాంక్షతో బృహత్తర పథకాన్ని అమ్మ జయలలిత 2013లో ప్రవేశ పెట్టారు. అమ్మ పేరుతో తొలుత చెన్నైలో నెలకొల్పిన క్యాంటీన్లు, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలకు విస్తరించి ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ చౌక ధరకే అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రుల్లో చపాతి వంటి వాటిని విక్రయిస్తూ వస్తున్నారు. లాభ నష్టాలతో సంబంధం లేకుండా, కేవలం పేదలకు కడుపు నింపడం లక్ష్యంగా నెలకొల్పిన ఈ క్యాంటీన్ల రూపంలో 2016 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేకు ఓట్ల వర్షం కురిశాయన్న విషయం జగమెరిగిన సత్యం.  ఇతర రాష్ట్రాలకే ఆదర్శంగా నిలిచిన ఈ పథకం ప్రస్తుతం పాలకులకు భారంగా మారినట్టుంది. 

కొరవడ్డ నాణ్యత....

అమ్మ జయలలిత మరణం తదుపరి పరిణామాలతో ఈ క్యాంటీన్లను నీరుగార్చే ప్రయత్నాలు సాగుతున్నాయన్న ఆరోపణలు బయలు దేరాయి. ఈక్యాంటీన్ల ద్వారా లాభ నష్టాలను బేరీజు వేసే పనిలో అధికారులు పడ్డట్టుగా సంకేతాలు వెలువడ్డాయి.చెన్నై నగరంలో రెండు వందల వార్డుల్లో ఈ క్యాంటీన్లు ఉన్నాయి. అలాగే, నగర శివార్లల్లోనూ ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ క్యాంటీన్లలో మూడు వేళల్లో ఆహార పదార్థాలను తయారు చేయడం, వంటి పనులకు రెండు షిఫ్టులుగా మహిళలు పనిచేస్తున్నారు. వీరి జీతాలు, నిర్వహణ, ఆహార పదార్థాల తయారీ అంటూ మొత్తంగా రూ. 120 కోట్లు ఖర్చు ఏడాదికి అవుతుండగా, కేవలం రూ. 30 కోట్ల మేరకు మాత్రం ఆదాయం వస్తున్నట్టుగా ఇటీవల లెక్కల్లో అధికారులు తేల్చారు. క్యాంటీన్లను బలోపేతం చేయాలంటే, మరింత నిధులు తప్పనిసరి కావడంతో, ఇందుకు తగ్గ నివేదిక ప్రభుత్వానికి కార్పొరేషన్‌ నుంచి వెళ్లినా, అక్కడి నుంచి స్పందన లేని దృష్ట్యా, ప్రస్తుతం నాణ్యత అన్నది కొరవడి ఉంది. అన్ని రకాల ఆహార పదార్థాల్లో నాణ్యత కొరవడడంతో పేదలు సైతం అటు వైపుగా వెళ్లడం మానేస్తున్నారు. దీంతో కొద్ది రోజులుగా క్యాంటీన్లలో తయారు చేసిన ఆహార పదార్థాలను రాత్రి వేళల్లో చెత్త కుండీల్లో వేయాల్సిన పరిస్థితి అనేక చోట్ల ఉన్నట్టు సమాచారం. నాణ్యత కొరవడం, విక్రయాలు గణనీయంగా తగ్గడం వెరసి ఇక, క్యాంటీన్లకు మంగళం పాడేనా అన్న చర్చకు తెరపైకి తెచ్చింది. కాగా స్థానిక ఎన్నికల పనుల బిజీలో కార్పొరేషన్‌ అధికారులు అందరూ బిజీగా ఉన్న దృష్ట్యా, ఇప్పట్లో క్యాంటీన్లపై దృష్టి పెట్టింది అనుమానమే.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top