ప్రతి రాజకీయవేత్తకు వారి జీవితమే ఒక పాఠంగా మారుతుందని, అయితే ఈ భావన పొం దేందుకు ఒక అధ్యయనం
చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రతి రాజకీయవేత్తకు వారి జీవితమే ఒక పాఠంగా మారుతుందని, అయితే ఈ భావన పొం దేందుకు ఒక అధ్యయనం అవసరమని ముఖ్యమంత్రి జయలలిత అన్నారు. మంత్రులు వైద్యలింగం, కామరాజ్, షణ్ముగనాథన్, ఎం. సుబ్రమణియన్, మాజీ మంత్రుల కుమారులు, కుమార్తెల వివాహ వేడుకలకు సీఎం జయలలిత హాజరయ్యారు. ఒకే వేదికపై నుంచి మొత్తం 14 జంటలు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాయి.
చెన్నై రాయపేటలోని వైఎమ్‌సీఏ మైదానంలో బుధవారం ఘనంగా ఏర్పాటు చేసిన భారీ వేదికపై వధూవరులకు సీఎం జయలలిత స్వయంగా తాళిబొట్టు అందజేసి మాంగల్యధారణ జరిపించారు. వివాహ మహోత్సవానికి హాజరైన పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆమె ప్రసంగిస్తూ తన సహజమైన అలవాటుగా పిట్టకథను చెప్పారు. ఒక ఇంటి యజమాని పిల్లిని పెంచుకుంటున్నాడు. ఆ పిల్లి ఎలుకను పట్టి దానితో చెలగాటం అడుతున్నప్పుడు ఎంతో ఆనందించాడు. అదే పిల్లి ఒకసారి చిలుకను, మరో పక్షిని పట్టుకుని వచ్చినపుడు యజమాని ఆవేదన చెందాడు. అదే పిల్లి పట్ల ఒకసారి ఆనందం, మరోసారి ఆక్రోశం ఏర్పడింది.
ఎలుకలు, పక్షులను పట్టుకోవడం పిల్లి నైజం అని అర్థం చేసుకుంటే అతనికి బాధ ఉండదని కథను ముగించారు. రాజకీయ జీవితం కూడా పిల్లి, యజమాని కథ లాంటిదేని అన్నారు. రాజకీయాలు ఎంతో ప్రమాదకరమైనవి, ఆ ప్రమాదాలను అధిగమించేందుకు ముందుగా శిక్షణ ఉండదు, ఎప్పటికప్పుడు నేర్చుకోవాల్సిందే అంటూ ఒక తండ్రి, కుమారుని కథను ఆమె వివరించారు. అందుకే ప్రతిరాజకీయ వేత్త జీవితంలో చోటుచేసుకున్న సంఘటనలను ఒక పాఠంగా భావించాలని వైర్యాగంతో కూడిన ప్రసంగం చేశారు.
అన్నాదురై అడుగుజాడల్లో అన్నాడీఎంకే:
అన్ని పార్టీలూ అన్నాదురైని తరచూ స్మరిస్తుంటాయి, అయితే ఆయన ఆదర్శాలను ఆకళింపుచేసుకుని ఆచరణలో పెట్టింది ఒక్క అన్నాడీఎంకే మాత్రమేనని జయలలిత అన్నారు. ప్రజల పట్ల, ప్రజా సంక్షేమం పట్ల చిత్తశుద్ధిలేని ప్రతిపక్ష పార్టీలు అన్నాడీఎంకే పాలనను చూసి సహించలేక పోతున్నాయని ఎద్దేవా చేశారు. అబద్ధాల ప్రచారంతో అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు తాపత్రయ పడుతున్నాయని విమర్శించారు.
అయితే ఆ అబద్ధాల ప్రచారాన్ని తిప్పికొట్టి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం లభించేలా పాటుపడాలని ఆమె కోరారు. ఏదైనా కృషితోనే సాధ్యం అవుతుంది, పార్టీని మరోసారి ప్రభుత్వం పీఠం కూర్చోబెట్టగల సామర్థ్యం కార్యకర్తలకు ఉందని అన్నారు. అన్నాడీఎంకేకు కార్యకర్తలు, అభిమానులే బలం, మీరు కాక మరెవరు సాధించిపెడతారు పార్టీ విజయాన్ని అంటూ ప్రశంసించారు. 14 జంటలకు తన చేతుల మీదుగా పెళ్లి జరిపించడం ఎంతో ఆనందంగా ఉందని, రాబోయే ఎన్నికల్లో అన్నాడీఎంకేకు ఈ వివాహ వేడుక ఒక శుభపరిణామం కాగలదని ఆమె ఆకాంక్షించారు.
ఎంకిపెళ్లి..సుబ్బి చావు:
‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది’ అనే చందంగా తయారైంది బుధవారం చెన్నై నగరంలో పరిస్థితి. సహజంగా అన్ని ప్రారంభోత్సవాలు, ఇతర కార్యక్రమాలను సచివాలయం నుంచే ప్రారంభించే సీఎం జయలలిత సామూహిక వివాహాలకు హజరయ్యేం దుకు గార్డెన్‌ను వీడి వచ్చారు. నలుగురు మంత్రులు, మరి కొందరు మాజీ మంత్రుల కుటుంబ సభ్యులతో కలిపి మొత్తం 14 మంది వధూవరులు, వారి బంధువులతో రాయపేట వైఎంసీఏ మైదానం భారీ వేదికగా మారింది.
సీఎం జయలలిత స్వయంగా వివాహాలకు హాజరుకావడంతో స్వాగత ద్వారాలు, ఫ్లెక్సీలతో నగరాన్ని అలంకరించారు. సీఎం, మంత్రులు కాన్వాయ్ రాకపోకలతో ట్రాఫిక్‌ను నిలిపివేశారు. వందలాది అధికార వాహనాలను సాగనంపేందుకు రోడ్లకు అడ్డంగా బ్యారికేడ్లను అమర్చి ట్రాఫిక్‌ను మళ్లించారు. ఆఫీసు వేళలు కావడంతో వేలాది వాహనాలు గంటల తరబడి ట్రాఫిక్‌లో నిలిచిపోయాయి. అన్నాశాలై, తేనాంపేట వంటి ప్రధాన కూడళ్లలో సైతం ట్రాఫిక్‌ను మళ్లించడంతో వాహనచోదకులు తీవ్ర అసహనానికి లోనయ్యారు.