అక్టోబర్‌లో తారస్థాయికి.. మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్‌!

By October Prevalence Of Corona Virus In Tamil Nadu Very High - Sakshi

రాష్ట్రంలో జూలై నాటికి 2.7 లక్షల కేసులు 

వైరస్‌ వ్యాప్తిపై ఎంజీఆర్‌ వర్సిటీ సర్వే 

నేడు కలెక్టర్లతో సీఎం సమావేశం

తమిళనాడులో అక్టోబర్‌ నాటికి కరోనా వైరస్‌ వ్యాప్తి తారాస్థాయికి చేరుకుంటుందని ఎంజీఆర్‌ యూనివర్సిటీ జరిపిన సర్వేలో తేలింది. జూలై నాటికి బాధితుల సంఖ్య 2.7 లక్షలు దాటవచ్చని అంచనా వేసింది.  

సాక్షి, చెన్నై: కరోనా వైరస్‌ ధాటికి ప్రజలు వణికిపోతున్నారు. ఇతర జిల్లాలతో పోలిస్తే చెన్నై నగరం అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తోంది. మార్చి 24వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన లాక్‌డౌన్‌ను నెలరోజుల క్రితం స్వల్పంగా సడలించారు. చెన్నైలో ఇంకా లాక్‌డౌన్‌ కొనసాగుతూనే ఉంది. అయినా వైరస్‌ వ్యాప్తికి అంతేలేకుండా పోతోంది. రోజు రోజుకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోవడమే గాని తగ్గుముఖం పట్టడం లేదు. వైరస్‌ వ్యాప్తి అదుపులోకి వస్తుందో లేదో ఎవరికీ అంతుబట్టడం లేదు. చెన్నైలో రోజుకు వెయ్యి మందికి పైగా బాధితులుగా మారిపోతున్నారు. ఒక్క చెన్నైలోనే 2.5 లక్షల ఇళ్లు ప్రభుత్వ పర్యవేక్షణ క్వారంటైన్లుగా ఉన్నాయని మంత్రి ఉదయకుమార్‌ మంగళవారం తెలిపారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా, ఆంక్షలు విధించినా ప్రజలు పాటించకపోవడంతో రాష్ట్రంలో వైరస్‌ వ్యాధిగ్రస్తుల సంఖ్య 62 వేలు దాటిపోయింది. ఇందులో 42 వేల మంది చెన్నైకి చెందిన వారు కావడం ఆందోళనకరంగా మారింది. చదవండి: 60 వేలు దాటిన కరోనా కేసులు.. మళ్లీ లాక్‌డౌన్‌

రాష్ట్రం మొత్తం మీద ఇప్పటివరకు 794 మంది ప్రాణాలు కోల్పోయారు. చెన్నైలో ఉండేందుకే ప్రజలు భయపడుతూ సుమారు 10 లక్షల మంది సొంతూళ్లకు వెళ్లిపోయారు. ఇతర జిల్లాల్లో సైతం పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. చెన్నై తరువాత మదురై, దిండుగల్లు, వేలూరు, కోయంబత్తూరు, సేలం, ఈరోడ్, కృష్ణగిరి, తిరుప్పూరు, తంజావూరు, తిరుచ్చిరాపల్లి, తిరునెల్వేలి, తూత్తుకూడి, నాగర్‌కోవిల్‌ జిల్లాల్లో వైరస్‌ కేసులు పెరిగిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా, జూలై 15వ తేదీ తరువాత రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 2.7 లక్షలను దాటే ప్రమాదం పొంచి ఉందని ఎంజీఆర్‌ యూనివర్సిటీ నిర్వహించిన సర్వేలో తేలింది. ఇందులో కేవలం చెన్నైలోనే 60 శాతం మంది వైరస్‌ బారిన పడుతారని సర్వే స్పష్టం చేసింది. చదవండి: మద్యం ప్రియులకు మరో శుభవార్త

అలాగే జూన్‌ చివరి నాటికి చెన్నైలో 71వేలు, రాష్ట్రమొత్తం మీద 1.2 లక్షల పాజిటివ్‌ కేసులు నమోదవుతాయని పేర్కొంది. జూలై 15వ తేదీ తరువాత 1.5 లక్షల మందికి వైరస్‌సోకే అవకాశం ఉంది. అలాగే జూలై 15వ తేదీనాటికి చెన్నైలో 1,600 మంది వైరస్‌తో మృత్యువాత పడే ప్రమాదం ఉంది. అక్టోబరు నాటికి వైరస్‌వ్యాప్తి తారస్థాయికి చేరుకోగలదని వర్సిటీ సర్వే అంచనావేసింది. విధిగా మాస్క్‌ ధరించడం, భౌతికదూరం పాటించడం ద్వారా మాత్రమే వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చని పేర్కొంది.

మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్‌..?  
రాష్ట్రంలో భయానకంగా మారిన వైరస్‌ కేసులకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్‌ దిశగా ఆలోచిస్తోందా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. చెన్నైలో కఠిన నిబంధనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయినా పాజిటివ్‌ కేసులో జోరుకు కళ్లెం పడలేదు. లాక్‌డౌన్‌ ఐదో దఫా సడలింపు ఈనెల 30వ తేదీతో ముగుస్తుండగా తదుపరి చర్యలపై సీఎం ఎడపాడి పళనిస్వామి బుధవారం ఉదయం 10 గంటలకు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం అవుతున్నారు. కలెక్టర్ల సూచనలను అనుసరించి జూలై 1వ తేదీ నుంచి రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. లేదా తీవ్రత కలిగిన చెన్నై, చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం, మధురై..ఈ ఐదు జిల్లాలకు సంపూర్ణ లాక్‌డౌన్‌ను పరిమితం చేయవచ్చని అంచనా.  చదవండి: కరోనా భయం.. మానవత్వాన్ని చంపేసింది

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top