
మంగళవారం అసెంబ్లీ వద్ద భద్రత
బొమ్మనహళ్లి: కేంద్ర ప్రభుత్వ కార్మిక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వామపక్ష, వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం భారత్‌బంద్‌కు పిలుపునివ్వగా, బంద్‌ను పాటించరాదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించడంతో ఏం జరగనుందా? అని ఉత్కంఠ ఏర్పడింది. ఈ బంద్‌కు కొన్ని కార్మిక సంఘాలు మద్దతునివ్వడం లేదని ప్రకటించాయి. అయితే మెజారిటీ సంఘాలు బంద్‌చేసి తీరాలని పట్టుదలతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో బంద్ ప్రశాంతంగా జరుగుతుందా.. లేదా? అని అంతటా అనుమానాలు కలుగుతున్నాయి. కొన్ని సంఘాలు బంద్‌లో పాల్గొనడం లేదని, నిరసన ర్యాలీ మాత్రమే నిర్వహిస్తామని ప్రకటించాయి. బంద్‌తో సంబంధం లేకుండా బెంగళూరు నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కేఎస్ ఆర్‌టీసీ, బీఎంటీసీ బస్సులనునడపాలని నిర్ణయించాయి. విద్యాశాఖ కూడా పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించలేదు. ఒకవేళ నిరసనకారులు ఇబ్బందులకు గురిచేస్తే పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి నడిపించడానికి సిద్ధమయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయని ప్రభుత్వం ప్రకటించింది.
బంద్‌కు సంఘాలు సిద్ధం
సుమారు 10 నుంచి 15 వరకు కార్మిక సంఘాలు ధర్నాలు, ర్యాలీలు చేపట్టాలని సన్నాహాలు చేశాయి. ప్రైవేట్ బ్యాంకులు ముందుగానే సెలవు ప్రకటించినా ప్రభుత్వ బ్యాంకులూ, కార్యాలయాలు యథాప్రకారం పనిచేస్తాయని అధికారులు తెలిపారు. ఐటీ కంపెనీలు కూడా పనిచేస్తాయని సమాచారం. నిరసనలు గాడితప్పకుండా ముందు జాగ్రత్తగా నగరంలో ప్రధాన ప్రాంతాల్లో పెద్దసంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం నుంచే బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఒత్తిడి చేస్తే చర్యలు తప్పవు పోలీస్ కమిషనర్
బనశంకరి: బలవంతంగా బంద్ చేయించేవారిపై కఠిన చర్యలు తప్పవని నగర పోలీస్ కమిషనర్ భాస్కర్‌రావ్ హెచ్చరించారు. సంఘాలు ర్యాలీలు చేసుకోరాదన్నారు. ఫ్రీడంపార్కులో మాత్రమే ధర్నాలు చేసుకోవచ్చని చెప్పారు.