జీవన నాణ్యతపై ఢిల్లీవాసుల సంతృప్తి | Sakshi
Sakshi News home page

జీవన నాణ్యతపై ఢిల్లీవాసుల సంతృప్తి

Published Sat, Aug 31 2013 10:48 PM

Majority in Delhi satisfied with quality of life, says report

 భద్రత గురించి కొంత ఆందోళన ఉన్నా తమ జీవన నాణ్యత బాగానే ఉందని మెజారిటీ దిల్లీవాలాలు చెప్పారు. తలసరి ఆదాయం, మౌలిక, వైద్యవసతులు, ఉపాధి అవకాశాలు పెరగడంతో ఢిల్లీ దేశంలోనే సుసంపన్న నగరంగా మారిందని హెచ్‌డీఆర్ తెలిపింది. అయితే ఈ నగరం సాధించాల్సింది ఎంతో ఉందని, చాలా సమస్యలను పరిష్కరించాల్సి ఉందని పేర్కొంది. అభివృద్ధి ఫలాలు అందరికీ దక్కడం లేదని, భద్రతను మరింత మెరుగుపర్చాలని సూచించింది. 
 
 సాక్షి,న్యూఢిల్లీ:దేశరాజధానిలో నివసించేవారిలో అత్యధికులు తమ జీవననాణ్యతపై సంతృప్తితో ఉన్నార.ని మానవాభివృద్ధి నివేదిక (హెచ్‌డీఆర్) 2013 ప్రకటించింది. ప్రపంచస్థాయి నగరంగా ఎదిగేందుకు కృషి చేస్తున్న ఢిల్లీ ఎదుట ఇంకా అనేక సవాళ్లు ఉన్నాయని తెలిపింది. ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ ఢిల్లీ మానవాభివృద్ధి నివేదికను తీన్‌మూర్తి ఆడిటోరియంలో శనివారం జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ‘ఇంప్రూవింగ్ లైవ్స్, ప్రమోటింగ్ ఇన్‌క్లూజన్’ ఈ రెండో నివేదికను రూపొందించారు. మొదటి నివేదికను 2006లో విడుదల చేశారు.గడి చిన కొన్నేళ్లలో ఢిల్లీలో ఆదాయాలు పెరిగాయని, ఉపాధి, వ్యాపార అవకాశాలు విస్తరించాయని, కనీస సేవల లభ్యత మెరుగయిందని నివేదిక పేర్కొంది. మొదటి నివేదికలో పేర్కొన్న అంశాలతో పోలిస్తే ఇప్పుడు నగరపౌరుల జీవనస్థాయి మెరుగుపడిందని తాజా నివేదిక తెలిపింది. 
 
 ఉపాధి, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి సూచికల ఆధారంగా ఈ  నివేదిక  నగరవాసుల సంతృప్తిని అంచనా వేసింది. అత్యల్ప ఆదాయవర్గంలో ఉన్న 64 శాతం కుటుంబాలు మంది తమ జీవననాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేయగా, సేవల లభ్యతపై ధనికశ్రేణికి చెందిన 84 శాతం కుటుంబాలు సంతృప్తి ప్రకటించాయి. కనీస ఆరోగ్య, మౌలిక సదుపాయాల సేవలు అందరికీ అందుబాటులోకి తేవడంలో ఉన్న అంతరాలను తొలగించాలని, సురక్షిత వాతావరణాన్ని కల్పించడంపై దృష్టి సారించాలని నివేదిక నొక్కిచెప్పింది.
 నగరంలో మానవాభివృద్ధిస్థాయికి సంబంధించిన అంశాలను ఈ నివేదిక రెండు దృక్కోణాల నుంచి విశ్లేషించింది. వాటిలో ఒకటి కళ్లెదుట కనబడే వాస్తవాలు కాగా, రెండోది ఈ అంశాలపై ప్రజల దృక్పథం. నగరపౌరులు తమ జీవితాలు, నగరం గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి దాదాపు ఎనిమిది వేల కుటుంబాలను సర్వే చేసి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ ఈ నివేదిక రూపొందించింది. 
 
 సర్వేలో పాల్గొన్నవారు నగర జీవితానికి సంబంధించినఅనేక అంశాలపై సంతృప్తి ప్రకటించారు. ఢిల్లీ దాదాపుగా సంపూర్ణ విద్యుదీకరణను సాధించిందని, గత కొన్నేళ్లలో దారిద్య్రస్థాయి తగ్గిపోయిందని, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం నెలకొన్నప్పటికీ ఢిల్లీ ఆర్థికాభివృద్ధిని కొనసాగించిందని పలువురు పేర్కొన్నారు. ఉపాధి అవకాశాలు, కనీస సేవలు, రవాణా సదుపాయాలు గణనీయంగా మెరుగపడ్డాయన్నారు. పాఠశాల, ఉన్నత విద్యావశాకాశాలు విస్తరించాయని, ప్రజారోగ్య సేవ ల అందుబాటు మెరుగయిందని వారు చెప్పారు. ఢిల్లీ వాణిజ్య, పర్యాటకరంగాల ప్రధాన కేంద్రాల్లో ఒక టని, ఢిల్లీ దేశరాజధాని కావడంతో దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తుంటారని నివేదిక పేర్కొంది. 
 పెరిగిన తలసరి ఆదాయం,
 
 తగ్గిన పేదరికం: 
 అఖిల భారతస్థాయిలో తలసరి ఆదాయ పెరుగుదల రేటు తగ్గుముఖం పట్టినప్పటికీ ఢిల్లీలో ఇది పెరిగిందని,  పేదరికం గత కొన్నేళ్లుగా తగ్గిందని నివేదిక పేర్కొంది. ఢిల్లీ తలసరి ఆదాయం సంవత్సరానికి ఏడు శాతం చొప్పున పెరిగి, దేశంలోనే దీనిని సంపన్నరాష్ట్రంగా చేసింది. 2004-05లో 13 శాతమున్న పేదరికస్థాయి 2011-12లో 9.9 శాతానికి తగ్గిందని నివేదిక తెలిపింది. కార్మిక విపణిని సమర్థంగా నియంత్రించడం వల్ల పేదరికాన్ని తగ్గించగలిగారని నివేదిక తెలిపింది.
 
 మెరుగుపడ్డ ఉపాధి అవకాశాలు: 
 ఢిల్లీలో ఉపాధి అవకాశాలు, ముఖ్యంగా మహిళలకు ఉద్యోగాలు పెరిగాయని నివేదిక తెలిపింది. 1999-2000లో మహిళా ఉద్యోగుల వాటా తొమ్మిది శాతానికన్నా తక్కువగా ఉండేదని, 2011-12 నాటికి అది 11 శాతాన్ని మించిందని హెచ్‌డీఆర్ తెలిపింది. సాధారణ ఉద్యోగుల ఆదాయాలు సంవత్సరానికి ఐదుశాతం పెరిగాయని  నివేదిక తెలిపింది. అనియత ఉపాధిరంగం విస్తరించిందని నివేదిక తెలిపింది.
 
 ఉన్నత విద్యావకాశాలపై సంతృప్తి:
 నగరపౌరుల్లో అత్యధికులు తమ పిల్లలకు లభిస్తోన్న విద్యావకాశాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యాపరమైన సూచికలను బట్టి చూస్తే ఢిల్లీ దేశంలోని ఇతర ప్రాంతాల కన్నా ఢిల్లీ ముందుంది. ఉన్నత విద్యావకాశాలు నగరంలో పుష్కలంగా ఉండడంతో ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా నగరానికి వస్తున్నారు. దాదాపు 86 శాతంతో ఢిల్లీ అక్షరాస్యత రేటు కూడా జాతీయ అక్షరాస్యత రేటు కన్నా ఎక్కువగా ఉంది. ఉన్నత విద్యావంతుల వాటా ఢిల్లీలోనే అధికం. నిరక్షరాస్యుల్లో 70 శాతం మంది జేజే క్లస్టర్లు, అనధికార కాలనీలు, పునరావాస కాలనీలు, పట్టణగ్రామాల్లో ఉన్నారు.
 
 గడచిన మూడు దశాబ్దాల్లో ప్రజారోగ్య సేవలు మెరుగుపడడంతో ప్రజలు ఆయుఃప్రమాణాలు కూడా పెరిగాయి. గత పదేళ్లలో కనీస సేవల అందుబాటు మెరుగుపడింది. పెరుగుతున్న జనాభాతోపాటు వలసల ఒత్తిడి  ఉన్నప్పటికీ 2001 నుంచి 2011 మధ్యకాలంలో ఢిల్లీలో గృహవసతి పెరిగింది. ఇళ్ల కొరత 2.5 లక్షల నుంచి 1.5 లక్షలకు తగ్గింది. సొంతిల్లు కలిగిన వారి సంఖ్య పెరిగింది. అద్దె ఇళ్లలో ఉంటున్నవారు కూడా తమ గృహవసతిపై సంతృప్తి ప్రకటించారు. వారిలో చాలా మంది తాము సొంతిల్లు కొనుక్కొనే అవకాశం ఉన్నట్లు అధ్యయనంలో తెలిపారు. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ద్వారా ఈడబ్ల్యుఎస్ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు) ఇళ్లను అందిస్తూ ప్రభుత్వం ఢిల్లీని మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తోంది. నగరంలో 80 శాతం ఇళ్లకు నీటి సరఫరా ఉంది. ఈ విషయంలో ఢిల్లీ మిగతా మహానగరాల కన్నా మెరుగైన స్థితిలో ఉంది. నగరంలోని అనేక ప్రాంతాల్లో భూగర్భ జలమట్టాలు అడుగంటుతున్నాయి.
 
 బస్సులు, మెట్రో వంటి ప్రజా రవాణాసాధనాలు ఉన్నప్పటికీ  వ్యక్తిగత వాహనాలే రోడ్లను ఎక్కువగా ఆక్రమిస్తున్నందువల్ల ప్రభుత్వం ప్రజారవాణా సాధనాలపై దృష్టి సారించవలసిన అవసరం ఉందని హెచ్‌డీఆర్ అభిప్రాయపడింది. టికెట్ ధరలు అందుబాటులో ఉండడం, కవరేజీ, భద్రత సమస్యల కారణంగా నగరవాసులు బస్సుల్లో ప్రయాణించడానికే మొగ్గుచూపుతున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 1/3 వ వంతుమంది వ్యక్తిగత భద్రతపై సంతృప్తి ప్రకటించారు.
 
 భద్రత పరిస్థితి మరింత పెరుగుపడాలని అభిప్రాయపడ్డారు. యమునా కార్యాచరణ ప్రణాళికను వేగంగా అమలుచేయవలసిన ఆవశ్యకతను నివేదిక నొక్కి చెప్పింది. ప్రజలతో సంబంధాలు నెరిపే విభాగాల్లో డీఎంఆర్‌సీ పనితీరుపై నగరవాసులు ఎక్కువ సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తరువాత స్థానాల్లో వరుసగా మూడు డిస్కమ్‌లు, డీటీసీ, డీజేబీ, ట్రాఫిక్ పోలీస్, మూడు మున్సిపల్ కార్పొరేషన్లు, చివరగా ఢిల్లీ పోలీసులను పేర్కొన్నారు.
 
 పేదలకు విద్య ఎండమావే!
 బలహీనవర్గాల చిన్నారుల్లో చాలా మంది ప్రాథమిక విద్యకు కూడా దూరమవుతున్నారని హెచ్‌డీఆర్ పేర్కొంది. చాలా మంది బాలికలు బడులకు వెళ్లడం లేదని తెలిపింది. ఎస్సీలు, ముస్లిమ్‌ల నుంచి ఉన్నత విద్యావంతుల సంఖ్య చాలా తక్కువగా ఉందని విచారం ప్రకటించింది. ఎస్సీల్లో చాలా తక్కువ మంది ఉన్నతవిద్యను అభ్యసించగలుగుతున్నారని తెలిపింది. మురికివాడల్లో నిరక్షరాస్యత సమస్య తీవ్రంగా ఉందని పేర్కొంది. 
 
 వైద్యమూ అంతంతమాత్రమే
 ప్రతి 10 వేల మందికి ఢిల్లీలో అందుబాటులో ఉన్న వైద్యశాలలు కేవలం రెండేనని ఈ నివేదిక పేర్కొంది. మరిన్ని ఆస్పత్రులతోపాటు వైద్య సిబ్బందినీ అందుబాటులోకి తేవాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పింది. భారీ వలసలు ఢిల్లీ వైద్యరంగంపై భారాన్ని మోపుతున్నాయని విశ్లేషించింది. ప్రతి వెయ్యి మంది నవజాత శిశువుల్లో 28 మంది మరణిస్తున్నారని ఈ నివేదిక పేర్కొంది. భ్రూణహత్యల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించింది.
 
 ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి: అన్సారీ
 దేశరాజధాని వాసులు భద్రతపై ఆందోళనతో ఉన్నారని, ఈ విషయంలో ప్రభుత్వం వారి విశ్వాసాన్ని చూరగొనాలని ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ అన్నారు. పోలీసు, న్యాయవ్యవస్థపై నమ్మకం పెరిగేందుకు కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీ మానవాభివృద్ధి నివేదిక 2013ను శనివారం విడుదల చేసిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు. నిర్భయ అత్యాచారం అనంతరం ఢిల్లీవ్యాప్తంగా భారీ ఆందోళనలు జరిగిన నేపథ్యంలో ఆయన పైవ్యాఖ్యలు చేశారు. మహిళలు, వయోధికులు, చిన్నారులకు తగిన భద్రత కల్పించడంపై అత్యధిక శ్రద్ధ చూపాలని అన్సారీ అభిప్రాయపడ్డారు. ఉపాధి, విద్య, ఆరోగ్యం, గృహవసతి వంటి సదుపాయాలు అన్ని వర్గాలకూ అందడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. సామాజిక అంతరాల తొలగింపునకు కూడా గట్టి చర్యలు అవసరమన్నారు. ఢిల్లీకి భారీ సంఖ్యలో వలసలు వచ్చే వారితోనూ కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో బహుళస్థాయులు పాలనావ్యవస్థలు ఉండడం వల్ల కూడా ఇబ్బందులు కలుగుతున్నాయని అన్సారీ అంగీకరించారు. ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement