రియల్ ఎస్టేట్ యజమాని వద్ద *17 లక్షలు మోసగించిన న్యాయవాది, సినీ దర్శకులను పోలీసులు అరెస్టు చేశారు.
టీ.నగర్ : రియల్ ఎస్టేట్ యజమాని వద్ద *17 లక్షలు మోసగించిన న్యాయవాది, సినీ దర్శకులను పోలీసులు అరెస్టు చేశారు. ఆవడి దేవినగర్ అన్నై థెరిస్సా వీధికి చెందిన రాజ్‌కుమార్ (40) రియల్ ఎస్టేట్ యజమాని. ఇతని వద్ద పట్టాభిరామ్, మోడ్రన్ సిటీ మూడవ వీధికి చెందిన న్యాయవాది శిఖామణి (47) న్యాయవాది ఉన్నారు. రాజ్‌కుమార్ వద్ద నగదు ఉన్నట్లు తెలుసుకున్న శిఖామణి దానిని అపహరించేందుకు పథకం పన్నాడు. దీంతో శిఖామణి స్నేహితులైన తిరుత్తణి, ఆర్‌ఎ పురం మేట్టు వీధికి చెందిన సినిమా అసిస్టెంట్ డెరైక్టర్ రమేష్ (29)అనే వ్యక్తి రాజ్‌కుమార్‌కు మార్చి 15వ తేదీ నుంచి హత్యా బెదిరింపులు చేశారు.
సమాచారాన్ని న్యాయవాది శిఖామణికి రాజ్‌కుమార్ తెలిపాడు. దీంతో ఆవడి, రామలింగాపురం టీకేసీ వీధికి చెందిన శ్రీనివాసన్ (34) అనే చిత్ర దర్శకుడు ఉన్నారని అతనికి పోలీసు శాఖలో ఉన్నతాధికారులు తెలుసని వారి ద్వారా బెదిరింపులు చేసిన వ్యక్తిని పట్టుకుంటామని తెలిపారు. అయితే అందుకు అధికంగా ఖర్చు అవుతుందని రాజ్‌కుమార్‌కు శిఖామణి తెలిపాడు. ఆ తరువాత మీకు బెదిరింపులు చేసిన యువకుడిని మణిమంగళం సమీపంలో గత ఏప్రిల్ 18వ తేదీ హత్య చేశామని, ఆ ప్రాంతానికి చెందిన పోలీసు ఉన్నతాధికారి సాయంతో ఆ హత్యను రోడ్డు ప్రమాదంగా మార్చామని తెలిపారు.
ఇందుకు పోలీసు అధికారులకు చాలా డబ్బు ఖర్చు చేశామని రాజ్‌కుమార్‌కు శిఖామణి తెలిపారు. తరువాత యువకుని హత్య చేసిన విషయం తల్లిదండ్రులకు తెలిసిందని వారిని శాంత పరిచేందుకు వారికి నగదు అందచేయాలని శిఖామణి తెలిపారు. ఈ విధంగా రాజ్‌కుమార్ వద్ద *17 లక్షలు తీసుకున్నట్టు తెలిసింది. ఇలా ఉండగా రాజ్‌కుమార్ వద్ద మళ్లీ నగదు అపహరించేందుకు ప్రయత్నించి తిరుత్తణి రమేష్ ద్వారా మరొక సెల్‌ఫోన్‌లో హత్యాబెదిరింపులు చేశారు.
దీంతో అనుమానించిన రాజ్‌కుమార్ మణిమంగళంలో జరిగిన సంఘటన గురించి విచారించారు. దీని గురించి ఆ ప్రాంతం ఇన్‌స్పెక్టర్ తెలుపుతూ హత్యా సంఘటన జరగలేదని, మోసగించి డబ్బు అపహరించినట్లు తెలిపారు. దీంతో ఆవడి పోలీసుస్టేషన్‌లో రాజ్‌కుమార్ గురువారం ఫిర్యాదు చేశాడు. ఇన్‌స్పెక్టర్ విజయరాఘవన్ కేసు నమోదు చేసి విచారణ జరిపారు. దీంతో శిఖామణి, సినీ దర్శకుడు శ్రీనివాసన్, రమేష్‌లను అరెస్టు చేశారు. వీరిని గురువారం పూందమల్లి కోర్టులో హాజరు పరచి పుళల్ జైలులో నిర్బంధించారు.


