పర్యాటకులకు ప్రాణాంతకంగా కొడైకెనాల్‌ | High mercury levels in fish at Kodai lake: IIT report | Sakshi
Sakshi News home page

పర్యాటకులకు ప్రాణాంతకంగా కొడైకెనాల్‌

Nov 16 2017 7:17 AM | Updated on Nov 16 2017 7:17 AM

High mercury levels in fish at Kodai lake: IIT report - Sakshi

ఫోటో: 42: కొడైకనాల్‌ థర్మామీటర్‌ ఫ్యాక్టరీ (ఫైల్‌)

టీ.నగర్‌: కొడైకనాల్‌లో జలవనరులు కలుషితమైనట్లు ఐఐటీ పరిశోధనలో వెల్లడైంది. ఈ ప్రాంతంలో మూతబడిన థర్మామీటర్‌ పరిశ్రమ నుంచి విడుదలైన పాదరసం వ్యర్థాలు కొడైకెనాల్, పెరియకుళం జల వనరుల్లో కలిసినట్లు హైదరాబాద్‌కు చెందిన సంస్థ దిగ్భ్రాంతి కలిగించే నివేదిక విడుదల చేసింది. దీంతో సదరు కంపెనీలో అధికారులు తనిఖీలు జరిపారు. దిండుగల్‌ జిల్లా, కొడైకెనాల్‌లోని థర్మామీటర్‌ తయారీ కార్మాగారంలో ఉద్యోగులు అస్వస్థతకు గురికావడంతో 2001లో మూతబడింది. ఈ కర్మాగారంలోని పాదరసం వ్యర్థాలను సాంకేతిక పరిజ్ఞానంతో తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌చేస్తూ వస్తున్నారు. ఇలాఉండగా హైదరాబాద్‌కు చెందిన ఐఐటీ సంస్థ పరిశోధకులు ఆషిఫ్‌ క్యూరిసి, కొడైకెనాల్‌ కొండ ప్రాంతం, తేని జిల్లా పెరియకుళం జలవనరులను పరిశీలించారు. దీనిగురించి ఇటీవల ఒక నివేదిక దాఖలు చేశారు.

అందులో కొడైకెనాల్‌ జలవనరుల్లో 31.10 నుంచి 41.90 మైక్రోగ్రాములు, పెరియకుళం జలవనరుల్లో 94 నుంచి 165 మైక్రోగ్రాముల వరకు పాదరసం కలిసినట్లు పేర్కొన్నారు. 30 మైక్రోగ్రాముల కంటే ఎక్కువగా పాదరసం కలిసినట్లయితే మానవుని మెదడు, మూత్రపిండాలు దెబ్బతింటాయని తెలిపారు. అంతేకాకుండా గర్భిణులకు ప్రాణాపాయం ఏర్పడుతుందన్నారు. పాదరసంతో కలుషితమన నీటితో ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లోగల చెరువులు, నీటిగుంటల్లో ప్రజలు చేపలు పట్టరాదని హెచ్చరించారు. ఇలాఉండగా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి రీజినల్‌ అధికారి చార్లెస్, కొడైకెనాల్‌ ఆర్‌డీఓ మోహన్, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు మంగళవారం పాదరసం కర్మాగారంలో తనిఖీలు జరిపారు. దీనిపై ఆర్‌డీఓ మోహన్‌ విలేకరులతో మాట్లాడుతూ పాదరసం శుభ్రం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై తనిఖీలు జరిపామని అన్నారు. ఈ కర్మాగారంలో నెలకొన్న మిస్టరీని ఛేదించి ప్రజల్లో భయాందోళనలు తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సామాజిక హితులు కోరుతున్నారు.

థర్మామీటర్‌ కర్మాగారం: కొడైకెనాల్‌లో 1984లో 25 ఎకరాల విస్తీర్ణంలో థర్మామీటర్‌ కర్మాగారం ప్రారంభమైంది. సుమారు 1,200 మంది ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తూ వచ్చారు. ఈ కర్మాగారంలో అనేక మంది కార్మికులు తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు అప్పట్లో ఫిర్యాదులందడంతో 2001లో కర్మాగారం మూతపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement