రవచనాలు చేయడం ఇంత కీర్తిని సంపాదించి పెడుతుందని ఏనాడూ అనుకోలేదని ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు అన్నారు.
చాగంటి కోటేశ్వరరావు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రవచనాలు చేయడం ఇంత కీర్తిని సంపాదించి పెడుతుందని ఏనాడూ అనుకోలేదని ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు అన్నారు. సంపాదన ఆశించి ఏనాడూ ప్రవచనాలు చెప్పలేదని, ఇప్పటివరకు వాటిపై ఒక్క పైసా సంపాదించలేదని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం స్థానికఏపీభవన్‌లో ఢిల్లీ తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో నిర్విహ ంచిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘ప్రతి రోజూ రెండు గంటల పాటు ప్రవచనం చేయడం ఒక తపస్సు అవుతుంది. ఈ వ్యాపకాన్ని అలవాటు చేసుకున్నా. దీనిపై ఏనాడూ సంపాదన ఆశించలేదు. నా ఆత్మ ఉద్ధరణ కోసమే ప్రవచనాలు చెబుతున్నా’ అని అన్నారు.
ఢిల్లీలోని తెలుగువారు చూపిన ప్రేమకు ఆనందంగా ఉందని చెప్పారు. తనను ఎంతో గొప్పగా ఉపమానాలతో పోల్చడం అమ్మ మనసును తెలియజేస్తుందని తెలిపారు. ప్రవచనాలు చెప్పగ లగడం తన ప్రతిభ కాదని, ఈశ్వరుడి అనుగ్రహమని అన్నారు. ధిక్కార భావ జీవితం ఎప్పటికీ పూర్ణత్వాన్ని సాధించలేదని, శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుంటూ పనులు చేయాలని సూచించారు. ఎవరికో ఒకరికి లోబడి పనిచేయాలని, మావటికి లొంగితేనే ఏనుగుకు వేంకటాచల క్షేత్రంలోని మాడ వీధుల్లో తిరిగే అర్హత ఉంటుందని ఉదహరించారు. మన్మధనామ సంవత్సరాన్ని పురస్కరించుకుని కూచిబొట్ల సూర్యనారాయణ శర్మ పంచాగశ్రవణాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జీవీజీ కృష్ణమూర్తి, ఎఫ్‌సీఐ సీఎండీ సి. విశ్వనాథన్, డీటీఏ కార్యవర్గ సభ్యులు, ఢిల్లీలోని తెలుగువారు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.