‘ప్రజా దర్బార్‌’లో రైతు ఆత్మహత్యాయత్నం | former suicide attempt in praja darbar in kurnool district | Sakshi
Sakshi News home page

‘ప్రజా దర్బార్‌’లో రైతు ఆత్మహత్యాయత్నం

May 15 2017 3:29 PM | Updated on Oct 1 2018 2:36 PM

‘ప్రజా దర్బార్‌’లో రైతు ఆత్మహత్యాయత్నం - Sakshi

‘ప్రజా దర్బార్‌’లో రైతు ఆత్మహత్యాయత్నం

అయ్యా.. నాకు న్యాయం చేస్తే బతుకుతా, లేదంటే పురుగుల మందు తాగి చస్తానంటూ ఓ రైతు పురుగుల మందు డబ్బాతో కలెక్టర్‌ ఎదుట కన్నీరుమున్నీరయిన ఘటన ప్రజాదర్బార్‌లో కలకలం రేపింది.

– నాలుగు సంవత్సరాలుగా భూమి ఆన్‌లైన్‌ చేయలేదని కన్నీరుమున్నీరు
– రూ.30వేల లంచం అడిగిన తహసీల్దార్‌ 
– పొలంలోకి వెళితే చంపేస్తామని బెదిరింపులు
– కర్నూలు మీ కోసం ప్రజాదర్బార్‌లో కలకలం
 
కల్లూరు(రూరల్‌): అయ్యా.. నాకు న్యాయం చేస్తే బతుకుతా, లేదంటే పురుగుల మందు తాగి చస్తానంటూ ఓ రైతు పురుగుల మందు డబ్బాతో కలెక్టర్‌ ఎదుట కన్నీరుమున్నీరయిన ఘటన ప్రజాదర్బార్‌లో కలకలం రేపింది. సోమవారం కర్నూలు జిల్లా కలెక్టరేట్‌లో మీకోసం ప్రజాదర్బార్‌ నిర్వహించారు. కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ ప్రజల విజ్ఞప్తులను పరిశీలిస్తుండగా బండిఆత్మకూరు మండలం ఈర్నపాడుకు చెందిన రైతు బారికి శ్రీనివాసులు ఒక్కసారిగా ఆ ప్రాంతానికి దూసుకొచ్చాడు. వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగేందుకు ప్రయత్నించగా కలెక్టర్‌ గన్‌మన్‌, కానిస్టేబుళ్లు, అటెండర్‌ అప్రమత్తమై డబ్బాను లాగిపడేశారు.
 
అనుకోని ఘటనతో ఆ ప్రాంతంలో కొంతసేపు గందరగోళం నెలకొంది. ఆ వెంటనే కోలుకున్న కలెక్టర్‌ రైతు శ్రీనివాసులు, కుటుంబ సభ్యులను కూర్చోబెట్టి సమస్యను వివరించాలని కోరారు. ఈర్నపాడులోని సర్వే నెంబర్‌ 380, 422/ఏలో తనకు 3.97 ఎకరాల పొలం ఉందని, 2002లో ఈ పొలాన్ని మల్లె రామన్న అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేశానన్నారు. సర్వే కోసం 2015లో దరఖాస్తు చేసుకోగా.. 380 సర్వే నెంబర్‌లోని పొలాన్ని మాత్రమే సర్వే చేసి 422 సర్వే నెంబర్‌ను అలాగే వదిలేశారన్నారు. అయితే ఇదే సర్వే నెంబర్ భూమిని బద్రి లింగమయ్య, బద్రి గాంధయ్య, బద్రి మాణ్యాల పేరిట ఆన్‌లైన్‌ చేశారన్నారు. ప్రస్తుతం వీరు ఆ పొలంలోకి వెళితే.. చంపుతామని గొడ్డళ్లతో వెంటబడుతున్నారని.. తనకు, కుటుంబ సభ్యులకు వీరి నుంచి ప్రాణహాని ఉందని శ్రీనివాసులు కలెక్టర్‌ ఎదుట బోరుమన్నాడు.
 
ఆన్‌లైన్‌ చేయాలని నాలుగేళ్లుగా కోరుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని.. తహసీల్దార్‌ శేషఫణి రూ.30వేలు లంచం తీసుకుని కూడా పని పూర్తి చేయలేదన్నారు. కలెక్టర్‌ స్పందిస్తూ బండిఆత్మకూరు తహసీల్దార్‌ శేషఫణితో పోన్లో మాట్లాడారు. ‘ఏంటయ్యా ఈ సమస్య. పొలం ఆన్‌లైన్‌ చేయడానికి డబ్బులు అడిగావా. అది నిజమైతే నీ ఉద్యోగం పోతుంది.’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఆ తర్వాత నంద్యాల ఆర్డీఓ రామసుందర్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడుతూ సమస్యను వివరించారు. ఓపెన్‌ ఎంక్వయిరీ చేసి డాక్యుమెంట్‌, ఎంజాయ్‌మెంట్‌ ప్రకారం న్యాయం చేయండని ఆదేశించారు. తహసీల్దార్‌ వ్యవహారంపై మూడు రోజుల్లో నివేదిక అందజేయాలన్నారు. భయపడకు, న్యాయం చేస్తామని రైతుకు భరోసానిచ్చి పంపించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement