కడుపులో బంగారం | Sakshi
Sakshi News home page

కడుపులో బంగారం

Published Thu, Aug 24 2017 7:49 PM

కడుపులో బంగారం

సాక్షి, అన్నానగర్‌ (చెన్నై): బంగారు బిస్కెట్లు కడుపులో ఉంచుకుని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తి నుంచి ఎట్టకేలకు వైద్యులు వాటిని బయటకు తీశారు. తమిళనాడుకు చెందిన చెందిన మహ్మద్‌ ముస్తఫా సలీం ఈనెల 19న ఎయిర్‌ ఆసియా విమానంలో మలేసియాలోని కౌలాలంపూర్‌ నుంచి తిరుచ్చికి వచ్చాడు. అతడు కడుపులో ఏడు బంగారు బిస్కెట్లు ఉంచుకుని వచ్చినట్టు అధికారులు గుర్తించారు. బంగారు బిస్కెట్లను అరటి పండులో పెట్టుకుని మింగేసి అక్రమంగా తరలించేందుకు అతడు ప్రయత్నించినట్టు కనుగొన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని  కోర్టులో హాజరుపరిచారు.

న్యాయస్థానం అనుమతితో కడుపులోంచి బంగారు బిస్కెట్లు బయటకు తీసేందుకు తిరుచ్చి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పారు. వైద్యులు ఎనిమా ఇచ్చి సోమవారం ఒక బిస్కెట్‌ను బయటికి తీశారు. మంగళవారం మరో నాలుగు బిస్కెట్లు వెలుపలకు తీశారు. బుధవారం సాయంత్రం మిగిలిన రెండు బిస్కెట్లు వెలికితీశారు. ఆ ఏడు బంగారు బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 205 గ్రాముల బరువున్న వీటి విలువ రూ.5 లక్షల 96వేలు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు రామనాథపురం జిల్లా ఎస్పీ పట్టణ వాసిగా గుర్తించారు.

Advertisement
Advertisement