
చెన్నై,తిరువొత్తియూరు: సెల్ఫీ తీస్తున్న సమయంలో రైతు కన్నును నెమలి పొడవడంతో అతను ఆ కంటి చూపును కోల్పోయే అవకాశం ఉన్నట్లు వైద్యులు చెప్పారు. కృష్ణగిరి జిల్లా డెంకినీకోట మారుదాంపల్లెకి చెందిన రామచంద్రారెడ్డి (60) రైతు. అతని ఇంటికి సమీపంలో రోజూ మధ్యాహ్నం సమయంలో ఆహారం కోసం ఒక నెమలి వచ్చి వెళ్లేది. దీన్ని గమనించిన అదే ప్రాంతానికి చెందిన రైతు బాలాజీ (33) ఆ నెమలి పక్కన నిలబడి సెల్ఫీ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆదివారం మధ్యాహ్నం నెమలి వచ్చిన వెంటనే దాని పక్కకు వెళ్లి నిలబడి సెల్‌ఫోన్‌లో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించాడు.
ఆ సమయంలో నెమలి హఠాత్తుగా బాలాజీ ఎడమకంటిని తన ముక్కుతో పొడిచింది. ఈ ఘటనలో అతని కంటి నుంచి రక్తం వెలువడింది. అతన్ని చికిత్స కోసం హోసూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తరువాత మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ అతనికి డాక్టర్లు కంటి చూపు రావడం చాలా కష్టమని తెలిపారు. నెమలిని సోమవారం గ్రామ ప్రజలు పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న డెంకినీ కోట అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని నెమలిని విడిపించి ఐఆర్ అటవీశాఖ ప్రాంతంలో వదలిపెట్టారు.