శ్మశానంలో శివపుత్రుడు

Family Staying in Cemetery From The Years in karnataka - Sakshi

దశాబ్దాలుగా కాటికాపరి వృత్తి కొనసాగిస్తున్న ఆంథోణి స్వామి

కుటుంబంతో సహా అక్కడే నివాసం

ఎంతో మంది ప్రముఖులకు అంత్యక్రియలు

కర్ణాటక,కృష్ణరాజపురం :  అప్పుడెప్పుడో 16 ఏళ్ల క్రితం విక్రమ్‌ నటించిన శివపుత్రుడు చిత్రం గుర్తుందా? అందులో చిన్నప్పటి నుంచి పెరిగి పెద్దయ్యే వరకు కనీసం శ్మశానం గేటు కూడా దాటకుండా శ్మశానంలోనే ఉంటూ శవాలకు అంత్యక్రియలు నిర్వహిస్తుంటాడు. అచ్చం అలాగే బెంగళూరు నగరంలో కూడా ఓ శివపుత్రుడు ఉన్నాడు. అంథోణిస్వామి అనే వ్యక్తి నిత్యావసరవస్తువులు లేదా అత్యవసర పనులు మినహా సుమారు మూడు దశాబ్దాలుగా కనీసం శ్మశానం గేటు కూడా దాటకుండా కుటుంబంతో సహా శ్మశానంలోనే ఉంటూ ప్రతీరోజూ శ్మశానానికి తీసుకువచ్చే శవాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నాడు. 90 ఏళ్ల క్రితం అంథోణిస్వామి తాత ప్రస్తుతం బెంగళూరు నగరంలోని అతిపెద్ద శ్మశానవాటికైన కల్పళ్లి శ్మశానవాటికలో శవాలు పాతిపెట్టడానికి గుంతలు తీసే పనిని వృత్తిగా ఎంచుకున్నాడు. అనంతరం అదేపనిని అంథోణి స్వామి తండ్రి కూడా కొనసాగించాడు. దీంతో అంథోణిస్వామి కూడా చిన్న వయసు నుంచే తండ్రికి సహాయం చేస్తూ అక్కడే పెరిగాడు. తండ్రి మరణించాక శవాలకు అంత్యక్రియలు చేసే పనిని అంథోణిస్వామి కొనసాగించసాగారు. ఈ క్రమంలో దాదాపుగా మూడు దశాబ్దాలుగా ప్రతీరోజూ కనీసం ఎనిమిది నుంచి పది శవాలకు అంత్యక్రియలు నిర్వహిస్తూ తల్లి, భార్య, నలుగురు పిల్లలతో కలసి స్మశానంలోనే నిర్మించిన ఇంట్లో ఉంటున్నాడు. నిత్యావసరాలు ఏదైనా అత్యవసర పనులు మినహా ఈ మూడు దశాబ్దాలలో ఇప్పటివరకు కుటుంబంతో కానీ ఒక్కడే కానీ ఏదైనా ప్రాంతాలకు విహారానికి వెళ్లడం లేదా కనీసం దేవాలయాలకు, సినిమాలకు కూడా వెళ్లకుండా శ్మశానంలోనే ఉంటున్నాడు.

ప్రతీరోజూ శ్మశానానికి తీసుకువచ్చే శవాలకు అంత్యక్రియలు నిర్వహించడం బాధ్యతగా భావిస్తున్నానని అంతేకాకుండా రోజుకు కనీసం పది శవాలకు అంత్యక్రియలు నిర్వహించాల్సి వస్తుండడంతో బయటకు వెళ్లడానికి తీరిక దొరకడం లేదని అంథోణి స్వామి చెబుతున్నారు.  సంవత్సరానికి సుమారు 3,500 శవాలకు అంత్యక్రియలు నిర్వహిస్తానని అందులో అనాథ శవాల సంఖ్య కూడా ఎక్కువేనని చెప్పారు. మార్కెట్లు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు ఇలా బెంగళూరు నగరంలో ఏమూల అనాథ శవాలు లభించినా కల్పళ్లి శ్మశానవాటికలోనే అంత్యక్రియలకు తీసుకువస్తుంటారు. పేరుకు క్రైస్తవుడే అయినా శ్మశానానికి తీసుకువచ్చే హిందువుల శవాలకు హిందూ పద్ధతిలోనే అంత్యక్రియలు నిర్వహిస్తూ అంథోణిస్వామి ప్రశంసలు అందుకుంటున్నారు. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి పార్థివదేహానికి కూడా అంత్యక్రియలు నిర్వహించానని అప్పుడు తనకు 13 ఏళ్ల వయసు ఉంటుందని అంథోణిస్వామి తెలిపారు. దీంతోపాటు మాజీ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ తండ్రి, సినీనటుడు దేవరాజ్‌ తండ్రి ఇలా ఎంతో మంది ప్రముఖుల సంబంధీకుల పార్థివదేహాలకు అంత్యక్రియలు నిర్వహిం చారు. అనాథ శవాలకు కుటుంబ సభ్యుడిలా,బంధువులా శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహిస్తూ అంథోణిస్వామి పలువురు నుంచి ప్రశంసలు దక్కించుకున్నారు. అంతేకాదు నీలం సంజీవరెడ్డి సమాధిని ప్రతీరోజూ శుభ్రం చేయడమే కాకుండా ఇంట్లో సంజీవరెడ్డికి చిత్రపటానికి పత్రిరోజూ పూజ కూడా చేస్తారు. ఇటీవల కొంత అనారోగ్యం కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ప్రభుత్వం అందిస్తున్న వేతనం సరిపోవడం లేదని, కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top