గృహయోగం కావాలి

Elderly Woman Struggling For Own House - Sakshi

అవార్డులమ్మ గూడుగోడు 

పక్కా గృహం కావాలంటూ ప్రభుత్వానికీ అర్జీ

పట్టించుకోని అధికారులు

ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు ఆమె సొంతం. ఒక యూనివర్సిటీ వసతిగృహానికి ఏకంగా ఆమె పేరు. ఆమె రాష్ట్రప్లానింగ్‌బోర్డు సభ్యురాలు కూడా.. అయినా ఉండడానికి ఆమెకు పక్కా ఇల్లు లేదు. రచ్చ ఎంత గెలిచినా ఆమె ఇంటిని గెలుచులేకపోయింది. సాధారణ మహిళలా ఒక పూరిగుడిసెలోనే కాలం గడుపుతోంది. 

జయపురం : వ్యవసాయరంగంలో అత్యున్నత ఫలితాలు సాధించి, పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్న మహిళ కమల పూజారి. డొంగరచించి పంచాయతీ పాత్రోపుట్‌ గ్రామానికి చెందిన కమలపూజారి  పక్కాఇల్లు లేక కుటుంబంతో కలిసి ఒక పూరిగుడిసెలో నివాసం ఉంటోంది.  భర్తను కోల్పోయిన ఆమెకు ఇద్దరు కొడుకులు. పెద్దకొడుకు ధనుంజయ్‌ పూజారికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. తన కుటుంబంతో కలిసి తల్లి కమల పూజారికి దూరంగా వేరుకాపురం ఉంటున్నాడు. చిన్నకొడుకు టంకుధరపూజారికి ముగ్గురు కొడుకులు. అదే ఊరిలో తనకున్న రెండు ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ భార్యాబిడ్డలతో కలిసి తల్లి కమల దగ్గరే ఉంటున్నాడు.  

ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్‌యోజన, బిజూ ఆవాస్‌యోజన వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా తనకు ఇల్లు మంజూరు చేయాలని చాలాసార్లు ప్రభుత్వానికి కమల పూజారి అర్జీ పెట్టుకుంది. అయినా పక్కా ఇల్లు మంజూరుకాలేదు. ఎట్టకేలకు చిన్న కొడుకు టంకుధరకు మంజూరైన ఇంటికి పూర్తిస్థాయిలో బిల్లులు అందకపోవడంతో ఆ ఇంటి నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. కొత్త ఇల్లు  మంజూరరైందన్న సంతోషంతో ఉన్న ఒక్క పూరి గుడిసె పడగొట్టామని ఉండేందుకు ఇప్పుడు ఇల్లు లేక నిర్మాణంలో ఉన్న ఇల్లు పూర్తికాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కమల పూజారి వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తన అవస్థలను గుర్తించి తనకో ఇల్లు మంజూరు చేస్తే బాగుంటుందని కమలపూజారి కోరుకుంటున్నారు. 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top