దసరా ఏనుగులకు సాదర స్వాగతం | Dasara elephants hearty welcome | Sakshi
Sakshi News home page

దసరా ఏనుగులకు సాదర స్వాగతం

Aug 17 2014 3:20 AM | Updated on Sep 26 2018 5:59 PM

విశ్వ విఖ్యాత మైసూరు దసరా ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచే జంబూ సవారీలో పాల్గొనే ఏనుగులకు శనివారం ఇక్కడ రాజప్రాసాదం వద్ద సాదర స్వాగతం లభించింది.

మైసూరు : విశ్వ విఖ్యాత మైసూరు దసరా ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచే జంబూ సవారీలో పాల్గొనే ఏనుగులకు శనివారం ఇక్కడ రాజప్రాసాదం వద్ద సాదర స్వాగతం లభించింది. అర్జున నాయకత్వంలోని ఆరు ఏనుగుల బృందం స్థానిక అరణ్య భవన్ నుంచి రాజప్రాసాదానికి చేరుకున్నాయి.

జంబూ సవారీలో అంబారీని మోసే అర్జునతో పాటు బృందంలో ఇంకా గజేంద్ర, బలరామ, అభిమన్యు, వరలక్ష్మి, మేరి ఉన్నాయి. జానపద బృందాలు, కలశాలు ఎత్తుకున్న మహిళలు ముందు నడవగా బల్లాల్ సర్కిల్, రామస్వామి సర్కిల్, చామరాజ డబుల్ రోడ్డు, బసవేశ్వర సర్కిల్ మీదుగా ఈ ఏనుగులన్నీ రాజ ఠీవితో రాజప్రాసాదంలోకి ప్రవేశించాయి.

స్వాగత కార్యక్రమం మినీ దసరా ఊరేగింపును తలపించింది. దారి పొడవునా ప్రజలు ఈ అపురూప ఘట్టాన్ని కనులారా వీక్షించారు. కాగా ఏనుగుల బృందానికి స్వాగత కార్యక్రమంలో ఈసారి మార్పు చేసినట్లు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వీ. శ్రీనివాస ప్రసాద్ తెలిపారు. మామూలుగా రాజప్రాసాదంలోని జయమార్తాండ ద్వారం వద్ద దసరా ఏనుగులకు స్వాగతం పలకడం ఆనవాయితీ. అయితే ఈసారి కొన్ని కారణాల వల్ల ఏనుగులు విడిది చేసిన అరణ్య భవన్ వద్దే స్వాగత కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన వివరించారు.

జిల్లాలోని హుణసూరు తాలూకా వీరనహొసహళ్లి నుంచి గురువారం బయలుదేరి అశోక్ పురంలోని అరణ్య భవ న్‌లో విడిది చేసిన ఏనుగులకు స్వాగతం పలికిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మహారాణి ప్రమోదా దేవితో మాట్లాడినప్పుడు, శ్రీకంఠదత్త ఒడయార్ మరణించిన నేపథ్యంలో దసరా సందర్భంగా నిర్వహించే ప్రైవేట్ దర్బార్ సహా అన్ని కార్యక్రమాలను రద్దు చేసినట్లు చెప్పారని వివ రించారు.

అందువల్లే ఏనుగుల బృందానికి రాజప్రాసాదం వద్ద స్వాగతం పలకలేదని చెప్పారు. దసరా ఉత్సవాలకు సంపూర్ణ సహకారాలు అందిస్తామని రాణి హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. సహకార శాఖ మంత్రి హెచ్‌ఎస్. మహదేవ ప్రసాద్, జిల్లా పంచాయతీ అధ్యక్షురాలు పుష్పావతి అమరనాథ్, జిల్లా కలెక్టర్ సీ. శిఖా ప్రభృతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement