‘రాజావాడి’.. మృత్యు ఒడి! | Daily average of 16 people were killed in the hospital | Sakshi
Sakshi News home page

‘రాజావాడి’.. మృత్యు ఒడి!

May 31 2014 10:47 PM | Updated on Sep 2 2017 8:08 AM

రాజావాడీ ఆస్పత్రిలో చేరారంటే మృత్యువు నోట్లో తలపెట్టినట్లే.. సరాసరి యమలోకానికి టికెట్ తీసుకున్నట్లేనని స్థానికులు భావిస్తున్నారు.

 సాక్షి, ముంబై: రాజావాడీ ఆస్పత్రిలో చేరారంటే మృత్యువు నోట్లో తలపెట్టినట్లే.. సరాసరి యమలోకానికి టికెట్ తీసుకున్నట్లేనని స్థానికులు భావిస్తున్నారు. మహానగర పాలక సంస్థ (బీఎంసీ)కి చెందిన రాజావాడి ఆస్పత్రిలో రోజుకు సరాసరి 16 మంది దుర్మరణం చెందినట్లు ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆందోళన కలిగించే ఈ విషయం సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాలతో బయటపడింది. నగరంలో జే.జే. ఆస్పత్రి మినహా కేం, నాయర్, సైన్, రాజావాడి ఆస్పత్రులు బీంఎసీ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి.
 
ఇందులో ముఖ్యంగా కేం, నాయర్, సైన్ ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య, అందులో చేరేవారి సంఖ్య అత్యధికంగా ఉంటుంది. వీటితో పోలిస్తే రాజావాడి ఆస్పత్రిలో చేరే రోగుల సంఖ్య అత్యల్పంగా ఉన్నప్పటికీ మృతుల సంఖ్యలో మాత్రం అగ్రస్థానంలో ఉంది. శుక్రవారం జరిగిన స్థాయీ సమితి సమావేశంలో ఆస్పత్రుల స్థితిగతులపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ ప్రవీణ్ చెఢా నాయర్  కేం, సైన్, రాజావాడి ఆస్పత్రుల్లో గత 13 సంవత్సరాల కాలంలో మృతి చెందిన వారి వివరాలు అందజేశారు. ఆస్పత్రి సూపరెంటెండెంట్ అందించిన వివరాల ప్రకారం రాజావాడి ఆస్పత్రిలో 2001 నుంచి 2014 మార్చి వరకు మొత్తం 55,75,716 రోగులు చేరారు.
 
 అందులో 76,663 మంది చనిపోయారు. దీన్ని బట్టి సరాసరి రోజుకు 16 మంది మృతి చెందుతున్నట్లు స్పష్టమైంది. ఇదే 13 సంవత్సరాల కాలంలో సైన్ ఆస్పత్రిలో దాదాపు 1.92 కోట్లు రోగులు చేరగా 63,373 మంది చనిపోయారు. అలాగే నాయర్ ఆస్పత్రిలో 33 లక్షల మంది రోగులు చేరగా 29,650 మంది చనిపోయారు. సైన్ ఆస్పత్రిలో సరాసరి రోజుకు 13 మంది చనిపోగా, నాయర్ ఆస్పత్రిలో సరాసరి రోజుకు ఆరుగురు చనిపోయినట్లు వెల్లడించారు. ప్రముఖ మూడు ఆస్పత్రులతో పోలిస్తే రాజావాడిలో చేరే రోగుల సంఖ్య అత్యల్పంగా ఉంది.
 
 కాని మృతుల సంఖ్యలో వీటిని అధిగమించింది. దీన్ని బట్టి రాజావాడి ఆస్పత్రి పనితీరుపై చెఢా అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ వివరాలపై బీఎంసీ అదనపు కమిషనర్ సంజయ్ దేశ్‌ముఖ్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాలను మరోసారి పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. గత సంవత్సర కాలంలో ఈ ఆస్పత్రిలో 1,008 మంది రోగులు మాత్రమే చనిపోయారని తెలిపారు. దీని ప్రకారం సరాసరి రోజుకు ముగ్గురే మృతి చెందినట్లు స్పష్టమవుతోందన్నారు. కాని రోజుకు 16 మంది మృతి చెందుతున్నట్లు వెల్లడి కావడం అతిశయోక్తిగా ఉందని,  లెక్కల్లో ఇంత తేడా ఉండదని దేశ్‌ముఖ్ స్పష్టం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement