మదురవాయల్ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా అరుళ్ అన్భరసన్ ప్రకటించాలని కోరుతూ
కేకే.నగర్: మదురవాయల్ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా అరుళ్ అన్భరసన్ ప్రకటించాలని కోరుతూ గురువారం ఉదయం పూందమల్లిలోని 150 అడుగుల ఎత్తు గల సెల్‌ఫోన్ టవర్‌పై ఎక్కి కాంగ్రెస్ నాయకుడు ఆత్మహత్యా బెదిరింపు చేసిన సంఘటన ఆ ప్రాంతంలో సంచలనం కలిగించింది. పూందమల్లి సమీపంలోని కుమనన్ చావడి బస్టాండు సమీపంలో బీఎస్‌ఎన్‌ఎల్ సెల్‌ఫోన్ టవర్ ఉంది.
దీని సమీపంలో గురువారం ఉదయం 10.30 గంటలకు తిరువళ్లూర్ పార్లమెంటు నియోజకవర్గం యువజన కాంగ్రెస్ సహాయ అధ్యక్షుడు ఆవడి ధనా ఆధ్వర్యంలో 15కు పైగా కాంగ్రెస్ కార్యకర్తలు గుమిగూడారు. వారందరూ మధురవాయల్ అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా అన్భరసన్‌ను ప్రకటించాలని నినాదాలు చేశారు.
ఆ సమయంలో ఆ గుంపు మధ్య నుంచి అయ్యప్పన్ తాంగల్‌కు చెందిన కాంగ్రెస్ కార్యకర్త కేశవన్ (34) కాంగ్రెస్ పార్టీ జెండాతో బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ పైకి ఎక్కాడు. 150 అడుగుల ఎత్తు టవర్‌పై జెండాతో నిలబడి అరుల్ అన్భరసన్‌ను అభ్యర్థిగా ప్రకటించే వరకు తాను కిందకు దిగనని అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు. సమాచారం అందుకుని పూందమల్లి అసిస్టెంట్ కమిషనర్ అయ్యప్పన్, పోలీసులు అక్కడకు చేరుకుని కేశవన్‌ను కిందకు దిగమని హెచ్చరించారు. ఆ తరువాత కేశవన్ కిందకు దిగి రావడంతో కార్యకర్తలు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.