రాజ్య సభకు కుష్భు | Sakshi
Sakshi News home page

రాజ్య సభకు కుష్భు

Published Wed, Dec 17 2014 2:37 AM

రాజ్య సభకు కుష్భు - Sakshi

 కాంగ్రెస్ నాయకురాలు, సినీ నటి కుష్భు ను అందలం ఎక్కించేందుకు ఏఐసీసీ కసరత్తు వేగవంతం చేసింది. త్వరలో మహారాష్ట్ర నుంచి ఆమెను రాజ్య సభకు పంపించేందుకు ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్ణయించినట్టుగా సత్యమూర్తి భవన్‌లో చర్చ సాగుతోంది. ఆమెకు అధికార ప్రతినిధి పదవి కట్టబెట్టేందుకు సిద్ధమైనట్టు సంకేతాలు వెలువడుతున్నాయి.
 
 సాక్షి, చెన్నై:  కుష్భు డీఎంకే నుంచి బయటకు వచ్చాక కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. కుష్భు వాక్చాతుర్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కుష్భు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక ఆకర్షణ అయ్యారు. పార్టీలో చేరినప్పటి నుంచి తన సేవల్ని విస్తృత పరిచే పనిలో పడ్డారు. రాష్ట్రంలో పర్యటిస్తూ తనదైన శైలిలో ప్రజల్ని ఆకర్షించే పనిలో ఉన్నారు. ఆయూ ప్రాంతల్లో జరిగే పార్టీ కార్యక్రమాలకు కాంగ్రెస్ వాదులు ఆమెను ఆహ్వానించడంలో ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. కాంగ్రెస్‌లో ఇది వరకు రాష్ట్రానికి ఏ మహిళా నాయకురాలు ప్రజా సమస్యలపై స్పందించింది లేదు. అలాగే, కేంద్రం తీరును దుయ్యబట్టే రీతిలో వ్యాఖ్యలు చేయలేదు. అయితే, కుష్భు రెండు అడుగులు ముందుకు వేసి పాలకుల తీరును ఎండగట్టే పనిలో పడ్డారు. దీంతో ఆమెకంటూ కాంగ్రెస్‌లో మద్దతు వర్గం పెరుగుతోంది.  ఆమె వెళ్తున్న సభలకు స్పందన వస్తుండడంతో పార్టీ పరంగా అందలం ఎక్కించాలన్న నిర్ణయానికి ఏఐసీసీ వచ్చి ఉన్నట్టు కాంగ్రెస్ కార్యాలయంలో చర్చ ఆరంభం అయింది.
 
 గౌరవ పదవి : కుష్భు సేవల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్ణయించారు. కుష్భు హిందీ, ఆంగ్ల, తమిళం, ఉర్దూ భాషల్ని అనర్గళంగా మాట్లాడటం,  ఆమె వాక్ చాతుర్యం, దూకుడు, సందర్భానుచితంగా స్పందించడాన్ని పరిశీలించిన ఏఐసీసీ ఆమెను పార్టీ పరంగా అందలం ఎక్కించేందుకు సిద్ధం అవుతోన్నది. తమిళనాడుతో పాటుగా ఇతర రాష్ట్రాల్లోనూ ఆమెకు అభిమానులు ఉండడంతో అవసరాన్ని బట్టి, ఆయా ప్రాంతాల్లో ఎన్నికలను పరిగణనలోకి తీసుకుని అక్కడ కూడా కుష్భు సేవల్ని ఉపయోగించుకునే రీతిలో కార్యాచరణను ఏఐసీసీ సిద్ధం చేస్తోంది.
 
 ఆమె సేవలు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలంటే, పార్టీ పరంగా ఉన్నతమైన, గౌరవ ప్రదంగా ఉండే పదవి అప్పగించాలని నిర్ణరుుంచారు. తొలుత పార్టీ అధికార ప్రతినిధి పదవి అప్పగించి, దక్షిణాది రాష్ట్రాల్లో ఆమె సేవల్ని ఉపయోగించుకునేందుకు నిర్ణయించారు. అలాగే,  త్వరలో ఖాళీ కాబోతున్న రాజ్యసభ పదవులకు జరిగే ఎన్నికలను పరిగణనలోకి తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆమెకు ఎంపీ పదవి సైతం అప్పగించే వ్యూహంతో ఏఐసీసీ ఉన్నట్టుగా సత్యమూర్తి భవన్‌లో ప్రచారం సాగుతోంది. కుష్భు స్వస్థలం మహారాష్ట్ర కావడంతో అక్కడి నుంచి ఆమెకు రాజ్య సభ సీటు ఇస్తే, ఎలాంటి వ్యతిరేకత, ఇబ్బందులు ఉండవన్న నిర్ణయానికి వచ్చిన ఏఐసీసీ పెద్దలు అందుకు తగ్గ కార్యాచరణను వేగవంతం చేశారు.
 

Advertisement
Advertisement