కాంగ్రెస్‌పై మరో మచ్చ | congress get another tainted | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌పై మరో మచ్చ

Mar 28 2014 11:39 PM | Updated on Apr 4 2019 3:25 PM

ప్రత్యేక ఈలంను కోరుతున్న అక్కడి తమిళులను శ్రీలంక ప్రభుత్వం ఊచకోత కోసింది. వేలాది మంది ప్రాణాలు హరించిపోగా, స్త్రీలు ధన, మాన ప్రాణాలను కోల్పోయారు.

చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రత్యేక ఈలంను కోరుతున్న అక్కడి తమిళులను శ్రీలంక ప్రభుత్వం ఊచకోత కోసింది. వేలాది మంది ప్రాణాలు హరించిపోగా, స్త్రీలు ధన, మాన ప్రాణాలను కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులై భారత్‌లో శరణార్థులుగా తలదాచుకుంటున్నారు. శ్రీలంక మారణకాండ సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వం తగినరీతిలో స్పందించలేదు.
 
ఆ తరువాత వచ్చిన ఎన్నికల్లో ఘోరపరాజయం కావడం ద్వారా డీఎంకే భారీ మూల్యమే చెల్లించుకుంది. శ్రీలంక దేశాధ్యక్షుడు రాజపక్సేను యుద్ధనేరస్తుడిగా ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కౌన్సిల్ ముందు నిలబెట్టాలని ప్రపంచ వ్యాప్తంగా తమిళులు భారతదేశాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అంతేగాక శ్రీలంక దేశానికి చెందిన ఎవరినీ దేశంలో కాలుమోపనీయకుండా నిరసనలు చేపడుతున్నారు. తమిళనాడుకు వచ్చిన వారిని తరిమి కొడుతున్నారు. ఈ నేపథ్యంలో ఐరాస మానవహక్కుల కౌన్సిల్‌లో శ్రీలంక వైఖరిని నిరసిస్తూ అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానికి 23 దేశాలు మద్దతు పలకగా, 12 దేశాలు వ్యతిరేకించాయి, 11 దేశాలు అభిప్రాయాన్ని తెలపకుండా పరోక్షంగా ఆమెరికా తీర్మానాన్ని తిరస్కరించాయి. ఈ 11 దేశాల్లో భారత్ కూడా ఉండడం తమిళుల ఆగ్రహానికి కారణమైంది.
 
భారత్ మద్దతు తెలపాల్సింది : పి చిదంబరం
శ్రీలంకకు వ్యతిరేకంగా అమెరికా ప్రతిపాదించిన తీర్మానాన్ని కేంద్రం బలపరిచి ఉండాల్సిందని కేంద్ర ఆర్థికమంత్రి పీ చిదంబరం వ్యాఖ్యానించారు. చెన్నై మీనంబాకం విమానాశ్రయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, ఈ తీర్మానం విషయంలో అన్నాడీఎంకే అమెరికాకు వ్యతిరేకంగానూ, డీఎంకే అనుకూలంగా వ్యవహరించడం వల్లనే కేంద్రం తటస్థంగా ఉండిపోయిందని అన్నారు. శ్రీలంక తీరును నిలదీసేందుకు ఐరాస మాత్రమే కాదు ఇంకా అనేక అంతర్జాతీయ వేదికలు ఉన్నాయని, అపుడు ఒత్తిడితేవచ్చన్నారు. అయినా ఈ విషయం విదేశాంగ  మంత్రిత్వశాఖ పరిధిలోకి వస్తుందని తప్పించుకున్నారు.
 
తమిళుల ఆవేదన : కరుణానిధి

శ్రీలంకపై భారత్ ఉదాసీన వైఖరిని అవలంభించడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమిళులు ఆవేదన చెందారని డీఎంకే అధినేత కరుణానిధి తీవ్రంగా విమర్శించారు. భారత ప్రభుత్వమే దేశంలోని తమిళుల మనోభావాలను కాలరాసిందని అన్నారు. తమిళుల పట్ల కాంగ్రెస్ పార్టీ ఇంత కర్కశంగా వ్యవహరిస్తున్నా రాష్ట్రంలోని ఆ పార్టీ నేతలు అంగీకరించరని విమర్శించారు.
 
దేశవ్యాప్త సమస్యలను పక్కనపెడితే రాష్ట్ర స్థాయిలో జఠిలంగా మారిన సమస్యలకు కాంగ్రెస్ ప్రభుత్వమే కేంద్ర బిందువుగా మారింది. శ్రీలంక యుద్ధం, తమిళ జాలర్లకు ఆ దేశం వల్ల వేధింపులు, రాజీవ్ హంతకులకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన క్షమాభిక్షను అడ్డుకోవడం కాంగ్రెస్‌కు శాపాలుగా మారాయి. వీటికి అదనంగా అమెరికా తీర్మానం మచ్చ పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement