దేవినేని, వల్లభనేని మధ్య కల్వర్టు 'చిచ్చు' | clashes between vallabhaneni vamsi and devineni rajasekhar | Sakshi
Sakshi News home page

దేవినేని, వల్లభనేని మధ్య కల్వర్టు 'చిచ్చు'

Oct 2 2016 12:03 PM | Updated on Aug 10 2018 9:46 PM

దేవినేని, వల్లభనేని మధ్య కల్వర్టు 'చిచ్చు' - Sakshi

దేవినేని, వల్లభనేని మధ్య కల్వర్టు 'చిచ్చు'

టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, దేవినేని నెహ్రూ మధ్య కల్వర్టు కూల్చివేత ఘటన మరోసారి నిప్పురాజేసింది.

తొలి నుంచీ ఉప్పు నిప్పులా ఉన్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ మధ్య కల్వర్టు కూల్చివేత ఘటన మరోసారి నిప్పురాజేసింది. గన్నవరం నియోజకవర్గంలో పట్టు నిలుపుకొనేందుకు నెహ్రూ ప్రయత్నిస్తున్నారు. అయితే తన నియోజకవర్గంలో ఆయన జోక్యాన్ని వంశీ సహించడంలేదు. ఇద్దరు నేతల మధ్య ఈ అంతర్యుద్ధం ఎటు దారితీస్తుందోనని టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.

 
సాక్షి, విజయవాడ : అధికార టీడీపీకి చెందిన మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ), గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ మధ్య అంతర్యుద్ధం మొదలైంది. విజయవాడ రూరల్ మండలంలోని రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమానూరు తదితర గ్రామాలు గన్నవరం నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. ఈ గ్రామాల్లో పార్టీ పరంగా ఎమ్మెల్యే వంశీకి మంచి పట్టుంది.
 
ఈ గ్రామాల్లో నెహ్రూ అనుచరులు ఉన్నారు. నెహ్రూ కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఎవరి కార్యకర్తలు ఆ పార్టీకి పనిచేసేవారు. నెహ్రూ టీడీపీలో చేరిన తరువాత ఇద్దరు నేతలు, వారి అనుచరులు ఆయా గ్రామాలపై పట్టుబిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే కావడంతో తనమాటే చెల్లాలనే ఆలోచనలో వంశీ, నియోజకవర్గంలో తనదైన ముద్ర చాటి తద్వారా పార్టీలో పట్టు మరింత బింగించాలనే ఆలోచనలో నెహ్రూ ఉన్నారు. ఈ దిశగా ఇద్దరు నాయకులు పావులు కదుపడంతో గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ రెండుగా చీలిపోతోంది.  
 
కల్వర్టు కూల్చివేతపై వంశీ ఆగ్రహం
ఎనికేపాడు బీవీ రావు కల్యాణ మండపం సమీపంలోని పవన్ క్లాసిక్ అపార్టుమెంట్ వాసులు కాలువ మీదుగా రాక పోకలు సాగించడానికి ఏర్పాటు చేసిన కల్వర్టుకు రెండువైపులా ఉన్న గోడలను నెహ్రూ అనుచరులు శుక్రవారం రాత్రి పొక్లెయిన్‌తో కూల్చివేశారు. ఈ చర్యను అపార్టుమెంట్‌వాసులు అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న వంశీ శనివారం అక్కడకు వచ్చి నెహ్రూపై అగ్గిమీద గుగ్గిలమై అపార్టుమెంట్‌వాసులకు అండగా నిలబడ్డారు. తన నియోజకవర్గంలో నెహ్రూ జోక్యం చేసుకోవడాన్ని వంశీ వ్యతిరేకించారు.  

చంద్రబాబు, రాష్ట్ర పార్టీ దృష్టికి వివాదం
గన్నవరం నియోజకవర్గంలో నెహ్రూ జోక్యం చేసుకోవడంపై వంశీమోహన్ ముఖ్యమంత్రి చంద్రబాబు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకట్రావ్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు ఫిర్యాదు చేశారని తెలిసింది. తన నియోజకవర్గంలో నెహ్రూ ఆధిపత్యాన్ని సహించనని తేల్చిచెప్పినట్లు సమాచారం. నెహ్రూ పార్టీలో చేరేటప్పుడు ఇచ్చిన హామీలకు అనుగుణంగా తమకు పూర్తి న్యాయం చేయాలని వంశీ డిమాండ్‌చేశారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
 
నెహ్రూ రాకపై వంశీ అసంతృప్తి
దేవినేని నెహ్రూ తెలుగుదేశం పార్టీలోకి రావడంతో ఎమ్మెల్యే వంశీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నెహ్రూ పార్టీలోకి చేరే రోజున వంశీ, ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తమ ఇబ్బందులను చర్చించారు. నెహ్రూ పార్టీలో చేరే కార్యక్రమానికి వారిద్దరూ దూరంగానే ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చినప్పటికీ ఇద్దరి నేతల మధ్య విభేదాలు సమసిపోలేదు.  
 
గతంలో మాటల యుద్ధం
నెహ్రూ కాంగ్రెస్‌లో ఉండగా.. వంశీ అర్బన్ టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ సమయంలో వారి మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది. నువ్వెం తంటే... నువ్వెంత్వంటూ ఒకరికొకరు బహిరంగంగా సవాళ్లు విసురుకున్నారు. చివరకు వంశీ గన్నవరానికి వెళ్లడంతో ఆ వివాదం అప్పట్లో సమసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement