శివరాత్రికి నగరం సిద్ధం | city ready to shivaratri | Sakshi
Sakshi News home page

శివరాత్రికి నగరం సిద్ధం

Feb 26 2014 11:11 PM | Updated on Oct 8 2018 4:35 PM

సృష్టి, స్థితి, లయ కారకుడైన మహా శివుడికి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని (ఈ నెల 27వ తేదీ గురువారం) నగరంలోని ప్రధాన శివాలయాలు రంగురంగుల విద్యుత్ దీపాలు, రకరకాల పువ్వులతో ముస్తాబయ్యాయి.

 దాదర్, న్యూస్‌లైన్: సృష్టి, స్థితి, లయ కారకుడైన మహా శివుడికి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని (ఈ నెల 27వ తేదీ గురువారం) నగరంలోని ప్రధాన శివాలయాలు రంగురంగుల విద్యుత్ దీపాలు, రకరకాల పువ్వులతో ముస్తాబయ్యాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. భక్తులు తోపులాటకు గురి కాకుండా ఉండేందుకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. తాగునీటి సదుపాయం కల్పించారు.

 పరేల్‌లోని శ్రీ మాణికేశ్వర మందిరం..
 నగరంలోని పరేల్ ప్రాంతంలోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మార్గంలోని దామోదర్ హాలు సమీపంలో ఉన్న ‘శ్రీ మాణికేశ్వర మందిరం’లో శివరాత్రిని పురస్కరించుకొని విశేషమైన ఏర్పాట్లు చేశారు.ఈ సందర్భంగా ఆలయంలో ‘మహా శివరాత్రి త్రికాల పూజలు’, ‘రుద్రాభిషేకాలు’ నిర్వహించనున్నారు. అదేవిధంగా రాత్రి 8 గంటల నుంచి సుమారు 4 గంటలపాటు సాగే ‘నిశీదకాల శివపూజనం’ తదితర  కార్యక్రమాలు నిర్వహించనున్నామని దేవాలయ ముఖ్యుడు కొరిడే చంద్రశేఖర్ తెలిపారు. కాగా, సుమారు 185 ఏళ్ల క్రితం మాణికేశ్వరుడు ఇక్కడ స్వయంసిద్ధ లింగంగా అవతరించాడని పూర్వీకులు చెబుతారు. ఈ ఆలయంలో ప్రారంభం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొరిడే వంశస్తులు పూజాదికాలు నిర్వహిస్తున్నారు. సదాశివ పూజారి కుమారుడు కొరిడే చంద్రశేఖర్, మూడవ తరానికి చెందిన ఆయన మనవలు ఇప్పటికీ ఆలయంలో పూజలు, ఇతర బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

 డోంబివలిలో..
 డోంబివలి (తూర్పు) రైల్వే స్టేషన్ నుంచి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో కల్యాణ్-షిల్ రహదారిలో ఉన్న ఖిడకాళేశ్వర మందిరం పరిసరాలు ఇప్పటికే అన్నిరకాల పూజా సామగ్రి, పూల దుకాణాలు, తిను బండారాలు, మిఠాయిలు విక్రయించే దుకాణాలతో పండగ వాతావరణం సంతరించుకుంది. శివరాత్రి మరుసటి రోజు ఆలయాన్ని సందర్శించే వేలాది మంది భక్తులకు ‘భండారా’ పేరిట అన్న సంతర్పణ జరుగనుంది.

 అంబర్‌నాథ్ పట్టణంలో..
 అంబర్‌నాథ్‌లోని ప్రాచీన అంబ్రేశ్వర్ మందిరంలో స్వామి వారిని సందర్శించి పూజలు జరిపించడానికి ప్రతీ ఏటా వేలాది భక్తులు రావడం ఒక విశేషం. కాగా, మహారాష్ట్రలో నాసిక్ పట్టణంలోని త్రయంబకేశ్వర మందిరం, పుణేలోని భీమ్‌శంకర్ మందిరం, నాగేశ్వర మందిరం, ఔరంగాబాద్‌లోని గ్రిష్ణేశ్వర మందిరం, నగర శివారులో ఉన్న వసై పట్టణ సమీపంలోని తుంగారేశ్వర ఆలయం, అంబర్‌నాథ్ పట్టణంలోని అంబ్రేశ్వర శివ మందిరం, ఇలా ఎన్నో పేర్లతో భక్తులచే విశేష పూజలందుకుంటున్న ఈశ్వరునికి మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని నగరంలోని ప్రధాన శివాలయాల్లో ఏర్పాట్లు ఘనంగా చేశారు. కాగా నగరంలోని వాల్కేశ్వర మందిరం, బాబుల్‌నాథ్ మందిరం తదితర శివాలయాలను సందర్శించే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement