మళ్లీ వాయిదా ! | Chief Minister Siddaramaiah Delhi tour canceled | Sakshi
Sakshi News home page

మళ్లీ వాయిదా !

Apr 24 2016 3:11 AM | Updated on Aug 31 2018 8:24 PM

మళ్లీ వాయిదా ! - Sakshi

మళ్లీ వాయిదా !

గత కొంతకాలంగా ఆశావహుల్లో తీవ్ర కుతూహలాన్ని పెంచుతూ వచ్చిన మంత్రివర్గ విస్తరణకు మరోసారి బ్రేక్ ...

లభించని అధినేత్రి అపాయింట్‌మెంట్  
కరువు దృష్ట్యా విస్తరణ వాయిదా   వేసుకోవాలని అధిష్టానం సూచన
హైకమాండ్ సూచనలతో సీఎం ఢిల్లీ టూర్ రద్దు ఆశావహుల్లో నిరాశ
 

సాక్షి, బెంగళూరు: గత కొంతకాలంగా ఆశావహుల్లో తీవ్ర కుతూహలాన్ని పెంచుతూ వచ్చిన మంత్రివర్గ విస్తరణకు మరోసారి బ్రేక్ పడింది. మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్‌తో చర్చించి విస్తరణకు అనుమతి తీసుకోవాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భావించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆయనకు ఇందుకు అవకాశం కల్పించలేదు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అపాయింట్‌మెంట్ లభించకపోవడంతో సీఎం సిద్ధరామయ్య తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. జిల్లా పంచాయతీ, తాలూకా పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గత కొంతకాలంగా మంత్రివర్గ విస్తరణ వాయిదా పడింది.

అయితే మంత్రి వర్గ విస్తరణకు గతంలో ఎన్నికలు అడ్డువస్తే ఇప్పుడు కరువు పరిస్థితులు మంత్రి వ ర్గ విస్తరణకు బ్రేక్ వేస్తున్నాయి. కాగా, మే 13 నాటికి రాష్ట్ర ప్రభుత్వం ఏరాటై మూడేళ్లు పూర్తికానున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భావించారు. ఇందుకు సంబంధించి ఇటీవల నగరానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కర్ణాటక వ్యవ హారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్ సింగ్‌తో సైతం సిద్ధరామయ్య చర్చించారు. శనివారం రోజున ఢిల్లీ చేరుకొని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పాటు రాహుల్‌గాంధీతో సమావేశమై మంత్రివర్గ విస్తరణకు అనుమతి తీసుకోవాలని భావించారు.

అయితే ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మంత్రి వర్గ విస్తరణను వాయిదా వేయాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సీఎం సిద్ధరామయ్యను ఆదేశించింది. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణను చేపడితే కరువు పరిస్థితుల నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందని హైకమాండ్ తెలిపింది. అందువల్ల రాష్ట్రంలో కరువు పరిస్థితుల నిర్వహణకు ముందుగా ప్రాముఖ్యతను ఇవ్వాలని లేదంటే ప్రతిపక్షాల చేతిలో విమర్శలు ఎదుర్కొనాల్సి ఉంటుందని సిద్ధరామయ్యకు సూచించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంత్రి వర్గ విస్తరణకు తాత్కాలికంగా బ్రేకులు వేశారు.


 ముఖ్యమంత్రుల సమావేశానికీ  వెల్లడం లేదు.....
ఇక ఆదివారం (24న) ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరగనున్న ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లాలని సిద్ధరామయ్య భావించారు. సమావేశంలో పాల్గొనడంతో పాటు హైకమాండ్‌తోనూ చర్చలు జరిపి రాష్ట్రానికి తిరిగి రావాలని అనుకున్నారు. అయితే హైకమాండ్‌తో భేటీకి అపాయింట్‌మెంట్ లభించని నేపథ్యంలో తన ఢిల్లీ టూర్‌ను రద్దు చేసుకున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఢిల్లీలో జరగనున్న ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సమావేశానికి హాజరు కావాల్సిందిగా రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టి.బి.జయచంద్రను ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement