దసరా ఉత్సవాల్లో భాగంగా లలితా త్రిపుర సుందరీదేవి అలంకరణలోని దుర్గమ్మను దర్శించుకునేందుకు విచ్చేసిన మంత్రి మృణాళినికి చేదు అనుభవం ఎదురైంది.
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : దసరా ఉత్సవాల్లో భాగంగా లలితా త్రిపుర సుందరీదేవి అలంకరణలోని దుర్గమ్మను దర్శించుకునేందుకు విచ్చేసిన మంత్రి మృణాళినికి చేదు అనుభవం ఎదురైంది. మంత్రి దంపతులు అమ్మవారి దర్శనం కోసం గురువారం ఆలయ ప్రాంగణానికి చేరుకున్నా ఆలయ అధికారులు, రెవెన్యూ అధికారులు గుర్తించలేదు.
అంతరాలయంలోని వీఐపీలు వెళ్లే మార్గం వద్ద పోలీసులు ఉన్నా మంత్రిని గుర్తించకపోవడంతో ఆమె కొంత సేపు ఆరుబయటే ఉండిపోయారు. కొంత సేపటి తరువాత మంత్రిని గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది ఆమెను ఆలయంలోకి తీసుకెళ్లారు. గతంలో ఇదే తరహా ప్రొటోకాల్ వ్యవహారంలో దుర్గగుడి ఈవోలతో పాటు అధికారులపై వేటు పడింది. అయినా అధికారుల తీరు మారలేదనేందుకు ఇదే చక్కటి ఉదాహరణ అని మంత్రి అనుచరులు బహిరంగంగానే విమర్శించారు.