శిథిలావస్థలో ‘డకోటా’

biju patnaik dakota flight in kolkata airport - Sakshi

మరుగున పడిన బిజూ ధీరత్వ సారథి విమానం

కోల్‌కత్తా విమానాశ్రయంలో నిరాదరణ

రాష్ట్రానికి తరలించేందుకు సన్నాహాలు

భువనేశ్వర్‌:  రాష్ట్ర చరిత్రలో బిజూ పట్నాయక్‌ ధీరునిగా స్థానం సాధించారు. ధీరత్వ కార్యశైలిలో అడుగడుగునా అనుక్షణం డకోటా విమానం తోడుగా ఉండడం విశేషం. రాష్ట్ర చరిత్రలో ఇదో స్మారక చిహ్నంగా వెలుగొందాల్సిన అద్భుత నమూనా. మౌలిక ఆదరణకు దూరమై కోల్‌కత్తా విమానాశ్రయంలో మరుగున పడి ఉంది. ఈ అపురూప డకోటా విమానాన్ని అపురూపంగా పదిలపరచుకోవలసిన రాష్ట్ర ప్రభుత్వం దీని వైపు దృష్టి సారించకపోవడం విచారకరం. భారత విమానాశ్రయాల విభాగం రాష్ట్రానికి మేల్కొలిపింది. దివంగత ముఖ్యమంత్రి ధీరత్వానికి ప్రతీకగా ప్రతిబింబించాల్సిన డకోటా విమానం ఆదరణపట్ల రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని అభ్యర్థించింది. ఈ అభ్యర్థనతో రాష్ట్ర ప్రభుత్వం చైతన్యవంతమైంది. రాష్ట్రానికి తక్షణమే తరలించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. అనుబంధ విభాగాలు, వర్గాలతో సంప్రదింపులు చురుగ్గా  సాగుతున్నాయి. త్వరలో బిజూ పట్నాయక్‌ డకోటా విమానం రాష్ట్రానికి తరలివస్తుంది.

ఆశ్రయం ఎక్కడ?
అపురూపమైన డకోటా విమానం దివంగత ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్‌ ప్రతీకగా రాష్ట్రానికి తరలివస్తుంది. రాష్ట్ర ప్రజలతో పాటు పర్యాటకులు, సందర్శకులు తిలకించేందుకు అనుకూలమైన ప్రాంతంలో దీనిని ప్రదర్శించడం అనివార్యంగా భావిస్తున్నారు. అటువంటి అనుకూల ప్రాంతంపట్ల తర్జన భర్జనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో దీనిని పదిల పరిచే యోచనతో బిజూ జనతా దళ్‌ వర్గాలు యోచిస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్‌ జన్మ స్థలం, సొంత భవనం కటక్‌ నగరంలో ఆనంద భవన్‌ మ్యూజియంగా వెలుగొందుతోంది. ఈ ప్రాంగణంలో డకోటా విమానాన్ని ప్రదర్శించాలనే యోచన పార్టీ శ్రేణుల్లో బలంగా కనిపిస్తోంది. అయితే అందుకు అవసరమైనంత స్థలం ఈ ప్రాంగణంలో అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది. 

అంతర్జాతీయ పర్యాటకుల కోసం
ప్రియతమ నాయకుని అద్భుత విహంగ విన్యాసాల్ని  ప్రతిబింబించే డకోటా విమానం స్థానిక బిజూ పట్నాయక్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ఆవరణలో ఉండాలనే ఆకాంక్ష పలువురి హృదయాల్లో  ఉంది. నిత్యం దేశ, విదేశాల నుంచి విచ్చేసే జాతీయ, అంతర్జాతీయ విమాన యాన పర్యాటకుల దృష్టిని ఆకట్టుకుంటుందని ఈ వర్గం అభిప్రాయం. నిర్వహణ శైలి కూడా ఉన్నతంగా కొనసాగుతుందని భావిస్తున్నారు. బిజూ పట్నాయక్‌కు చేదోడు వాదోడుగా ఉపయోగపడిన డకోటా విమానం భద్రపరిచేందుకు స్థానిక బిజూ పట్నాయక్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అధికార వర్గాలు కూడా మొగ్గు చూపుతున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం స్పందన
కోల్‌కత్తా విమానాశ్రయంలో మరుగున పడిన బిజూ పట్నాయక్‌ డకోటా విమానంపట్ల శ్రద్ధ వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు ఎయిర్‌ పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ గురు ప్రసాద్‌ మహాపాత్రో తెలిపారు. ఈ లేఖపట్ల రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. రవాణా చేసేందుకు అనుబంధ ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు త్వరలోనే ప్రభుత్వ అధికారి కోల్‌కత్తా సందర్శించి డకోటా తరలింపు వ్యవహారాల్ని పర్యవేక్షిస్తారని రాష్ట్ర ప్రభుత్వం బదులు లేఖ రాసినట్లు వివరించారు.

పరిశోధకుల మాట పెడ చెవిన
రాష్ట్ర కీర్తి చిహ్నంగా నిలవాల్సిన బిజూ పట్నాయక్‌ మిత్రుని లాంటి డకోటా విమానం మరుగున పడి ఉండడంపట్ల పరిశోధకుల వర్గం హృదయాల్ని కలిచి వేస్తోంది. బిజూ పట్నాయక్‌ చారిత్రాత్మక విజయాలకు ఈ విమానం సారథిగా నిలిచింది. అటువంటి అపురూప విమానం నేడు పొరుగు రాష్ట్రం విమానాశ్రయంలో శిథిలమవుతోంది. తక్షణమే సంరక్షించి రాష్ట్రంలో సురక్షిత ప్రాంతంలో పదిల పరచాలి. ప్రధానంగా స్థానిక బిజూ పట్నాయక్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంగణంలో దీనికి స్థానం కల్పించాలని అభ్యర్థిస్తున్నట్లు యుద్ధ పరిశోధకుడు అనిల్‌ ధీర్‌ తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి లేఖలు రాస్తూ 5 ఏళ్ల నుంచి నిరవధికంగా కృషి చేస్తున్నట్లు వివరించారు. ఆయన అభ్యర్థనలపట్ల ముఖ్యమంత్రి   పెడచెవి ధోరణిని  ప్రదర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎంతో ఘనం
దివంగత ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్‌ జీవిత చరిత్రలో డకోటా విమానం పాత్ర ఎంతో ఘనం. చరిత్రకారులు దీని పాత్రను అనన్యంగా పేర్కొంటున్నారు. శత్రు వర్గాలతో తలపడిన, వైరి వర్గాల స్థావరాల నుంచి స్వాతంత్ర సమర యోధుల్ని మాతృ భూమికి తరలించాల్సిన అపురూప సందర్భాల్లో డకోటా విమానమే బిజూ పట్నాయక్‌ వ్యూహాత్మక కార్యశైలికి సారథిగా నిలిచింది. ఇండోనేషియా స్వాతంత్ర సమరం, శ్రీనగర్‌ ఎదురు కాల్పులు, భారత సేనకు ఆహార సరఫరా వగైరా క్లిష్ట పరిస్థితుల్లో డకోటా సహాయంతో బిజూ పట్నాయక్‌ సాహస కృత్యాల్ని విజయవంతంగా నిర్వహించి జాతికి వన్నె తెచ్చిన చరిత్రని ఆవిష్కరించారు. ఈ ఘన చరిత్రకు డకోటా విమానమే వారధిగా చరిత్రకారులు పేర్కొంటారు. బిజూ బాబు సాహసానికి ఇదే ప్రేరణగా పేర్కొంటారు.

బిజూ పట్నాయక్‌ వీర గాథ గుర్తు వస్తే డకోటా విమానం పాత్ర విస్మరించడం ఎవరి తరం కాదు. ఇది బిజూ పట్నాయక్‌ కళింగ ఎయిర్‌ లైన్స్‌లో ఒకటి. పాకిస్థాన్‌ శత్రువలయాన్ని ఛేదించి శ్రీనగర్‌లో బందీలుగా ఉన్న భారత సైన్యాన్ని విమానం గుండా దేశానికి తరలించిన అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో డకోటా విమానం బిజూ పట్నాయక్‌కు సహకరించింది. సేనకు అవసరమైన ఔషధాలు, గుర్రాలు వగైరా రవాణా, ఇండోనేషియా ప్రధాన మంత్రిని డచ్‌ కబ్జా నుంచి విముక్తి కలిగించి ఆ దేశానికి అప్పగించడంలో డకోటా సేవలు అనన్యం. కోల్‌కత్తా నేతాజీ విమానాశ్రయం డంపింగ్‌ యార్డులో శిథిలావస్థలో కొట్టుమిట్టాడుతోంది.

ధైర్య సాహసాలు ఆయన సొత్తు
ధైర్య సాహసాలతో సంక్లిష్ట పరిస్థితుల్ని అవలీలగా ఎదురీదిన ధీరునిగా దివంగత ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్‌ మిగిలారు. బిజూ జీవితం పలు సాహస కృత్యాలకు ప్రతీకగా ప్రతిబింబిస్తుంది. పైలెట్‌గా ఆకాశ వీధుల్లో ఆయన సాధించిన ఘన విజయాలు అత్యద్భుతం. ఆయన సాహస కృత్యాలకు ప్రతీకగా ఇండోనేషియా భూమి పుత్రునిగా స్వీకరించింది. నేటికి ఆయన కుటుంబీకుల ఆత్మీయ, అనురాగాల్ని పంచుకుంటోంది.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top