యుద్ధం వస్తే తక్షణమే విధుల్లోకి: ఉత్తమ్
పాక్ తో యుద్ధం వస్తే ఏ క్షణమైనా విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్న్టటు ఉత్తమ్ ప్రకటించారు.
హైదరాబాద్: నియంత్రణ రేఖను దాటి వెళ్లి పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలో భారత సైన్యం చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్ సరిహద్దు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రతి ఒక్కరి గుండెను హత్తుకునే ప్రకటన చేసి ఆకట్టుకున్నారు. 20 ఏళ్లు భారత వాయుసేనలో మిగ్ ఎయిర్ క్రాఫ్ట్ పైలట్‌గా సేవలందించిన ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఇప్పటికీ కదనోత్సాహంతో ఉన్నారు. తన అంచనా ప్రకారం భారత్‌కు ప్రస్తుతం కష్టకాలమని, యుద్ధం దేనికి పరిష్కారం కాదని అన్నారు.
అస్థిర పాకిస్తాన్‌తో యుద్ధం వచ్చే పరిస్థితులు ప్రస్తుతం నెలకొని ఉన్నాయని.. ఆ దేశంలో ఎప్పుడు ఎలా స్పందిస్తుందో చెప్పడం కష్టమని అన్నారు. ఒకవేళ యుద్ధం వస్తే ఏ క్షణమైనా విధుల్లో చేరేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు ఉత్తమ్ ప్రకటించారు. దేశానికి సేవ చేయడం కంటే భాగ్యం మరోటి ఉండదని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన అన్ని మర్చిపోయాననుకోవడం పొరపాటని.. సమయం వస్తే కదన రంగంలో దూకడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు.