Indian surgical strikes
-
పాక్ వైఖరిని ఎండగట్టాలి: రఘువీరా
విజయవాడ: ఉగ్రమూకలపై భారత సైన్యం మెరుపుదాడులు చేయడం అభినందనీయమని ఏపీ పీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి అన్నారు. రాజకీయ పార్టీలన్నీ తమ విభేదాలను పక్కనపెట్టి.. సైనిక దాడి విషయంలో ప్రభుత్వానికి పూర్తి మద్ధతు ప్రకటించాలన్నారు. యావత్ భారతదేశం సైనికులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. సైనికులకు మద్ధతుగా శనివారం విశాఖలో ఏపీసీసీ ఆధ్వర్యంలో జై జవాన్-జై భారత్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వివరించారు. భారతదేశ సార్వభౌమాధికారానికి భంగం వాటిల్లితే సమర్ధంగా తిప్పికొడతామని మన సైనికులు నిరూపించారన్నారు. పాకిస్తాన్ వైఖరిని ఎండగట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కేంద్రాన్ని కోరారు. సైనికులకు మద్ధతుగా ర్యాలీలో ప్రజలు, యువకులు పాల్గొని విజవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
యుద్ధం వస్తే తక్షణమే విధుల్లోకి: ఉత్తమ్
హైదరాబాద్: నియంత్రణ రేఖను దాటి వెళ్లి పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలో భారత సైన్యం చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్ సరిహద్దు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రతి ఒక్కరి గుండెను హత్తుకునే ప్రకటన చేసి ఆకట్టుకున్నారు. 20 ఏళ్లు భారత వాయుసేనలో మిగ్ ఎయిర్ క్రాఫ్ట్ పైలట్‌గా సేవలందించిన ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఇప్పటికీ కదనోత్సాహంతో ఉన్నారు. తన అంచనా ప్రకారం భారత్‌కు ప్రస్తుతం కష్టకాలమని, యుద్ధం దేనికి పరిష్కారం కాదని అన్నారు. అస్థిర పాకిస్తాన్‌తో యుద్ధం వచ్చే పరిస్థితులు ప్రస్తుతం నెలకొని ఉన్నాయని.. ఆ దేశంలో ఎప్పుడు ఎలా స్పందిస్తుందో చెప్పడం కష్టమని అన్నారు. ఒకవేళ యుద్ధం వస్తే ఏ క్షణమైనా విధుల్లో చేరేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు ఉత్తమ్ ప్రకటించారు. దేశానికి సేవ చేయడం కంటే భాగ్యం మరోటి ఉండదని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన అన్ని మర్చిపోయాననుకోవడం పొరపాటని.. సమయం వస్తే కదన రంగంలో దూకడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. -
వారికి యుద్ధమంటే అప్పుడే తెలుస్తోంది
అమృత్ సర్: అక్కడ గన్ పేలలేదు.. ఎలాంటి అప్రమత్తత సంకేతాలు అందలేదు. ఫైటర్ జెట్ బాంబులు అంతకంటే లేవు. వాస్తవానికి ఇప్పుడు యుద్ధం జరుగుతున్న సమయం కూడా కాదు. కానీ వేల పంజాబ్ లోని వేల కుటుంబాలు మాత్రం అప్పుడే యుద్ధం అంటే ఎలా ఉంటుందో.. యుద్ధం వస్తే ఎలాంటి పరిస్దితులు ఎదుర్కోవాల్సి వస్తుందో చవిచూస్తున్నారు. పాక్ సరిహద్దకు ఆనుకొని ఉన్న పంజాబ్ గ్రామాలన్నింటిని ఆర్మీ ఖాళీ చేయిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు సరిహద్దుకు పది కిలోమీటర్ల దూరంలోని గ్రామాలన్నింటిని ఏ ఒక్కరూ లేకుండా వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఓ అంచనా ప్రకారం అమృత్ సర్, తార్న్ తరన్, ఫిరోజ్ పూర్, గురుదాస్ పూర్, పఠాన్ కోట్, ఫజిల్కా జిల్లాలకు చెందిన దాదాపు 4 లక్షలమందిని ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు వెయ్యి గ్రామాల్లోని ప్రజలను వెంటనే ఖాళీ చేయించాలని అధికారులకు ఆదేశాలు అందడంతో ఆ పని పూర్తి చేయిస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి పాకిస్థాన్ భూభాగంలోకి భారత ఆర్మీ చొచ్చుకెళ్లి దాడులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ దాడుల అనంతరం సరిహద్దులో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో సరిహద్దు గ్రామాల ప్రజలు అనూహ్యంగా తమ నివాసాలను వదిలిపెట్టి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. 'మేం మా వస్తువులన్నింటిని మూటగట్టి ట్రాక్టర్లో వేశాం. కాని ఎక్కడికి వెళ్లాలో అర్థం కావడం లేదు. కానీ తప్పకుండా వెళ్లాల్సి ఉంది. మరో పది రోజుల్లో మా పంటపొలాలు తూర్చాల్సి ఉంది. త్వరలోనే పరిస్ధితి సర్దుమణుగుతుందని మేం ఆశిస్తున్నాం' అని తమ నివాసాలను విడిచి వెళుతున్న కొంతమంది రైతులు, వ్యక్తులు చెప్పారు. ఇప్పటికే అక్కడి పాఠశాలలు, ఆస్పత్రులు కూడా ఖాళీ చేయించిన విషయం తెలిసిందే. తాజా దాడుల వల్ల సరిహద్దు వెంట నుంచి మొత్తం 15లక్షలమందిని ఆయా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. -
దాడికి ఇస్రో కూడా సాయం చేసిందా!
బెంగళూరు: భారత సైన్యం పాకిస్థాన్ భూభాగంలోకి దూసుకెళ్లి అనూహ్యంగా నిర్వహించిన దాడులకు భారత్ సాంకేతిక పరిజ్ఞానం కూడా విరివిగా ఉపయోగించింది. ఈ దాడులకు ఇస్రో కూడా తన వంతు సహాయం చేసినట్లు తెలుస్తోంది. ఆర్మీ దాడి చేసిన ఉగ్రవాద శిబిరాలు, దాని చుట్టుపక్కల పరిస్థితులను దాడికి ముందే ఎప్పటికప్పుడు ఫొటోలు, వీడియోల రూపంలో చిత్రించి భారత ఆర్మీకి కార్టోశాట్ 2సీ ఉపగ్రహం పంపించినట్లు సమాచారం. ఈ ఏడాది జూన్ నెలలో భారత్ కార్టోశాట్ 2సీ ఉపగ్రహాన్ని అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దీనిని ఆకాశంలో కన్ను' అని కూడా అంటారు. సున్నితమైన, దుర్బేద్యమైన ప్రాంతాలాల్లోని చిత్రాలను, వీడియోలను కూడా కార్టొశాట్ చిత్రించగలదు. ఇస్రోలోని కొన్ని వర్గాలు 'మేం చాలా రోజులుగా భారత ఆర్మీకి అవసరమైన చిత్రాలను, వీడియోలను పంపిస్తున్నాం. అయితే, ఏ సమయంలో, ఎప్పుడూ, ఎలాంటి చిత్రాలు అనే విషయాలు మాత్రం చెప్పలేము. కార్టోశాట్ తీసే చిత్రాలంటేనే ఆర్మీకి చాలా బాగా ఉపయోగపడతాయని చెప్పగలం' అంటూ తెలిపాయి. -
'ఆందోళనగా ఉంది.. శాంతి పాటించండి'
న్యూయార్క్: పాకిస్థాన్ భూభాగంలోకి చొరబడి భారత్ సర్జికల్ దాడులు నిర్వహించడంపట్ల ఐక్యరాజ్య సమితి స్పందించింది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను తెలుసుకుంటూనే ఉన్నామని, ఈ విషయంలో తీవ్ర ఆందోళనగా ఉందని ఐరాస సెక్రటరీ జనరల్ డ్యుజారిక్ అన్నారు. ఐక్యరాజ్య సమితికి చెందిన మిలిటరీ వ్యవహారాల వర్గం భారత్ వర్సెస్ పాక్ మధ్య జరుగుతున్న కాల్పులు విరమణ ఒప్పంద ఉల్లంఘనలు పరిశీలిస్తూనే ఉందని, మరింత సమాచారం తెలుసుకోవాల్సింది ఉందని చెప్పారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని, సమస్య ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, వెంటనే ఇరు దేశాలు పరిస్థితిని యథాస్థితికి తీసుకొచ్చే కార్యక్రమాలు చేపట్టాలని అభిప్రాయపడ్డారు. పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి సర్జికల్ దాడులు నిర్వహించిన భారత్ 40మంది ఉగ్రవాదులను హతం చేసిన విషయం తెలిసిందే.