తాగిన మత్తులో వాహనం నడుపుతూ అమాయకులను బలిగొంటున్నవారి సంఖ్య నగరంలో పెరిగిపోతుండడంతో ట్రాఫిక్ విభాగం అప్రమత్తమైంది. వారం రోజుల వ్యవధిలో మూడు
న్యూఢిల్లీ: తాగిన మత్తులో వాహనం నడుపుతూ అమాయకులను బలిగొంటున్నవారి సంఖ్య నగరంలో పెరిగిపోతుండడంతో ట్రాఫిక్ విభాగం అప్రమత్తమైంది. వారం రోజుల వ్యవధిలో మూడు ఘటనలు జరగడంతో ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తున్నారంటూ నిలదీసేవారి సంఖ్య పెరిగింది. దీంతో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ పదే పదే పట్టుబడుతున్నవారి లెసైన్సులను శాశ్వతంగా రద్దు చేయాలని ట్రాఫిక్ విభాగం నిర్ణయించింది. ఇలాంటివారు నగరంలో 16,000 మంది ఉన్నారని, వారందరి లెసైన్సులను రద్దు చేయాలని రవాణా విభాగాన్ని ఆదేశించింది.
ఈ విషయమై సంబంధిత అధికారి ఒకరు మాట్లాడుతూ... ‘ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఒకసారి కంటే ఎక్కువసార్లు పట్టుబడిన వారి జాబితాను సిద్ధం చేశాం. ఇలాంటి వారివల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటీవల టాటా సఫారీ కారు ఢీకొన్న ఘటనలో ఓ రిక్షావాలా మరణించగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి కారణమైన వ్యక్తి తాగిన మత్తులో వాహనం నడపడం వల్లే ఈ దుర్ఘటన జరిగింది. అతను గతంలో కూడా తాగిన మత్తులో వాహనం నడిపి రెండు, మూడుసార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. జరిమానాలు చెల్లించి బయటపడిన సదరు వ్యక్తి తాజా ఘటనలో ఒకరి ప్రాణం బలితీసుకున్నాడు. ఇటువంటి వారి లెసైన్సులు రద్దు చేయడంవల్ల మరోసారి ప్రమాదం చేయకుండా ఉంటారు.
పదే పదే నిబంధనలు ఉల్లంఘిస్తున్నవారు ఇప్పటిదాకా 16,000 మంది ఉన్నారు. వీరిలో 302 మంది డ్రైవర్లే కావడం గమనార్హం. వీరంతా డ్రంకెన్ డ్రైవర్లే. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 15 వరకు 20,400 మందిపై కేసులు నమోదు చేసి, విచారించగా వారిలో 302 మంది పదే పదే ఈ నేరానికి పాల్పడుతున్నట్లు స్పష్టమైంది. దీంతో ఇటువంటి వారిపై మోటారు వాహనాల చట్టం, 1988 ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. లెసైన్సులను రద్దు చేసే అధికారం కూడా చట్టం కల్పిస్తున్నందున ఆ దిశగా ఆలోచించాలని రవాణా విభాగానికి లేఖ రాశామ’న్నారు.
భారీగా చలాన్లు...
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నవారిని చలాన్ల రూపంలో శిక్షిస్తున్నా మార్పు రావడంలేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది ఇప్పటిదాకా 20,400 చలాన్లు జారీ చేశామన్నారు. ఐదేళ్ల క్రితం ఇదే సమయానికి 12,784 చలాన్లు జారీ చేశామని చెప్పారు. చలాన్ల సంఖ్య పెరగడంతోపాటు తప్పిదాలకు పాల్పడుతున్నవారి సంఖ్య కూడా పెరుగుతోందన్నారు. ఏటా 50 లక్షల మందిని ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కింద పోలీసులు విచారిస్తున్నారని చెప్పారు. నగరంలో 85 లక్షల వాహనాలుండగా 50 లక్షల మంది నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటే ట్రాఫిక్ క్రమశిక్షణ నగరవాసుల్లో ఏ మేరకు ఉందో అర్థమవుతుందన్నారు.