రాష్ట్రంలో 7.45 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు గాను 1,81,266 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో 7.45 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు గాను 1,81,266 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. శాసన సభలో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో కన్నడ మక్కళు పార్టీకి చెందిన అశోక్ ఖేణి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, తొలి దశలో సకాల కింద సేవలు అందిస్తున్న 12 శాఖల్లో 3,700 పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని తెలిపారు. ఇంకా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పారు. అభివృద్ధికి కంపెనీల నిధులు
ప్రైవేట్ కంపెనీలు సామాజిక బాధ్యతలను విధిగా చేపట్టాలన్న నియమ నిబంధనలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తాయని ముఖ్యమంత్రి తెలిపారు. రూ.వెయ్యి కోట్ల టర్నోవర్, ఏడాదికి రూ.5 కోట్ల కంటే ఎక్కువగా లాభాన్ని ఆర్జిస్తున్న కంపెనీలు, అందులో రెండు శాతాన్ని సామాజిక కార్యక్రమాలకు కేటాయించాల్సి ఉంటుందని చెప్పారు. ఈ నిధులను కార్పొరేట్ సంస్థలున్న ప్రాంతాల్లో అభివృద్ధి కార్యకలాపాలను చేపట్టడానికి వినియోగిస్తామని వెల్లడించారు. ఇప్పటి వరకు పలు సంస్థలు స్వచ్ఛందంగా సామాజిక కార్యకలాపాలు చేపడుతున్నాయని తెలిపారు. అయితే వాటి లెక్కలను అడిగే అధికారం లేకుండా ఉండేదని, ఇకమీదట ప్రభుత్వం నిఘా వేస్తుందని తెలిపారు.