పోరాడి ఓడిన యూకీ

Yuki Bhambri's impressive run at Indian Wells ends - Sakshi

కాలిఫోర్నియా: ఇండియన్‌ వెల్స్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నమెంట్‌లో భారత యువ టెన్నిస్‌ స్టార్‌ యూకీ బాంబ్రీ సంచలన ప్రదర్శన ముగిసింది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ మూడో రౌండ్‌లో 25 ఏళ్ల ఈ ఢిల్లీ ఆటగాడికి ప్రపంచ 21వ ర్యాంకర్‌ సామ్‌ క్వెరీ (అమెరికా) చేతిలో చుక్కెదురైంది. ప్రపంచ 110వ ర్యాంకర్‌ అయిన యూకీ బాంబ్రీ 7–6 (7/4), 4–6, 4–6తో క్వెరీ చేతిలో తుదికంటా పోరాడి ఓడాడు. మూడో రౌండ్‌లో నిష్క్రమించిన యూకీకి 47,170 డాలర్ల (రూ. 30 లక్షల 66 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 45 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.

క్వెరీతో రెండు గంటల 20 నిమిషాల పాటు జరిగిన పోరులో భారత ఆటగాడు తొలి సెట్‌ను అలుపెరగని పోరాటంతో గెలిచాడు. కానీ తర్వాత రెండు సెట్లలో ప్రత్యర్థి పైచేయి సాధించడంతో ఓటమి తప్పలేదు. ఈ టోర్నీలో తొలి రౌండ్లో యూకీ తనకన్నా మెరుగైన ర్యాంకర్‌ మహుత్‌ (ఫ్రాన్స్‌)పై, రెండో రౌండ్లో ప్రపంచ 12వ ర్యాంకర్‌ లుకాస్‌ పుయి (ఫ్రాన్స్‌)పై సంచలన విజయాలు సాధించాడు. మేటి ప్రత్యర్థులను ఓడించిన తనకు సామ్‌ క్వెరీ చేతిలో క్లిష్టమైన పోటీ ఎదురైందని యూకీ చెప్పాడు. ఈ టోర్నీ ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో తనలో ఎవరినైనా ఓడించగలనన్న ధీమా వచ్చిందన్నాడు.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top