పారిస్: భారత పురుషుల టెన్నిస్ డబుల్స్ నంబర్‌వన్ యూకీ బాంబ్రీ... పారిస్ ఓపెన్ ఏటీపీ మాస్టర్స్–1000 సిరీస్ టోర్నీలో శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో యూకీ బాంబ్రీ (భారత్)–ఆడమ్ పావ్లాసెక్ (చెక్ రిపబ్లిక్) ద్వయం 7–6 (7/5), 7–6 (7/3)తో ఆండ్రీ గొరాన్సన్ (స్వీడన్)–జాన్ జిలిన్‌స్కీ (పోలాండ్) జంటపై గెలుపొందింది. 1 గంట 44 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ–పావ్లాసెక్ రెండు ఏస్‌లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేశారు.
తొలి సర్వీస్‌లో 49 పాయింట్లకుగాను 34 పాయింట్లు... రెండో సర్వీస్‌లో 25 పాయింట్లకుగాను 13 పాయింట్లు సాధించారు. తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశారు. మరోవైపు భారత్‌కే చెందిన సీనియర్ స్టార్ రోహన్ బోపన్నకు నిరాశ ఎదురైంది. తొలి రౌండ్‌లో బోపన్న (భారత్)–అలెగ్జాండర్ బుబ్లిక్ (కజకిస్తాన్) ద్వయం 5–7, 2–6, 8–10తో ‘సూపర్ టైబ్రేక్’లో జాన్ పీర్స్ (ఆ్రస్టేలియా)–జేజే ట్రేసీ (అమెరికా) జంట చేతిలో పోరాడి ఓడిపోయింది.
70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న–బుబ్లిక్ నాలుగు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేశారు. తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశారు. అయితే సూపర్ టైబ్రేక్ కీలకదశలో బోపన్న ద్వయం పాయింట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. తొలి రౌండ్‌లో ఓడిన బోపన్న–బుబ్లిక్‌లకు 14,350 యూరోలు (రూ. 14 లక్షల 76 వేలు) ప్రైజ్‌మనీగా లభించింది.


