‘ఫిట్‌నెస్‌ అవసరం.. యోయో కాదు’

Yo Yo test should not be sole criteria for team selection Kaif - Sakshi

భువనేశ్వర్‌: గత కొన్నేళ్లుగా భారత క్రికెట్‌ జట్టులో ఆటగాళ్లు ఎంపిక కావాలంటే యో యో టెస్టు అనేది ప‍్రామాణికంగా మారింది. క్రికెటర్లు పరుగులు చేస్తున్నా, వికెట్లు సాధిస్తున్నా యోయో టెస్టులో పాస్‌ కాకపోతే వారిని పక్కక పెట్టేయడం చూస్తునే ఉన్నాం. అయితే దీనిపై ఇప్పటికే పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయగా, తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌ సైతం యోయో టెస్టు గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

‘జట్టును ఎంపిక చేసేటప్పుడు సమతూకం అనేది ముఖ్యం. అదే సమయంలో ఆటగాళ్లకు ఫిట్‌నెస్‌ కూడా అవసరమే. కానీ యోయో అనేది ప్రామాణికంగా కాదు. ఒక ఆటగాడు ఎంపికను యోయో ఆధారంగా తీసుకోవడం సరైన నిర్ణయంకాదు. ఒక క్రికెటర్‌ పరుగులు సాధిస్తూ, వికెట్లు తీస్తున్న సమయంలో యోయో టెస్టులో పాస్‌ కాలేదనే కారణంగా జట్టులో ఎంపిక చేయకపోవడం దారుణం. ఈ తరహాలో మంచి ఆటగాడ్ని జట్టులో ఎంపిక చేయకపోతే సమతూకమనేది ఉండదు. నేను భారత్‌కు ఆడేటప్పుడు ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను తెలుసుకునేందుకు టెస్టు(బీప్‌ టెస్టు) ఉండేది. దీనివల్ల జట్టు నుంచి తప్పించడమనేది ఉండేది కాదు. ఒకవేళ ఫిట్‌నెస్‌ లెవల్‌ బాగోలేని పక్షంలో దాన్ని మెరుగుపరుచుకునేందుకు కొన్ని నెలల సమయం ఇచ్చేవారు. ప్రస్తుత భారత్‌ జట్టులో వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌నే చూడండి. అతను ఒక కీపర్‌. కానీ 50 ఓవర్ల క్రికెట్‌లో కీపర్‌ కాకుండా ఫీల్డర్‌గా బాధ్యతలు పంచుకున్నాడు. అది అతనికి సౌకర్యవంతం కాకపోవచ్చు. ఇక విరాట్‌ కోహ్లి  అద్భుతమైన ఫిట్‌నెస్‌ ప్రమాణాలు ఉన్న ఆటగాడు.  జట్టులోని ఆటగాళ్లు కూడా కోహ్లిని అనుసరిస్తూ ఫిట్‌నెస్‌ లెవల్స్‌ను పెంచుకుంటున్నారు. ఫిట్‌నెస్‌ అనేది అవసరం. కానీ యోయో టెస్టు పేరుతో ఆటగాడి కనీస ఉత్తీర్ణత మార్కులు 16.1గా ఉండటం కరెక్ట్‌ కాదు’ అని కైఫ్‌ పేర్కొన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top