గేల్‌ x కోహ్లి | Sakshi
Sakshi News home page

గేల్‌ x కోహ్లి

Published Wed, Mar 30 2016 11:47 PM

గేల్‌  x కోహ్లి

గేల్‌కోహ్లి నేడు రెండో సెమీ ఫైనల్
వెస్టిండీస్‌తో భారత్ పోరు
గాయంతో యువరాజ్ అవుట్

 
టి20 ప్రపంచకప్‌లో భారత జట్టు ప్రస్థానాన్ని ఒక్క ముక్కలో తేల్చేయాలంటే కోహ్లి పేరు తప్ప మరొకటి వినిపించదు. టాప్-5లో మిగతా నలుగురు కలిపి 181 పరుగులు చేస్తే, కోహ్లి ఒక్కడే 184 పరుగులు సాధించాడు. కీలకమైన సెమీస్ మ్యాచ్‌లో ఇప్పుడు కూడా అతడినే దేశం నమ్ముతోంది. అతనిపైనే ఆశలు పెట్టుకుంది. అతను విఫలమైతే ఎలా అనే ఆలోచన కూడా రానంతగా ఫామ్‌లో ఉన్న కోహ్లి మరోసారి  తన మ్యాజిక్ చూపించాల్సిన సమయమిది.

వెస్టిండీస్ పరిస్థితి కూడా అలాగే ఉంది. వీర విధ్వంసం సృష్టించే క్రిస్‌గేల్ జట్టు భారాన్ని ఒంటిచేత్తో మోస్తున్నాడు. చాలా మంది హిట్టర్లు ఉన్నారని పేరుకు చెప్పుకున్నా... గేల్ అవుటైతే ఆ జట్టు కుప్పకూలిపోవచ్చు. మెరుపు సెంచరీతో అతను గెలిపించిన మ్యాచ్‌ను మినహాయిస్తే మిగతా రెండు మ్యాచ్‌లలో విజయం కోసం తీవ్రంగా శ్రమించిన జట్టు, అఫ్ఘానిస్తాన్ చేతిలో ఓడింది కూడా. బ్యాటింగ్‌తోనే కాదు మానసికంగా కూడా విండీస్‌పై అతని ప్రభావం ఎంతో ఉంది.

ప్రపంచకప్ సెమీస్ పేరుకు ఇప్పుడు రెండు జట్ల మధ్య జరుగుతున్నా... కోహ్లి, గేల్‌ల మధ్య పోటీగానే భావించవచ్చు. ఈ ఇద్దరు ఆటగాళ్లలో ఎవరు తమ స్థాయికి తగినట్లుగా ఆడితే ఆ జట్టుకు గెలుపు ఖాయం. మరి రేసులో మిగిలేదెవరో..!

 
ముంబై నుంచి సాక్షి క్రీడాప్రతినిధి:-  వాంఖడే వేదికగా భారత జట్టు మరో మహా మ్యాచ్‌కు సిద్ధమైంది. నేడు (గురువారం) ఇక్కడ జరిగే టి20 ప్రపంచకప్ రెండో సెమీ ఫైనల్లో భారత్, వెస్టిండీస్‌తో తలపడుతుంది. తొలి మ్యాచ్‌లో అనూహ్య పరాజయం తర్వాత కోలుకొని భారత్ సెమీస్‌కు చేరగా...మూడు విజయాలతో సెమీస్ స్థానం సంపాదించాక అఫ్ఘానిస్తాన్ చేతిలో అనూహ్య ఓటమితో వెస్టిండీస్ ఈ మ్యాచ్‌కు వచ్చింది. కాలి మడమ గాయంతో ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఈ మ్యాచ్‌కు దూరం కావడం భారత్‌ను ఇబ్బంది పెట్టే పరిణామం. బలాబలాలు, అనుకూలతలు చూస్తే భారత్ ఒకింత ఆధిక్యంలో కనిపిస్తున్నా... టి20ల్లో మాజీ చాంపియన్ విండీస్‌ను తక్కువగా అంచనా వేయలేం.

భారం పంచుకుంటారా..?
టాప్-5లో నలుగురు ఆటగాళ్లు విఫలమైన తర్వాత కూడా భారత జట్టు సెమీఫైనల్‌కు చేరడం నిజంగా అద్భుతమే. ఈ నాలుగు మ్యాచ్‌లలో కోహ్లి ఒక్కడే 92 సగటు, 132.37 స్ట్రైక్‌రేట్‌తో చెలరేగగా... రోహిత్, ధావన్, రైనా, యువరాజ్ కలిపి కేవలం 11.31 సగటు, 103.87 స్ట్రైక్‌రేట్‌తో మాత్రమే పరుగులు చేయగలిగారు. ఇక మిగతావారు కూడా తమ సత్తా చాటాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ టోర్నీలో అన్ని వేదికలతో పోలిస్తే పరుగుల వరద పారింది ఇక్కడే. ఇలాంటి బ్యాటింగ్‌కు అనుకూలమైన వికెట్ అంటే మనోళ్లు సాధారణంగా రెచ్చిపోతుంటారు. అదే జరిగితే జట్టు గెలుపుపై ఆశలు పెంచుకోవచ్చు.

చాలా రోజులుగా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడని రోహిత్ శర్మ తన విలువ చూపించేందుకు సొంతగడ్డపై అతనికి మంచి అవకాశం లభించింది. ధావన్, రైనా కూడా ధాటిగా ఆడితే భారత్‌కు విజయావకాశాలు ఉంటాయి. మూడు మ్యాచ్‌లలో నాటౌట్‌గా నిలిచిన ధోనికి మరిన్ని బంతులు ఆడే అవకాశం దక్కితే అతను మ్యాచ్ దిశను మార్చగలడు. యువరాజ్ స్థానంలో తుది జట్టులో ఎవరికి చోటు దక్కుతుందనేది ఆసక్తికరం. బ్యాట్స్‌మెన్ రహానే, పాండే అందుబాటులో ఉన్నారు.  అయితే డెరైక్టర్ రవిశాస్త్రి గత మ్యాచ్‌లో యువరాజ్ వేసిన మూడు ఓవర్ల గురించి నొక్కి చెప్పడం చూస్తే నేగికి అవకాశం ఇస్తారా అనేది చూడాలి.  

 ఆల్‌రౌండర్లపై నమ్మకం
ఎవరు అవునన్నా, కాదన్నా గేల్ జోరుపైనే వెస్టిండీస్ ఆధారపడి ఉందంటే అతిశయోక్తి కాదు. అతను సృష్టించే విధ్వంసం గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. పైగా అతని సెంచరీ కూడా ఇదే మైదానంలో వచ్చింది. మరో ఓపెనర్‌గా ఆడే అవకాశం ఉన్న సిమన్స్ టోర్నీలో ఇదే తొలి మ్యాచ్ అయినా ముంబై ఇండియన్స్ ఆటగాడిగా అనుభవం ఉపయోగపడవచ్చు. చార్లెస్, శామ్యూల్స్ దూకుడుగా ఆడగల సమర్థులు. 9వ నంబర్ ఆటగాడి వరకు అందరూ బ్యాటింగ్ చేయగలరు.   బ్రేవో, రసెల్, స్యామీల ఫామ్ అంత బాగోలేదు. బౌలింగ్‌లో ఆల్‌రౌండర్లు మినహా చెప్పుకోదగ్గ పేసర్ లేడు. దాంతో ఇద్దరు స్పిన్నర్లు బద్రీ, బెన్ కీలకం కానున్నారు.

 జట్లు (అంచనా)
భారత్:     ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, కోహ్లి, రైనా, రహానే/పాండే, హార్దిక్ పాండ్యా, జడేజా, అశ్విన్, నెహ్రా, బుమ్రా.
వెస్టిండీస్:  స్యామీ (కెప్టెన్), గేల్, సిమన్స్, చార్లెస్, శామ్యూల్స్, బ్రేవో, రసెల్, బ్రాత్‌వైట్, రామ్‌దిన్, బద్రీ, బెన్.

 పిచ్, వాతావరణం
టోర్నీలో గత మూడు మ్యాచ్‌లలో ఉపయోగించని కొత్త పిచ్‌ను తొలిసారి భారత మ్యాచ్‌కు వాడుతున్నారు. బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉంది. అయితే స్పిన్ అనుకూలత కోసం కాస్త ఎక్కువగా రోలింగ్ చేసినట్లు కనిపిస్తోంది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించకపోవచ్చు.

2 భారత్, వెస్టిండీస్‌ల మధ్య ఇప్పటివరకూ జరిగిన 4 టి20 మ్యాచ్‌ల్లో చెరో రెండు గెలిచాయి. ప్రపంచకప్‌లలో మూడు ఆడగా... భారత్ ఒకటి గెలిచి, రెండు ఓడింది.
   

 అశ్విన్ అతడిని ఆపాలి...
క్రిస్ గేల్ క్రీజ్‌లో ఉంటే ఎంత ప్రమాదకరంగా మారతాడో ధోనికి తెలియనిది కాదు. అందుకే  అది ఐపీఎల్ అయినా, అంతర్జాతీయ మ్యాచ్ అయినా అతడిని కట్టడి చేసేందుకు అశ్విన్ అనే ఆయుధాన్ని ధోని అనేక సార్లు ప్రయోగించాడు. అశ్విన్ కూడా కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టాడు. టి20ల్లో వీరిద్దరు ఎదురెదురుగా 9 ఇన్నింగ్స్‌లలో తలపడితే అందులో నాలుగు సార్లు అశ్విన్ అవుట్ చేశాడు.  అశ్విన్‌ను సమర్థంగా ఎదుర్కోలేక  గేల్ పడే ఇబ్బందిని ఇప్పుడు భారత్ మళ్లీ  సొమ్ము చేసుకోవాల్సి ఉంది. ప్రపంచంలో ప్రతీ బౌలర్‌ను చితకబాది ఏడిపించే గేల్ అశ్విన్ బౌలింగ్‌లో 70 బంతులు ఆడితే 57 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 

ఇందులో 51 బంతులు పవర్‌ప్లేలో వేశాడు. అయినా సరే ఈ ఎత్తును చిత్తు చేయడం గేల్ వల్ల కాలేక కేవలం 3 ఫోర్లు, 3 సిక్సర్లతోనే సరిపెట్టాడు. ఇప్పుడు మరోసారి తొలి ఓవర్ అశ్విన్‌తో ప్రారంభించినా ఆశ్చర్యం లేదు. అతను అవుటైనా చాలా మంది బ్యాట్స్‌మెన్ ఉన్నారని వెస్టిండీస్ చెప్పుకోవచ్చు. కానీ గేల్ బ్యాటింగ్ చూపే ప్రభావమే వేరు. ఒక్కసారి అతను వెనుదిరిగితే విండీస్ కుప్పకూలడమో  లేదంటే పడుతూ లేస్తూ తక్కువ స్కోరుకే పరిమితం అయ్యేందుకు అవకాశం ఉంటుంది.
 
 
 కోహ్లి రివర్స్ స్వీప్

 టి20 క్రికెట్‌లో కూడా సంప్రదాయ షాట్లతోనే అద్భుతాలు చేసే విరాట్ కోహ్లి బుధవారం కాస్త కొత్తగా కనిపించాడు. సుదీర్ఘ సమయం పాటు సాగిన ప్రాక్టీస్ సెషన్‌లో అతను భారత బౌలర్లందరినీ ఎదుర్కొన్నాడు. అయితే ఎప్పుడూ లేని విధంగా రివర్స్ స్వీప్, స్విచ్ హిట్‌లను ఆడటం విశేషం. ముఖ్యంగా అశ్విన్ బౌలింగ్‌లో అతను కొట్టిన రివర్స్ స్వీప్‌లు ఎలాంటి తడబాటు లేకుండా పర్‌ఫెక్ట్ షాట్‌లుగా మారాయి. సరదాగా ఒకటి, రెండు బంతులు కాకుండా సీరియస్‌గానే సాధన చేసిన కోహ్లి మనసులో కొత్త ఆలోచనలేమైనా ఉన్నాయేమో. మరో వైపు రహానే, పాండేలు ఇద్దరిపై ప్రత్యేక దృష్టి పెడుతూ రవిశాస్త్రి మరో నెట్స్‌లో వీరిద్దరితో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయించారు.

రా. గం. 7 నుంచి స్టార్ స్పోర్ట్స్ 1లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement
 
Advertisement