
పాక్ క్రికెట్ జట్టుకు లైన్ క్లియర్
వరల్డ్ టీ 20లో భాగంగా దాదాపు పదిరోజుల నుంచి పాకిస్తాన్ క్రికెట్ జట్టు భారత్లో పర్యటించే అంశంపై ఏర్పడిన సందిగ్ధతకు తెరపడింది.
ఇస్లామాబాద్:వరల్డ్ టీ 20లో భాగంగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు భారత్లో పర్యటించే అంశంపై దాదాపు పదిరోజులకు పైగా ఏర్పడిన సందిగ్ధతకు తెరపడింది. పాకిస్తాన్ క్రికెట్ జట్టును భారత్కు పంపేందుకు ఆ దేశ ప్రభుత్వం అనుమతినిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తమ క్రికెట్ జట్టును భారత్ కు పంపుతున్నట్లు పాక్ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. పాక్ క్రికెట్ జట్టుకు పూర్తి భద్రత కల్పిస్తామని భారత ప్రభుత్వం తరపున హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ హామీ ఇవ్వడంతో ఈ సమస్యకు పరిష్కారం దొరికింది. ఈ క్రమంలో పాకిస్తాన్ పురుషుల, మహిళ క్రికెట్ జట్లు శుక్రవారం రాత్రి భారత్కు పయనం కానున్నాయి.
పాక్ క్రికెట జట్ల భద్రత గురించి భారత్ రాత పూర్వక హామీ ఇవ్వాలని పాకిస్తాన్ ప్రభుత్వం డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. తమ ఆటగాళ్లు ఆడుతున్నప్పుడు ఎలాంటి ఇబ్బందీ ఎదుర్కోకూడదనే ఉద్దేశంతోనే భారత ప్రభుత్వం నుంచి రాత పూర్వక హామీని పాకిస్తాన్ కోరింది. దీనిపై ఎట్టకేలకు స్పందించిన భారత ప్రభుత్వం పాక్ క్రికెట్ జట్టు భద్రతకు ఎటువంటి ముప్పు ఉండదని స్పష్టం చేయడంతో అందుకు పాక్ ప్రభుత్వం అంగీకరించింది. ఇదిలాఉండగా, ఈ నెల 19వ తేదీన కోల్ కతాలో భారత్ తో తలపడే పాకిస్తాన్ మ్యాచ్ భద్రతపై ఇప్పటికే పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించింది.