
రోహిత్ కనుక ఇదే ఫామ్ కొనసాగిస్తే 800 పైగా పరుగులు..
లండన్ : టీమిండియా దిగ్గజం, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ప్రపంచకప్ టోర్నీలో నెలకొల్పిన అరుదైన రికార్డు బద్దలయ్యే అవకాశం కనిపిస్తోంది. మాస్టర్ బ్లాస్టర్ 2003లో నెలకొల్పిన వ్యక్తిగత అత్యధిక పరుగులు (673) రికార్డు ఇంకా పదిలంగా ఉంది. ఆ తర్వాత మూడు ప్రపంచకప్‌లు జరిగినా ఆ ఘనతను అందుకున్న ఆటగాడే లేడు. అయితే తాజా ప్రపంచకప్‌లో ఆనాటి రికార్డు బ్రేక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం 440 పరుగులతో ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డెవిడ్ వార్నర్ అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలో ఉండగా.. బంగ్లాదేశ్ ఆటగాడు షకీబ్ అల్ హసన్ 425 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత ఆరోన్ ఫించ్ (396), జోరూట్ (367), రోహిత్ శర్మ (319)లు ఉన్నారు. వీరంతా ఇదే ఫామ్‌లో చెలరేగితో సచిన్ రికార్డు అధిగమించవచ్చు. ముఖ్యంగా ప్రస్తుత రన్‌రేట్‌ను పరిగణిస్తే ఇది సాధ్యమే అనిపిస్తోంది.
6 మ్యాచ్‌లు ఆడిన డేవిడ్ వార్నర్ 75 పరుగుల సగటుతో 447 పరుగులు చేశాడు. ఇంకా వార్నర్ మూడు లీగ్ మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. డేటా ఇంటలిజెన్స్ అంచనా ప్రకారం వార్నర్ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే.. ఇదే సగటుతో మరో 224 పరుగులు చేసి సచిన్ రికార్డుకు 3 పరుగుల దూరంలో నిలవనున్నాడు. ప్రస్తుతం పాయింట్స్ ప్రకారం ఆసీస్ జట్టుకు సెమీస్ వెళ్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి కావునా.. వార్నర్‌కు సచిన్ రికార్డు బ్రేక్ చేసే అవకాశం ఉంది. షకీబ్ అల్ హసన్ 85 పరుగుల రేటింగ్‌తో 425 పరుగులు చేశాడు. అతను కూడా 3 మ్యాచ్‌లాడాల్సి ఉంది. ఇదే సగటును కొనసాగిస్తే అతను 680 పరుగులు చేయవచ్చు. ఆరోన్ ఫించ్, జోరూట్‌లు కూడా సచిన్ రికార్డు అధిగమించే రేసులో ఉన్నారు. ఇక భారత ఆటగాడు రోహిత్ శర్మ 106 పరుగుల సగటుతో 319 పరుగుల చేశాడు. రోహిత్ కనుక ఇదే ఫామ్ కొనసాగిస్తే 800 పైగా పరుగులు చేయనున్నాడు. ఇదే జరిగితే సచిన్ రికార్డు బ్రేక్ అవ్వడం ఏమో కానీ.. రోహిత్‌ను భవిష్యత్తులో మరెవరూ అందుకోలేరు. పైగా రోహిత్‌కు ఇంకా ఐదు మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది.