'మన్కడింగ్'తో క్వార్టర్స్ బెర్త్! | West Indies bowler 'Mankads' Zimbabwe batsman | Sakshi
Sakshi News home page

'మన్కడింగ్'తో క్వార్టర్స్ బెర్త్!

Feb 3 2016 12:43 AM | Updated on Sep 3 2017 4:49 PM

'మన్కడింగ్'తో క్వార్టర్స్ బెర్త్!

'మన్కడింగ్'తో క్వార్టర్స్ బెర్త్!

అత్యంత నాటకీయ పరిస్థితుల్లో వెస్టిండీస్ జట్టు అండర్-19 ప్రపంచకప్ టోర్నీలో క్వార్టర్స్ ఫైనల్స్‌కు చేరింది.

అండర్-19 ప్రపంచకప్‌లో క్వార్టర్స్‌కు చేరిక
చిట్టగాంగ్: అత్యంత నాటకీయ పరిస్థితుల్లో వెస్టిండీస్ జట్టు అండర్-19 ప్రపంచకప్ టోర్నీలో క్వార్టర్స్ ఫైనల్స్‌కు చేరింది. మంగళవారం జింబాబ్వేతో జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో ఎవరు నెగ్గితే వారు క్వార్టర్స్‌కు చేరతారు. అయితే 227 పరుగుల లక్ష్య ఛేదనలో జింబాబ్వే చివరి ఓవర్‌లో విజయానికి మూడు పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో ఒక్క వికెట్ మాత్రమే ఉంది. అయితే చివరి ఓవర్ తొలి బంతికే విండీస్ బౌలర్ కీమో పాల్ నాన్ స్ట్రయిక్ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ మటిగిమును మన్కడింగ్ ద్వారా అవుట్ చేశాడు. మటిగిము బ్యాట్ క్రీజులో కాకుండా లైన్ పైన ఉండడంతో మూడో అంపైర్ కూడా నిబంధనల ప్రకారం అవుట్‌గా ప్రకటించారు.

దీంతో జింబాబ్వేకు ఊహించని షాక్ తగలగా... విండీస్ 2 పరుగుల తేడాతో నెగ్గింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన విండీస్ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 226 పరుగులు చేసింది. స్ప్రింగర్ (71 బంతుల్లో 61; 7 ఫోర్లు; 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేశాడు. మగరిరాకు మూడు, మధెవెరెకు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 49 ఓవర్లలో 224 పరుగులకు ఆలౌట్ అయ్యింది. స్నిడెర్ (71 బంతుల్లో 52; 9 ఫోర్లు), కీఫే (47 బంతుల్లో 43; 5 ఫోర్లు) బ్యాటింగ్‌తో జట్టు విజయం వైపు పయనించినా చివర్లో దురదృష్టం వెంటాడింది. జోసెఫ్‌కు నాలుగు, స్ప్రింగర్‌కు రెండు వికెట్లు వచ్చాయి.
 
భారత్ ప్రత్యర్థి నమీబియా

అండర్-19 ప్రపంచకప్ గ్రూప్ ‘డి’లో టాపర్‌గా నిలిచిన భారత్... క్వార్టర్ ఫైనల్లో నమీబియాతో తలపడుతుంది. గ్రూప్ ‘ఎ’లో ఈ జట్టు రెండో స్థానంలో నిలిచింది. శనివారం ఫతుల్లాలో భారత్ క్వార్టర్ ఫైనల్ ఆడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement