
నాగ్‌పూర్: భారత్‌తో ఘోర పరాజయానికి బ్యాటింగ్ వైఫల్యమే కారణమని శ్రీలంక కెప్టెన్ దినేష్ చండిమల్ అభిప్రాయపడ్డాడు. ఇర రెండో టెస్టులో ఇన్నింగ్స్ 239 పరుగుల తేడాతో శ్రీలంక దారుణంగా ఓటమి పాలైన విషయం తెలిసిందే.
మ్యాచ్ అనంతరం చండిమల్ మాట్లాడుతూ.. ‘ తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులు చేయాల్సింది. కానీ చేయలేదు. తొలి ఇన్నింగ్స్‌లో మంచి స్కోరు చేయలేనప్పుడు ఏ జట్టుతో పోరాడటమైన కష్టం. పైగా మేము ప్రపంచ దిగ్గజ జట్టుతో ఆడుతున్నాం. టాస్ గెలిచినా ఆటగాళ్లు రాణించలేకపోయారు. నా కెప్టెన్సీలో అత్యంత దారుణ ఓటమి నమోదు కావడం చాలా బాధగా ఉంది. పాక్‌తో సిరీస్ అనంతరం గొప్ప లక్ష్యంతో భారత్‌కు వచ్చాం. కానీ మా ఆశలన్నీ అడియాశలయ్యాయి. మాకు మేం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మా బౌలర్లు కొంత మేర పర్వాలేదనిపించారు. బ్యాటింగ్‌లో విఫలమైనప్పుడు వారు మాత్రం ఏం చేయగలరు. ఫీల్డింగ్‌లో కూడా మేం దారుణంగా విఫలమయ్యాం.’ అని చండిమల్ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇక ఆటగాళ్ల ప్రదర్శనపై శ్రీలంక తాత్కాలిక కోచ్ నిక్ పోథాస్ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ ఘోరపరాభవాన్ని మూటకట్టుకున్నందుకు లంక క్రికెటర్లు సిగ్గుపడాలని చురకలంటించాడు.