భారత్‌కు ఊరట | We Played Under Pressure in Thomas Cup, Says Parupalli Kashyap | Sakshi
Sakshi News home page

భారత్‌కు ఊరట

May 22 2014 12:55 AM | Updated on Sep 2 2017 7:39 AM

భారత్‌కు ఊరట

భారత్‌కు ఊరట

వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి... థామస్ కప్ ప్రపంచ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో నాకౌట్ అవకాశాలను కోల్పోయిన భారత పురుషుల జట్టు చివరి లీగ్ మ్యాచ్‌లో మాత్రం గెలిచింది. జర్మనీతో బుధవారం జరిగిన ఈ పోటీలో టీమిండియా 3-2తో విజయం సాధించింది.

చివరి లీగ్ మ్యాచ్‌లో జర్మనీపై 3-2తో గెలుపు
 కీలక మ్యాచ్‌ల్లో నెగ్గిన గురుసాయిదత్, శ్రీకాంత్
 
 న్యూఢిల్లీ: వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి... థామస్ కప్ ప్రపంచ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో నాకౌట్ అవకాశాలను కోల్పోయిన భారత పురుషుల జట్టు చివరి లీగ్ మ్యాచ్‌లో మాత్రం గెలిచింది. జర్మనీతో బుధవారం జరిగిన ఈ పోటీలో టీమిండియా 3-2తో విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో భారత నంబర్‌వన్, ప్రపంచ 18వ ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్ 21-18, 18-21, 21-18తో ప్రపంచ 13వ ర్యాంకర్ మార్క్ జ్విబ్లెర్‌ను ఓడించి శుభారంభం అందించాడు. అయితే రెండో మ్యాచ్‌లో  సుమీత్ రెడ్డి-మనూ అత్రి ద్వయం 15-21, 6-21తో మైకేల్ ఫుచస్-ష్కోట్లెర్ జోడి చేతిలో ఓడింది.
 
 దాంతో స్కోరు 1-1తో సమమైంది. మూడో మ్యాచ్‌లో భారత కెప్టెన్, ప్రపంచ 21వ ర్యాంకర్ కశ్యప్ 21-23, 21-14, 14-21తో ప్రపంచ 59వ ర్యాంకర్ దితెర్ డోమ్కె చేతిలో అనూహ్యంగా ఓడిపోవడంతో భారత్ 1-2తో వెనుకబడింది. గతంలో డోమ్కెతో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన కశ్యప్ ఈసారి ఓడిపోవడం గమనార్హం. నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన నాలుగో మ్యాచ్‌లో భారత జోడి అక్షయ్-ప్రణవ్ చోప్రా రాణించింది. 21-9, 17-21, 21-19తో పీటర్ కెస్‌బార్-జుర్వోని జంటపై నెగ్గి స్కోరును 2-2తో సమం చేసింది.

 నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో గురుసాయిదత్ అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. 62 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో గురుసాయిదత్ 14-21, 21-19, 21-19తో ష్కెమిడ్‌ను ఓడించి భారత్‌కు 3-2తో విజయాన్ని అందించాడు. ఈ టోర్నీలో గురుసాయిదత్ ఒక్కడే భారత్ తరఫున సింగిల్స్ విభాగంలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచాడు. గురువారం జరిగే ఉబెర్ కప్ మహిళల విభాగం క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్ లేదా ఇండోనేసియా లేదా డెన్మార్క్ జట్టుతో భారత్ ఆడే అవకాశం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement