వారి వల్లే మేం ఫైనల్‌కు వచ్చాం: ధోనీ

We are in the final because of our bowlers, Says Dhoni - Sakshi

వైజాగ్‌ : ఎంఎస్‌ ధోనీ మరోసారి తానేంటో నిరూపించాడు. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో డ్యాడ్స్‌ ఆర్మీగా పేరొందిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టును మరోసారి ఫైనల్‌కు చేర్చాడు. వైజాగ్‌లో శుక్రవారం జరిగిన రెండో క్వాలిఫైయర్‌ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆరు వికెట్లతో సునాయస విజయాన్ని అందుకోవడం ద్వారా చెన్నై జట్టు ఎనిమిదిసారి ఐపీఎల్‌ ఫైనల్‌కు చేరింది.

సమిష్టి ప్రదర్శనతో ఆకట్టుకున్న ధోనీ సేన.. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ను నిర్ణీత 20 ఓవర్లలో 9వికెట్లకు 147 పరుగులకు పరిమితం చేసింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై.. డు ప్లెసిస్‌,  షేన్‌ వాట్సన్ అర్ధ సెంచరీలతో రాణించడంతో అలవోకగా విజయం సాధించింది. మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన ధోనీ.. ఈ సీజన్‌లో చెన్నై జట్టు మంచి ప్రదర్శనకు, ఫైనల్‌కు చేరడానికి బౌలర్లే కారణమని ప్రశంసల జల్లు కురిపించారు.

‘వికెట్లు పడగొట్టడమే మ్యాచ్‌లో అత్యంత కీలకం. కాబట్టి బౌలర్లకే క్రెడిట్‌ ఇవ్వాల్సిందే. తనకు ఏం కావాలన్నది కెప్టెన్‌ అడుగుతాడు. దానిని బట్టి బౌలర్లు ఎలా బౌలింగ్‌చేయాలి, ఎలా వికెట్లు తీయాలి అన్నది నిర్ణయించుకుంటారు. ఈ సీజన్‌లో మేం ఇక్కడ ఉన్నామంటే అందుకే బౌలర్లే కారణం. మా బౌలింగ్‌ డిపార్ట్‌మెంట్‌కు థాంక్స్‌ చెప్తున్నా’ అని ధోనీ వివరించారు.

ఐపీఎల్‌ 12వ సీజన్‌లో ఫైనల్‌కు చేరుకున్న చెన్నై జట్టు ఆదివారం ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ‘గత ఏడాది కన్నా భిన్నంగా ఈ సారి ఐపీఎల్‌ ఫైనల్‌కు వచ్చాం. గత మ్యాచ్‌లో పరుగుల విషయంలో, క్యాచ్‌ల విషయంలో కొన్ని తప్పులు జరిగాయి. కానీ గట్టిగా కమ్‌బ్యాక్‌ ఇచ్చాం. 140కిపైగా పరుగుల లక్ష్యాన్ని సులభంగా ఛేదించడం ఆనందంగా ఉంది. మా బౌలర్ల కృషి కూడా చాలా బావుంది.  ఢిల్లీని భారీ స్కోరు చేయకుండా కట్టడి చేయగలిగాం. వాళ్ల బ్యాటింగ్‌ చాలా బలంగా ఉంది. ఓపెనర్లను త్వరగా ఔట్‌ చేయడం చాలా ముఖ్యంగా భావించాం. ఢిల్లీలో లెఫ్ట్‌ హ్యాండర్స్‌ చాలామంది ఉన్నారు. వారిని కట్టడి చేసేందుకు మా దగ్గర ఉన్న లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ను వాడాం. మైదానం చిన్నగా ఉండటంతో త్వరగా వికెట్లు రాబట్టడం కీలకంగా భావించాం’ అని ధోనీ తెలిపారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top