విరాట్‌ కోహ్లి మరో రికార్డు

 Virat Kohli fastest to 4000 ODI runs as captain - Sakshi

రాంచీ: ఇప్పటికే ఎన్నో ఘనతల్ని తన పేరిట లిఖించుకుని క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లి మరో రికార్డు సాధించాడు. వన్డే ఫార్మాట్‌లో అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌ల్లో నాలుగువేల పరుగులు సాధించిన కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో కోహ్లి ఈ మార్కును చేరాడు. కెప్టెన్‌గా నాలుగువేల పరుగులు సాధించడానికి కోహ్లి ఆడిన ఇన్నింగ్స్‌ 63. దాంతో ఇప్పటివరకూ దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌ పేరిట ఉన్న రికార్డును కోహ్లి బ్రేక్‌ చేశాడు. ఏబీ డివిలియర్స్‌ కెప్టెన్‌గా నాలుగువేల పరుగులు సాధించడానికి ఆడిన ఇన్నింగ్స్‌ 77.

అయితే వన్డే కెప్టెన్‌గా నాలుగువేల పరుగులు సాధించిన నాల్గో భారత ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. కోహ్లి కంటే ఎంఎస్‌ ధోని, అజహరుద్దీన్‌, సౌరవ్‌ గంగూలీలు మాత్రమే భారత్‌ తరఫున నాలుగువేల పరుగులు సాధించిన సారథులు. ఇప్పుడు వారి సరసన కోహ్లి చేరిపోయాడు. ఓవరాల్‌గా చూస్తే ఈ ఘనత సాధించిన 12వ కెప్టెన్‌గా కోహ్లి నిలిచాడు. ఆసీస్‌తో మ్యాచ్‌లో కోహ్లి హాఫ్‌ సెంచరీ సాధించాడు. భారత్‌ 27 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ తరుణంలో కోహ్లి మరోమారు ఆకట్టుకున్నాడు. 52 బంతుల్లో అర్థ శతకం నమోదు చేశాడు. గత మ్యాచ్‌లో కోహ్లి సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా 40వ వన్డే శతకాన్ని కోహ్లి తన ఖాతాలో వేసుకున్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top