శంకరన్నా.. సూపరన్నా!

Vijay Shankar Stunning Performance in Nagpur Odi - Sakshi

ఆలౌరౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్న విజయ్‌ శంకర్‌

సోషల్‌ మీడియాలో ప్రశంసలజల్లు

నాగ్‌పూర్‌ : టీమిండియా ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌.. సరిగ్గా ఏడాది క్రితం నిదాహస్‌ ట్రోఫీ ఫైనల్లో ఒత్తిడిని అధిగమించలేక.. బ్యాటింగ్‌లో తడబడ్డ ఆటగాడిగా మాత్రమే తెలుసు. దాదాపు ఓటమి అంచునకు చేరిన ఆ మ్యాచ్‌ను దినేశ్‌ కార్తీక్‌ గట్టెక్కించడంతో ఈ యువ ఆల్‌రౌండర్‌ ఊపిరి పీల్చుకున్నాడు. కానీ అతని ప్రదర్శనపై యావత్‌ భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెళ్లి టెన్నిస్‌ బాల్‌ క్రికెట్‌ ఆడుకోపో.. అని ఘాటుగా కామెంట్‌ చేశారు. దీంతో అతని కెరీర్‌ ముగిసినట్టేనని అందరూ భావించారు. కానీ  వీటిని పెద్దగా పట్టించుకోని శంకర్‌.. తన బలహీనతలను అధిగమిస్తూ డొమెస్టిక్‌ క్రికెట్‌లో రాణిస్తూ సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. (చదవండి : అయ్యో.. విజయ్‌ శంకర్‌)

భారత జట్టులో ఆడాలనే సుడి బాగుందో ఏమో కానీ శంకర్‌కు పరిస్థితులు బాగా కలిసొచ్చాయి. సరిగ్గా ఆస్ట్రేలియాలోని వన్డే సిరీస్‌కు ముందు టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ కేఎల్‌ రాహుల్‌లు మహిళలపై అనుచిత వ్యాఖ్యలతో నిషేధానికి గురవ్వడం.. మనోడికి కలిసొచ్చింది. హార్దిక్‌ స్థానంలో సెలక్టర్లు శంకర్‌కు అవకాశం కల్పించారు. ఇక్కడి నుంచి మనోడికి అన్ని కలిసొచ్చాయి. ఎంతలా అంటే ప్రపంచకప్‌ జట్టులో దాదాపు చోటు దక్కించుకునేంత. ఆ సిరీస్‌లోని ఓ మ్యాచ్‌లో జట్టు క్లిష్టపరిస్థితుల్లో ఉన్న సమయంలో అంబటి రాయుడుతో కలిసి నెలకొల్పిన భాగస్వామ్యం శంకర్‌ సామర్థ్యాన్ని చాటింది. ప్రపంచకప్‌ సన్నాహకంలో జరుగుతున్న తాజా సిరీస్‌కు ఎంపిక కావాడానికి కూడా అదే కారణం. (చదవండి: నేను ఆశ్చర్యపోయా: విజయ్‌ శంకర్‌)

ఇక తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన నాగ్‌పూర్‌ వన్డేలో శంకర్‌ తన బౌలింగ్‌ ప్రదర్శనతో ఔరా అనిపించాడు. చివరి ఓవర్లో ఆస్ట్రేలియా విజయానికి 11 పరుగులు కావాలి. ప్రధాన బౌలర్ల కోటా పూర్తి కావడంతో 50వ ఓవర్‌ను మీడియం పేసర్‌ విజయ్‌ శంకర్‌తో వేయించాల్సి వచ్చింది. అయితే ఇలాంటి క్లిష్ట స్థితిలో అనుభవం లేకపోవడంతో పాటు వైజాగ్‌ టీ20లో ఉమేశ్‌ యాదవ్‌ వైఫల్యం వెంటాడుతుండగా అందరికీ అతనిపై సందేహాలు. పైగా అప్పటి వరకు బుమ్రా, షమీ బౌలింగ్‌ను అతి జాగ్రత్తగా ఆడుకొని చివరి ఓవర్‌ కోసం వేచి చూస్తున్న స్టొయినిస్‌ జోరు మీదున్నాడు. నిదాహస్‌ ట్రోఫీ ఫైనల్లోనే బిస్కెట్‌ చేసిన శంకర్‌ బౌలింగ్‌లో రెండు భారీ షాట్లు పడితే అంతే సంగతులు..! ఈ మ్యాచ్‌ కూడా పోయేలా ఉందని అందరూ నెత్తులుపట్టుకున్నారు. కానీ  అలా జరగలేదు. శంకర్‌ అద్భుతం చేశాడు. ఏమాత్రం ఊహించని ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. (చదవండి: మా వరల్డ్‌కప్‌ ప్రణాళికల్లో ఆ ముగ్గురు)

తొలి బంతికే అతను స్టొయినిస్‌ను ఎల్బీగా ఔట్‌ చేసి దాదాపుగా మ్యాచ్‌ను ముగించాడు. రివ్యూలో కూడా ఫలితం భారత్‌కే అనుకూలంగా వచ్చింది. 6 వన్డేల కెరీర్‌లో అతనికి ఇదే తొలి వికెట్‌ కావడం విశేషం. మరో రెండు బంతులకు జంపాను బౌల్డ్‌ చేసి జట్టును గెలిపించాడు.  46వ ఓవర్‌నే శంకర్‌తో వేయించాలని తాను అనుకున్నానని, అయితే బుమ్రా, షమీ వరుసగా నాలుగు ఓవర్లు వేసి 49వ ఓవర్లోనే ఆట ముగిస్తారని ధోని, రోహిత్‌ చెప్పిన సలహాను పాటించానని మ్యాచ్‌ అనంతరం కోహ్లి చెప్పాడు. అటు బ్యాటింగ్‌లోను శంకర్‌ (46) కెప్టెన్‌ కోహ్లితో కలసి 81 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ ప్రదర్శనతో విజయశంకర్‌పై భారత అభిమానులు, మాజీ క్రికెటర్లు, క్రికెట్‌ విశ్లేషకులు ప్రశంసలజల్లు కురిపిస్తున్నారు. ‘శంకరన్నా.. నీవు సూపరన్నా’  అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ‘నీకు ప్రపంచకప్‌ కప్‌ బెర్త్‌ పక్కా పో’ అంటున్నారు. (చదవండి: అద్భుతం... 500...వ విజయం)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top