
థ్యాంక్యూ..బోల్ట్!
ఎనిమిది ఒలింపిక్ స్వర్ణాలు... 11 ప్రపంచ చాంపియన్‌షిప్ స్వర్ణాలు... 100 మీటర్ల పరుగు
►క్రికెట్‌లో డాన్ బ్రాడ్‌మన్ తన ఆఖరి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు... అయితే అతని గొప్పతనంలో ఒక్క పరుగంత తేడా కూడా రాలేదు!
► బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ తన చివరి రెండు బౌట్‌లలో చిత్తయ్యాడు... కానీ అది అతని పంచ్‌ల పవర్‌ను తక్కువ చేయలేదు!
ఎనిమిది ఒలింపిక్ స్వర్ణాలు... 11 ప్రపంచ చాంపియన్‌షిప్ స్వర్ణాలు... 100 మీటర్ల పరుగులో టాప్–3 టైమింగ్స్... దశాబ్దకాలం పాటు స్ప్రింట్స్‌లో ఏక ఛత్రాధిపత్యం... డోపింగ్‌లాంటి ఒక్క మరక కూడా అంటకుండా, వివాదమే లేకుండా సాధించిన విజయాలు... ఇలాంటి ఘనతలన్నీ ఉసేన్ బోల్ట్‌కు మాత్రమే సాధ్యమయ్యాయి. చివరి రేసులో స్వర్ణం దక్కనంత మాత్రాన ఈ ‘ఆల్‌టైమ్ గ్రేట్’ ఆకాశమంత ఇమేజ్‌కు కించిత్ కూడా భంగం వాటిల్లదు. అద్భుతం అనే మాటను ఎప్పుడో తనకు పర్యాయపదంగా మార్చుకున్న ఈ జమైకా స్టార్ క్రీడా ప్రపంచంపై వేసిన ముద్ర చెరిగిపోనిది. ప్రపంచ అథ్లెటిక్స్‌ను శాసించిన అతని ‘టు ద వరల్డ్’ సిగ్నేచర్ స్టయిల్ రాబోయే తరాల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. గొప్ప ఆటగాళ్ల కెరీర్‌లకు గొప్ప ముగింపు లభించకపోవచ్చు. కానీ ఆటలో మాత్రం వారు ఎప్పటికీ చిరంజీవిగానే మిగిలిపోతారు. ఇంతకాలం మమ్మల్ని అలరించినందుకు థ్యాంక్యూ బోల్ట్...!
100 మీటర్ల పరుగులో నమోదైన అత్యుత్తమ టాప్–30 జాబితా (9.8 సెకన్ల లోపు) తీస్తే అందులో 9 చోట్ల ఉసేన్ బోల్ట్ పేరుంది. అయితే ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. కానీ మిగతా 23 టైమింగ్‌లను నెలకొల్పిన వారి పేర్లను చూస్తే వారంతా ఏదో ఒకసారి డోపింగ్‌లో పట్టుబడినవారే! అంటే 30లో బోల్ట్ మినహా మరే ఇతర పేరు అక్కడ కనిపించదు. ఇందులో గాట్లిన్, టైసన్ గే, యోహాన్ బ్లేక్, అసఫా పావెల్... ఇలా అంతా బోల్ట్ తరంలోని వారు, అగ్రస్థానం కోసం అతనితో పోటీ పడినవారే. ఇది చాలు బోల్ట్ గొప్పతనాన్ని చెప్పేందుకు. ఒకదశలో డోపింగ్ అనేది అథ్లెటిక్స్‌లో భాగంగా మారిపోయేంత ప్రమాదకర స్థితికి చేరిన సమయంలో కూడా ఈ సూపర్ స్టార్ తన గౌరవాన్ని నిలబెట్టుకున్నాడు. వరుసగా మూడు ఒలింపిక్స్‌లలో అతని ఆధిపత్యం ముందు మరే పేరు వినిపించలేదు. 100 మీటర్లు, 200 మీటర్లు, 4్ఠ100 మీటర్ల రిలేలలో బోల్ట్ సాధించిన స్వర్ణాలు అతని అసాధారణ ప్రతిభకు నిదర్శనం. ఇక మూడు ప్రపంచ రికార్డులు అతని పేరిటే ఉన్నాయి.
తప్పనిసరి పరిస్థితుల్లోనే...
వాస్తవానికి గత ఏడాది రియో ఒలింపిక్స్ తర్వాతే బోల్ట్ రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాడు. అయితే తన కాంట్రాక్ట్ కారణంగా మరో ఏడాది ట్రాక్‌లో కొనసాగాల్సి వస్తోందని అతను ముందే చెప్పాడు. తను ఆట ముగించే సమయం వచ్చిందని బోల్ట్‌కు ముందే తెలుసు! అందుకే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అతను కావాలనే 200 మీటర్ల పరుగు నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఈవెంట్‌లో ఆండ్రీ డీ గ్రేస్‌ను గానీ వేడ్ నికెర్క్‌ను గానీ ఓడించలేనని తనకు తెలుసంటూ బోల్ట్ సన్నిహితుల వద్ద చెప్పుకున్నాడు. ఈ సీజన్‌లో సొంతగడ్డ కింగ్‌స్టన్‌లో జరిగిన రేసర్స్ గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచినా...10.03 సెకన్ల టైమింగ్‌తో అతను తీవ్ర నిరాశ చెందాడు.
ఆ తర్వాత చెక్ రిపబ్లిక్‌లో గోల్డెన్ స్పైక్ రేసులో కూడా బోల్ట్ రేస్ పూర్తి చేసేందుకు 10.06 సెకన్లు తీసుకున్నా డు. 2004లో ప్రొఫెషనల్‌గా మారిన తర్వాత వరుసగా రెండు ఈవెంట్లలో అతనికి 10 సెకన్లకు పైగా పట్టడం ఎప్పుడూ జరగలేదు! ఆ తర్వాత మొనాకో డైమండ్ లీగ్‌లో 9.95 సెకన్లతో విజయం సాధించడం బోల్ట్ ప్రపంచ చాంపియన్‌షిప్ ప్రదర్శనపై ఆశలు రేపింది. శనివారం అతను మూడో స్థానంలో నిలిచిన రేస్‌ను చూస్తే బోల్ట్ సత్తా తగ్గినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కొన్నాళ్ల క్రితమే తన ఆత్మీయ మిత్రుడు జర్మైన్ మాసన్ ఒక దుర్ఘటనలో చనిపోవడం కూడా అతనిపై ఇటీవల మానసికంగా తీవ్ర ప్రభావం చూపించింది.
ఆ వేడుకలు ముగిశాయి...
15 ఏళ్ల వయసులో 2002లో తొలిసారి వరల్డ్ జూనియర్ చాంపియన్‌గా నిలిచిన క్షణం బోల్ట్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు బోల్ట్ క్రీడా ప్రపంచాన్ని, అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. సెకనులో వందో వంతు వ్యవధిలో జీవితాలు మారిపోయే ఆటలో అతను తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూనే వచ్చాడు. బోల్ట్ తనకుతాను కొత్త లక్ష్యాలు విధించుకుంటూ పరుగు కొనసాగించాడు. వాటిని అంతే అలవోకగా తానే అధిగమిస్తూ పోయాడు. పరుగు పూర్తి కాగానే తన గుండెలపై బలంగా బాది సింహనాదం చేయడం... తనదైన స్పెషల్ ‘పోజు’తో కెమెరా కళ్లకు కనువిందు చేయడం... మైదానమంతా కలియదిరిగి అభిమానులకు ఆనందం పంచడం బోల్ట్‌కే చెల్లింది. అప్పటి వరకు నిస్సారంగా కనిపించిన అథ్లెటిక్స్ స్టేడియంలో మెరుపులా వచ్చి జీవం నింపడం అతనికే సాధ్యం. ఇకపై ఇలాంటివన్నీ కనిపించవు.
ఒక్కసారి పరుగు ప్రారంభమైందంటే పది సెకన్ల పాటు కన్నార్పకుండా చూసే అభిమానులు కూడా కొన్నాళ్ల పాటు వంద మీటర్లకు విరామం ఇవ్వక తప్పదేమో! ప్రతీ కథకు ఎక్కడో ఒక చోట ముగింపు ఉంటుంది. అయితే ఆరంభం అద్భుతమైనప్పుడు అంతం కూడా అంతే ఆసక్తిని రేకెత్తించడం సహజం. ఆఖరి రేస్‌లో ఓడినా... ఇక ముందు కూడా రాబోయే ప్రపంచం అతడిని అందుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది.
మరో అవకాశం ఉంది...
తనకెంతో ప్రత్యేకమైన 100 మీటర్ల ఈవెంట్‌ను స్వర్ణంతో ముగించాలని ఆశించిన బోల్ట్‌కు నిరాశ ఎదురైనా... తన ఓవరాల్ కెరీర్‌కు పసిడితో వీడ్కోలు పలికేందుకు జమైకా స్టార్‌కు మరో అవకాశం మిగిలి ఉంది. తన సహచరులతో కలిసి బోల్ట్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనే ఈనెల 12న జరిగే 4 *100 మీటర్ల రిలేలో పాల్గొననున్నాడు. గత నాలుగు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో బోల్ట్ సభ్యుడిగా ఉన్న జమైకా జట్టు 4*100 మీటర్ల రిలేలో స్వర్ణాలు గెలిచింది. మరీ ఈసారి ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాలి.
పబ్‌లో కూర్చొని పిచ్చాపాటీ మాట్లాడుకునే సమయంలో ప్రపంచంలో అత్యుత్తమ ఫుట్‌బాలర్ ఎవరు అనే చర్చ వస్తే అందరూ ఒక్కో పేరు చెబుతారు. గోల్ఫ్‌లో అయినా, టెన్నిస్‌లో అయినా వారి అభిప్రాయాల్లో కచ్చితంగా తేడాలు ఉంటాయి. కానీ స్ప్రింట్ విషయానికి వస్తే గుడ్డిగా, మరో మాటకు తావు లేకుండా అంతా బోల్ట్‌కే ఓటు వేస్తారు.
–సెబాస్టియన్ కో, ఐఏఏఎఫ్ అధ్యక్షుడు
ఎలాంటి బాధా లేదు. ఇక్కడికి వచ్చి నా శాయశక్తులా ప్రయత్నించాను. ఇక్కడ గెలిచినా, ఓడినా ఫలితంతో సంబంధం లేకుండా ఆట ముగించాలని ముందే నిర్ణయించుకున్నాను. నా కెరీర్‌పై దీని ప్రభావం ఏమాత్రం ఉండదు. నా కోసం ఈ ఆట కోసం నేనేం చేయాలో అంతా చేశాను. ఇక నిష్క్రమించాల్సిన సమయం వచ్చింది. ఒక పోరాట యోధుడి (గాట్లిన్) చేతిలో, మంచి భవిష్యత్తు ఉన్న మరో ప్రతిభావంతుడి (కోల్మన్) చేతిలో ఇక్కడ ఓడిపోయాను. ఈ సీజన్‌లో ఎలాంటి ఫలితాలు వస్తాయనేది ఆలోచించకుండా అభిమానుల కోసమే బరిలోకి దిగాను. నేను చాలా కష్టపడ్డాను కాబట్టి కొంత నిరాశ ఉండటం సహజం. ఓడిపోతే ఎవరూ సంతోషించరు కదా. కానీ నా అత్యుత్తమ ఆట కనబర్చానని నాకు బాగా తెలుసు. మంచి ఆరంభం లభించకపోవడంతో నేను గెలవడం కష్టమని అర్థమైపోయింది. గాట్లిన్ ఎన్నో సంవత్సరాలుగా కఠినంగా శ్రమించాడు. అతనికి గెలిచే అర్హత ఉంది. ఒక వ్యక్తిగా, పోటీదారుడిగా కూడా నేను అతడిని ఎంతో గౌరవిస్తాను. – ఉసేన్ బోల్ట్