సోషల్‌ మీడియాలో రోహిత్‌పై పేలిన జోక్స్‌

 Twitter roasts Rohit Sharma after his 59-ball 11 in Newlands Test - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దక్షిణాఫ్రికా పర్యటనలో భారత స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ విఫలమవ్వడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే కోహ్లిపై సోషల్‌ మీడియా వేదికగా సెటైర్లు వేసిన నెటిజన్లు తాజాగా రోహిత్‌ను రోస్ట్‌ చేశారు. కుళ్లు జోకులతో, ఫొటో, వీడియో మార్ఫింగ్‌లతో హిట్‌ మాన్‌ బ్యాటింగ్‌ వైఫల్యాన్ని ఎండగడుతున్నారు.  ఇక రోహిత్‌ 59 బంతులు ఎదుర్కొని 11 పరుగులు చేయడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది.

హిట్‌ మాన్‌గా ముద్ర వేసుకున్న రోహిత్‌ తన శైలికి భిన్నంగా బంతిని బ్యాట్‌కు తగిలించడంలో తెగ ఇబ్బంది పడ్డాడు. స్టెయిన్‌, రబడా, మోర్కెల్‌ బౌలింగ్‌ను ఎదుర్కొనలేక చేతులేత్తేశాడు. రబడా బౌలింగ్‌ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌ చేరాడు. శ్రీలంక సిరీస్‌లో సూపర్‌ ఫామ్‌ కనబర్చడంతో కెప్టెన్‌ కోహ్లి వైస్‌ కెప్టెన్‌ రహానేను కాదని తుది జట్టులోకి తీసుకున్నాడు. కానీ హిట్‌ మ్యాన్‌  కోహ్లి పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేశాడు. ఇప్పటికే రహానేను ఎందుకు తీసుకోలేదని అభిమానులు, మాజీ క్రికెటర్లు కోహ్లిని ఎత్తిపొడుస్తుండగా.. రోహిత్‌ వైఫల్యం కోహ్లికి మరిన్ని చికాకులు తెప్పించనుంది.

రోహిత్‌పై పేలిన జోకులు..
‘డేల్‌ స్టెయిన్‌ బౌలింగ్‌ ఎదుర్కుంటే రోహిత్‌ డబుల్‌ సెంచరీ చేసినట్టే’

పేస్‌ బౌలింగ్‌ను ఎదుర్కొనడంలో గంటసేపు తడబడ్డ రోహిత్‌  నాకు తెలిసి గత మూడు దశాబ్దాలుగా భారత క్రికెట్‌ చరిత్రలోనే బెస్ట్‌ వాచ్‌మన్‌.

భారత్‌లోనే రోహిత్‌ వంద, రెండొందలు బాదగలడు..కానీ విదేశాల్లో రాణించలేడు.

సీమర్స్‌ను ఎదుర్కోవాలంటే రోహిత్‌ ఒళ్లంతా ప్యాడ్స్‌ పెట్టుకోవాలి

తొలి ఇన్నింగ్స్‌లో 92 కే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్‌ని ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా అపద్భాందవుడిలా ఆదుకున్నాడు. తృటిలో సెంచరీ చేజార్చుకున్న పాండ్యా(93) భారత్‌ గౌరవ ప్రదమైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. భారత్‌ 209 పరుగులకు ఆలౌట్‌ అయిన విషయం తెలిసిందే. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన దక్షిణాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేసింది. ఈ రెండు వికెట్లు సైతం పాండ్యా తీయడం విశేషం. ఇక భారత రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్‌ రాణించకపోతే రెండో టెస్టు తుది జట్టులో చోటు దక్కడం కష్టమవుతోంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top