స్మిత్‌ మళ్లీ మైండ్‌ పనిచేయ లేదా! | Twitter Recalls Steve Smith Brainfade | Sakshi
Sakshi News home page

Mar 25 2018 4:34 PM | Updated on Oct 22 2018 6:10 PM

Twitter Recalls Steve Smith Brainfade - Sakshi

స్టీవ్‌ స్మిత్‌

సాక్షి, హైదరాబాద్‌ : బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంతో చిక్కుల్లో పడ్డ ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌పై అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. స్మిత్‌ మళ్లీ మైండ్‌ పనిచేయ లేదా ( బ్రెయిన్‌ ఫేడ్‌) అంటూ గత భారత్‌-ఆసీస్‌ టెస్ట్‌ సిరీస్‌ వివాదాన్ని గుర్తు చేస్తున్నారు.

గతేడాది భారత్‌తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో స్మిత్‌ డిసిషన్‌ రివ్యూ సిస్టమ్‌ (డీఆర్‌ఎస్‌)ను డ్రెస్సింగ్‌ రూమ్‌ రివ్యూ సిస్టమ్‌గా మార్చి విమర్శలపాలైన విషయం తెలిసిందే. అప్పట్లో తన మైండ్‌ పనిచేయలేదని, దాంతోనే అలా చేసానని స్మిత్‌ పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలను తాజా వివాదానికి అంటగడుతూ అభిమానులు  విమర్శలు గుప్పిస్తున్నారు.

 కేప్‌టౌన్‌ టెస్టులో ఓ కెప్టెన్‌గా స్మిత్‌ దిగజారిపోయాడని ఒకరంటే.. రబడ వ్యవహారంలో నీతులు చెప్పిన స్మిత్‌ క్రీడా స్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించవచ్చా అని ఇంకొకరు ప్రశ్నిస్తున్నారు. బాల్‌టాంపరింగ్‌ ఉదంతం స్మిత్‌ కెరీర్‌ను ప్రశ్నార్ధకంలో పడేసిందని, ఆటలో చీటింగ్‌ చేయడం సిగ్గుమాలిన చర్య అని మరొకరు కామెంట్‌ చేశారు. బాల్‌ట్యాంపరింగ్‌ జట్టు సమష్టి నిర్ణయమని చెప్పడంపై కూడా కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్మిత్‌కు  వివాద పరిస్థితి అర్థం కాలేదని, తమ జట్టు చీటింగ్‌ చేస్తూ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికి పోయిన విషయాన్ని అతను అర్థం చేసుకోలేకపోయాడని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఈ వివాదం నేపథ్యంలో ఈ సీజన్‌ ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు స్మిత్‌ను కెప్టెన్‌ నుంచి తొలిగించే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై సైతం నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు. రాజస్తాన్‌ జట్టు చర్య నీరవ్‌ మోదీ మోసం చేస్తే ఉద్యోగిని తొలిగించినట్లుందని కామెంట్‌ చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement