చిత్ర విచిత్ర రనౌట్‌లు!

Top Bizarre run outs Incidents In Cricket History - Sakshi

బంతి బౌండరీ దాటిందని రిలాక్స్‌ అవడమో, క్రీజులోకి వచ్చామనే భ్రమలో ఉండటంతోనో లేక అతితొందరతోనో బ్యాట్స్‌మన్‌ రనౌట్‌ అవుతుంటారు. ఆస్ట్రేలియాతో రెండో టెస్టు సందర్భంగా పాకిస్తాన్‌ బ్యాట్స్‌మన్‌ అజహర్‌ అలీ వింతగా, నిర్లక్ష్యంగా రనౌట్‌ అవ్వడం తెలిసిందే. అయితే క్రికెట్‌ చరిత్రలో వినూత్న రనౌట్‌లు కోకొల్లలు. ఈ జాబితాలో పాకిస్తాన్‌ బ్యాట్స్‌మెన్‌ ఇంజమాముల్‌ హక్‌, మిస్బావుల్‌ హక్‌, మహ్మద్‌ అమిర్‌, టీమిండియా బ్యాట్స్‌మన్‌ వీరేంద్ర సెహ్వాగ్‌, ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ ఇయాన్‌ బెల్‌, అలిస్టర్‌ కుక్‌, శ్రీలంక ఆటగాడు ముత్తయ్య మురళీథరన్‌లు ఉన్నారు. క్రీజులో పాతుకపోతున్నారు, ఇక గెలిచినట్టే అన్న తరుణంలో సిల్లీగా రనౌట్‌లు అవ్వడం అటు జట్టుకు ఇటు అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించేదే. 

చేజింగ్‌ సమయంలో అందులోనూ చివర ఓవర్లలో ప్రతీ పరుగు ముఖ్యమైనదే. ఈ సమయంలో రనౌట్‌లు కామనే. కానీ టెస్టుల్లో, వన్డేల్లో మధ్య ఓవరల్లో నిర్లక్ష్యంతో రనౌటవ్వడం అందరికీ కోపాన్ని కలిగించే అంశం. వినూత్నంగా రనౌటవ్వడంలో పాక్‌ మాజీ సారథి ఇంజమాముల్‌ హక్‌ తొలి స్థానంలో ఉంటాడు. అందులోనూ కామెడీగా రనౌట్‌లయినవి 23 వరకు ఉండటం గమనార్హం. టీమిండియాతో వన్డే మ్యాచ్‌ సందర్భంగా బ్యాటింగ్‌ చేస్తున్న ఇంజమామ్‌.. ఫీల్డర్‌ వికెట్ల వైపు విసిరిన బంతిని అడ్డుకోవడంతో అంపైర్‌ రనౌట్‌గా ప్రకటించాడు. అప్పుడు ఇలాంటి రనౌట్‌లు కూడా ఉంటాయా అని అందరికీ ఆశ్చర్యం కలిగించింది. మిస్బావుల్‌ హక్‌, అమిర్‌, అజహర్‌ అలీలు కూడా ఫన్నీగా రనౌటయ్యారు. ఇక టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరెంద్ర సెహ్వాగ్‌కు పరుగెత్తడం కన్నా బౌండరీలు బాదడం ఈజీ అనుకుంటాడు. 2007లో శ్రీలంక నిర్దేశించిన 260 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో ఫామ్‌లో ఉన్న సెహ్వాగ్‌ సిల్లీగా రనౌటవ్వడం అందరికీ ఆగ్రహాన్ని తెప్పించింది. 

2011లో టీమిండియాతో టెస్టు సందర్భంగా బంతి బౌండరీ దాటిందని ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ ఇయాన్‌ బెల్‌ పిచ్‌ మధ్యలో సహచర బ్యాట్స్‌మన్‌తో రిలాక్స్‌ అవుతున్నాడు. అయితే బౌండరీ వద్ద బంతి అందుకున్న ఫీల్డర్‌  ప్రవీణ్‌ కుమార్‌, కీపర్‌ ధోని సహకారంతో బెల్‌ను రనౌట్‌ చేశాడు. దీంతో షాక్‌లోనే బెల్‌ మైదానాన్ని వీడాల్సివచ్చింది. 2012లో కోల్‌కతాలో ఇంగ్లండ్‌-టీమిండియా టెస్టు సందర్భంగా ఆతిథ్య జట్టు బ్యాట్స్‌మన్‌ కుక్‌ భయంతో సిల్లీగా అవుటయ్యాడు. సింగిల్‌ తీస్తున్న క్రమంలో ఫీల్డర్ విసిరిన బంతిని భయంతో తప్పించకోబోయి రనౌటగా వెనుదిరుగుతాడు. ఇక క్రికెట్‌ చరిత్రలో అత్యంత సిల్లీ రనౌట్‌ అంటే ముత్తయ్య మురళీథరన్‌దే అని చెప్పవచ్చు. 2006లో న్యూజిలాండ్‌-శ్రీలంక మ్యాచ్‌లో ఈ కామెడీ రనౌట్‌ చోటుచేసుకుంది. వరుసగా వికెట్లు పడుతుంటే ఒంటరి పోరాటం చేస్తున్న కుమార సంగక్కర ఒక్క పరుగు తీస్తే సెంచరీ పూర్తవుతుంది. అయితే స్ట్రైకింగ్‌లో ఉన్న సంగక్కర సింగిల్‌ తీసి శతకం అభివాదం చేస్తుండగానే అవతలి ఎండ్‌లో మురళీధరన్‌ అవుటని అంపైర్‌ ప్రకటించాడు. దీంతో సంగక్కర షాక్‌కు గురయ్యాడు. సహచర ఆటగాడిని అభినందించాలనే తొందరలో స్పిన్‌ మాంత్రికుడు సిల్లీగా రనౌటయ్యాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top