
సరైన వ్యవస్థ కావాలి
క్రికెట్‌ను ఆరాధించే భారత్‌లో టెన్నిస్ క్రీడ మరింత అభివృద్ధి చెందాలంటే సరైన వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని స్టార్ ప్లేయర్ సానియా మీర్జా అభిప్రాయపడింది...
- భారత్‌లో టెన్నిస్‌పై సానియా అభిప్రాయం
- ‘వింబుల్డన్ విజయం’ దేశానికి అంకితం
సాక్షి, హైదరాబాద్: క్రికెట్‌ను ఆరాధించే భారత్‌లో టెన్నిస్ క్రీడ మరింత అభివృద్ధి చెందాలంటే సరైన వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని స్టార్ ప్లేయర్ సానియా మీర్జా అభిప్రాయపడింది. మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి తొలిసారి వింబుల్డన్ మహిళల డబుల్స్ టైటిల్‌ను సాధించిన సానియా మీర్జా మంగళవారం ఉదయం తన స్వస్థలం హైదరాబాద్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సానియా వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆమె మాటల్లోనే...
పక్కా వ్యవస్థ కావాలి: మనది క్రికెట్‌ను ఆరాధించే దేశం. టెన్నిస్‌ను కెరీర్‌గా ఎంచుకొనే అనుకూల పరిస్థితులు లేవు. అయినప్పటికీ భారత టెన్నిస్‌కు మంచి రోజులు వచ్చాయి. ఈసారి వింబుల్డన్‌లో మనోళ్లకు మూడు టైటిల్స్ లభించాయి. టెన్నిస్ అభివృద్ధికి మనవద్ద సరైన వ్యవస్థ లేదు. ఇకనైనా ఈ ఆట పురోభివృద్ధికి మనకు పక్కా విధానం అవసరముందని భావిస్తున్నాను.
దేశానికి అంకితం: ఏనాటికైనా వింబుల్డన్ టోర్నీలో ఆడాలని చిన్నప్పటి నుంచి కోరిక ఉండేది. ఏకంగా వింబుల్డన్ టైటిల్ నెగ్గడంతో నా కల నిజమైంది. టెన్నిస్‌లోని నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గడం కూడా నా అదృష్టం. నా వింబుల్డన్ విజయాన్ని దేశానికి, నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ అంకితం ఇస్తున్నా. నేనీ స్థాయికి చేరుకోవడంలో నా తల్లిదండ్రులు నసీమా, ఇమ్రాన్ మీర్జాల కృషి ఎంతో ఉంది. నేను తీసుకున్న అన్ని నిర్ణయాలకు వారిద్దరూ సంపూర్ణ మద్దతు ఇచ్చారు.
యూఎస్ ఓపెన్‌పై దృష్టి: మార్టినా హింగిస్‌తో నా భాగస్వామ్యం, సమన్వయం చాలా బాగా కుదిరింది. ప్రతి టోర్నీలో మేమిద్దరం విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాం. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనూ టైటిల్ నెగ్గాలనే పట్టుదలతో ఉన్నాం. కెరీర్‌లో ఏనాడూ ధీర్ఘకాలిక లక్ష్యాలు నిర్దేశించుకోలేదు. రియో ఒలింపిక్స్‌కు మరో ఏడాది సమయం ఉన్నందున ఇప్పుడే దాని గురించి మాట్లాడటం అనవసరం.